సాంకేతిక విజ్ఞానంతో ముందుకు సాగాలి

30 Jun, 2013 06:42 IST|Sakshi
 కశింకోట, న్యూస్‌లైన్: మూఢ నమ్మకాలు విడనాడి శాస్త్ర, సాంకేతిక విజ్ఞానంతో యువత ముందుకు సాగాలని జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు డాక్టర్ వి.బ్రహ్మారెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక ఆర్‌ఈసీఎస్ పాలిటెక్నికల్ కళాశాల విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా ఆయన ప్రసంగించారు. వ్యక్తిత్వ వికాసం వివేకాన్ని బట్టి ఉంటుందన్నారు. ప్రతి అంశాన్ని విచక్షణతో ఆలోచించాలని సూచించారు.
 
ఎటువంటి సవాళ్లనైనా ధైర్యంగా ఎదుర్కొని జీవనం సాగించడానికి ఎల్లప్పుడు సిద్ధంగా ఉండాలన్నారు. ధనం సంపాదనే జీవిత ధ్యేయం కారాదని చె ప్పారు. ధనం కోసం తల్లిదండ్రులపై ఆధారపడకుండా స్వశక్తితో సంపాదించడం సంతృప్తినిస్తుందన్నారు. మానవ సంబంధాలను పెంపొందించుకోవాలని కోరారు. వేదిక రాష్ట్ర అధ్యక్షుడు జంపా కృష్ణ కిషోర్ మాట్లాడుతూ వేదిక ద్వారా శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడంతో పాటు సమాజంలో రుగ్మతలను దూరం చేయడానికి కృషి చేస్తున్నట్టు చెప్పారు.
     
ప్రతి ఒక్కరూ భవిష్యత్ తరానికి మార్గదర్శకులుగా నిలవాలని కోరారు. కళాశాల ప్రిన్సిపాల్ బి.ఉమాశంకర్ అధ్యక్షతన జరిగిన సభలో వేదిక కార్యదర్శి ఎం.శంకర్‌ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు కె.జనార్దన్, ప్రతినిధులు వర్మ, కృష్ణ అప్పారావు, రామయ్య మాట్లాడారు. 
 
 ఉపాధ్యాయుల చేతుల్లోనే దేశ భవిష్యత్తు
 
 చోడవరం టౌన్: ఉపాధ్యాయుల చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందని జన విజ్ఞాన వేదిక రాష్ర్ట నాయకుడు వి. బ్రహ్మారెడ్డి అన్నారు. స్థానిక ఉషోదయ విద్యా సంస్థల్లో ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు బోధనలో మెలకువలపై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో బోధన చేయాలనిసూచించారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ రమణాజీ, కరెస్పాండెంట్ కృష్ణ కుమారి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆయనను ఘనంగా సత్కరించారు. 
 
>
మరిన్ని వార్తలు