రైతు కంట ‘తడి’

20 Aug, 2016 23:39 IST|Sakshi
రైతు కంట ‘తడి’

– ఆదుకోని రెయిన్‌గన్లు
– నీళ్లు, కరెంటు లేక ముందుకు సాగని రక్షకతడులు
– మూడు రోజుల్లో 4 వేల హెక్టార్లను కూడా తడపని వైనం
– ప్రమాదంలో పడిన 3.50 లక్షల హెక్టార్ల వేరుశనగ పంట
– నేడు జిల్లాకు వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

 
ఖరీఫ్‌లో ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా రక్షకతడులు (లైఫ్‌ సేవింగ్‌ ఇరిగేషన్స్‌) ఇచ్చి పంటను కాపాడుతామంటూ పాలకులు, అధికారులు ఆర్భాటంగా ప్రకటించినా క్షేత్రస్థాయిలో పది శాతం కూడా ఫలితం కనిపించడం లేదు. 20 రోజులైనా వాన చినుకు నేలకు పడకపోవడం, ఎండలు ముదిరిపోవడం, గాలిలో తేమశాతం తగ్గిపోవడంతో ‘అనంత’లో అప్పుడే కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. పంటకు నీరందించలేకపోతుండటంతో రైతులు కంట తడి పెడుతున్నాడు.


జిల్లాకు 4,200 సెట్ల చొప్పున రెయిన్‌గన్లు, స్ప్రింక్లర్‌ యూనిట్లు, డీజిల్‌ ఇంజిన్లు, అలాగే 1.30 లక్షల సంఖ్యలో హెచ్‌డీ పైపులు కేటాయించగా.. అందులో 3,107 సెట్ల రెయిన్‌గన్లు, 2,827 సెట్ల స్ప్రింక్లర్‌ యూనిట్లు, 1,626 డీజిల్‌ ఇంజిన్లు, 1.07 లక్షల హెచ్‌డీ పైపులు సరఫరా అయ్యాయి. వీటి ద్వారా ఈ నెల 18 నుంచి వేరుశనగ పంటకు రక్షకతడులు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమైంది. కానీ... అనుకున్న ఫలితాలు కనిపించకపోవడంతో రైతుల్లో రోజురోజుకు ఆందోళన ఎక్కువవుతోంది.

నీళ్లు, కరెంటు సమస్య
వర్షాలు లేక పంట కుంటలు, ఫారంపాండ్లు పూర్తిగా ఎండిపోవడం, భూగర్భజలాలు సగటున 19 మీటర్ల లోతుకు పడిపోవడంతో నీటి వనరుల లభ్యత సమస్యగా మారుతోంది. దానికి తోడు విద్యుత్‌ సరఫరా కూడా పగటి పూట మూడు నుంచి నాలుగు గంటల పాటు మాత్రమే ఉండటంతో ఆ సమయంలో ఒక్కో రెయిన్‌గన్‌ ద్వారా ఒక ఎకరా పొలాన్ని కూడా తడుపుకోలేని పరిస్థితి నెలకొంది. రెయిన్‌గన్లను కూడా పూర్తిస్థాయిలో వాడని పరిస్థితి. అందులోనూ కొన్ని మండలాల్లో తెలుగు తమ్ముళ్లు తమకే రెయిన్‌గన్లు ఇవ్వాలని అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నారు. దీంతో పంట ఎండినా కూడా కొందరు రైతులకు రెయిన్‌గన్ల ద్వారా నీటి తడులు ఇవ్వడానికి అధికారులు వెనుకాడుతున్నారు.

3.50 లక్షల హెక్టార్ల పంట
వర్షాభావం వెంటాతుండటం, రెయిన్‌గన్ల ద్వారా ఫలితం కనిపించకపోవడంతో 3.50 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వేరుశనగ పంట ప్రమాదంలో పడింది. అధికారులు రూపొందించిన ప్రత్యేకయాప్‌లో 10 వేల హెక్టార్లలో పంట పూర్తిగా ఎండిపోయినట్లు గుర్తించారు. వాస్తవానికి 3.50 లక్షల హెక్టార్ల పంట కూడా దెబ్బతినే పరిస్థితిలో ఉంది. కానీ... గత మూడు రోజులుగా రెయిన్‌గన్ల ద్వారా కేవలం 4 వేల హెక్టార్లకు కూడా నీటి తడులు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వమే నీటి వనరులను అందుబాటులోకి తెస్తే రెయిన్‌గన్లు, స్ప్రింక్లర్లు, డీజిల్‌ ఇంజిన్లు, పైపులైన్ల ద్వారా కొంతవరకైనా పంటను కాపాడుకునే వీలుంది. అలా కాకుండా అన్నీ రైతులే చూసుకుంటే రెయిన్‌గన్లు ఇస్తామంటే రోజుకు 2 వేల హెక్టార్లు కూడా తడపడం కష్టంగానే కనిపిస్తోంది.

నేడు జిల్లాకు మంత్రి ప్రత్తిపాటి
రెయిన్‌గన్ల ద్వారా వేరుశనగ పంటకు ఇస్తున్న రక్షకతడుల పరిశీలనకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆదివారం జిల్లాలో పర్యటిస్తున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. గోరంట్ల, పుట్టపర్తి, ధర్మవరం, రాప్తాడు ప్రాంతాల్లో ఆయన పర్యటన ఉంటుందంటున్నారు. ప్రత్తిపాటి రాకతోనైనా వేరుశనగ రైతులకు కనీస ప్రయోజనం కలుగుతుందా లేదా అనేది వేచిచూడాలి. 

మరిన్ని వార్తలు