తీరం.. రక్షణ ప్రశ్నార్థకం

29 Aug, 2017 01:56 IST|Sakshi
తీరం.. రక్షణ ప్రశ్నార్థకం

తెరపైకి మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు ప్రతిపాదన
 గతంలోనే స్థల పరిశీలన
♦  ఐదేళ్లుగా నిరీక్షణ


నరసాపురం : నరసాపురం తీరప్రాంతంలో రక్షణ ప్రశ్నార్థకంగా మారింది. కొంతకాలంగా మెరైన్‌పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటుపై హడాÐవుడి చేయడం, మళ్లీ విషయం మరుగున పడడం పరిపాటిగా మారింది. నాలుగైదేళ్లుగా ఇదేతంతు నడుస్తోంది. రెండేళ్ల క్రితం అంతర్వేదిలో మెరైన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయడంతో, ఇక ఇక్కడ అలాంటి ప్రతిపాదనలు ఉండవని భావించారు. అయితే జిల్లాలో తీరప్రాంత గ్రామాలు ఎక్కువగా ఉండటంతో ఆ అంశం మళ్లీ తెరమీదకొచ్చింది. కచ్చితంగా ఇక్కడ మెరైన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటవుతుందని రెవెన్యూ శాఖలు పేర్కొంటున్నాయి. కొన్నేళ్ల క్రితం సముద్ర మార్గం ద్వారా కసబ్‌ సహా పలువురు తీవ్రవాదులు ముంబై నగరంలోకి ప్రవేశించి మారణహోమం సృష్టించారు. సరిగ్గా అప్పుడే కేంద్రం మన రాష్ట్ర తీరప్రాంత జిల్లాల్లో రక్షణ చర్యలపై దృష్టిపెట్టింది. అందులో భాగంగా నరసాపురం తీరప్రాంతంలో మెరైన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు ప్రతిపాదన చేశారు.

ఉపయోగాలున్నా.. పెండింగ్‌ ఎందుకో?
మెరైన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటుకు ఐదేళ్ల క్రితం అంటే 2012లో దాదాపు రంగం సిద్ధం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో కూడిన ప్రతినిధి బృందం నరసాపురం తీరగ్రామాల్లో పర్యటించింది. నరసాపురం మండలం చినమైనవానిలంక, మొగల్తూరు మండలం పేరుపాలెం ప్రాంతాలను అధికారులు పరిశీలించారు. చినమైనవానిలంకలో ఓ ప్రాంతాన్ని స్టేషన్‌ ఏర్పాటుకు అనువుగా గుర్తించారు. అయితే నరసాపురంతో పాటు ప్రతిపాదనలో ఉన్న మరోప్రదేశమైన తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో మాత్రం 2013లో మెరైన్‌పోలీస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేసేశారు. ఇక్కడ మాత్రం పెండింగ్‌ పెట్టారు. మన జిల్లాలోని నరసాపురంలో 19 కిలో మీటర్ల మేర తీరప్రాంత ఉంది.

తరచూ ప్రకృతి విపత్తులు సంభవించడంతో ఇక్కడ మెరైన్‌ పోలీస్‌ స్టేషన్‌ అవసరమని నిపుణులు గుర్తించారు. ఈ స్టేషన్‌ అందుబాటులో ఉంటే తీరప్రాంత భద్రత, రక్షణే కాకుండా ఇతర ఉపయోగాలుంటాయి. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి ప్రాణహాని కలుగకుండా రక్షించడం మెరైన్‌ స్టేషన్‌ సిబ్బంది చేస్తుంటారు. బోట్లు, విపత్తు రక్షణ సామగ్రి వారివద్ద అందుబాటులో ఉంటుంది. మెరైన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు ప్రతిపాదనలపై ఇటీవల పోలీస్‌శాఖ మరోసారి కేంద్రం దృష్టిలో పెట్టింది. ఇంతకుముందు ఎస్పీగా పని చేసిన భాస్కర్‌భూషణ్‌ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. స్థల పరిశీలన కూడా చేశారు. ఇటీవల కదలికతో మెరైన్‌ స్టేషన్‌ సాకారమవుతుందోలేదో వేచిచూడాల్సి ఉంది.

స్థలం సమస్యలేదు  సుమిత్‌ కుమార్‌ గాంధీ, సబ్‌కలెక్టర్‌
తీరంలో మెరైన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటుకు స్థల సమస్య లేదు. గతంలో గుర్తించాలమని చెపుతున్న చినమైనవానిలంకలో కూడా ప్రభుత్వ భూములున్నాయి. నేను బాధ్యతలు తీసుకున్న తరువాత మాత్రం ఈ అంశం నా దృష్టికి రాలేదు.

మరిన్ని వార్తలు