తెలంగాణ బంద్ ప్రశాంతం

11 Oct, 2015 06:59 IST|Sakshi
తెలంగాణ బంద్ ప్రశాంతం

* రాష్ట్రవ్యాప్తంగా నిరసన ర్యాలీలు, ఆందోళనలు నిర్వహించిన విపక్షాలు
* రైతుల ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టాలని డిమాండ్
* అక్కడక్కడా స్వల్ప ఉద్రిక్తత.. ఏడు ఆర్టీసీ బస్సులు ధ్వంసం
228 కేసులు నమోదు.. దాదాపు 8,048 మంది అరెస్టు
* హైదరాబాద్‌లో బంద్ పాక్షికం
* కేసీఆర్ ఒక నియంత: ఉత్తమ్

 
 సాక్షి, హైదరాబాద్: రైతుల ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టాలని, రుణమాఫీ మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సహా విపక్షాలు పిలుపునిచ్చిన తెలంగాణ బంద్ శనివారం ప్రశాంతంగా జరిగింది. బంద్ నేపథ్యంలో ఉదయం నుంచే వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి.. దుకాణాలను మూయించారు. ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. పలుచోట్ల దుకాణాలు, స్కూళ్లు, హోటళ్లు, వ్యాపార సంస్థలను కార్యకర్తలు మూయించగా... మరికొన్ని చోట్ల స్వచ్ఛందంగా బంద్ పాటించారు. బంద్ సందర్భంగా ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 8,048 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
 
అక్కడక్కడ చోటు చేసుకున్న స్వల్ప ఉద్రిక్తతలు, దాడుల వంటి ఘటనలపై 228 కేసులు నమోదయ్యాయి. ఏడు ఆర్టీసీ బస్సులకు నష్టం వాటిల్లింది. కొన్ని ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు మధ్య ఆర్టీసీ బస్సులను నడిపించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డిలను హైదరాబాద్‌లో బస్సు డిపోల వద్ద ధర్నా చేస్తుండగా... టీడీపీ నేతలు ఎల్.రమణ, రేవంత్‌రెడ్డిలను సికింద్రాబాద్‌లో అరెస్టు చేశారు.
 
రాష్ట్రవ్యాప్తంగా...: రంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మహేశ్వరంలో మాజీ మంత్రి సబితారెడ్డి, పరిగిలో ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పి.చంద్రయ్య,
 
 వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి యాదయ్య, కమ్యూనిస్టు పార్టీ నేతలు బస్‌డిపోల ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలో దుకాణాలు, హోటళ్లు, పాఠశాలలను మూసివేశారు. పలుచోట్ల పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాటలు, వాగ్వాదాలు జరిగాయి. ఆందోళనకారులు రెండు బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. కాంగ్రెస్ నేతలు దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి, కోదండరాంరెడ్డి, జగ్గారెడ్డి బంద్ నిరసనల్లో పాల్గొన్నారు. వరంగల్ జిల్లాలో విపక్షాల నేతలు కార్యకర్తలు ఆర్టీసీ బస్సులను అడ్డగించారు. వ్యాపార, వాణిజ్య సంస్థలను మూసివేయించారు. బంద్ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు జిన్నారెడ్డి మహేందర్‌రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు.
 
 విపక్షాలన్నీ కలసి..
 నిజామాబాద్ జిల్లాలో విపక్షాల నేతలంతా కలసి నిరసనలు తెలియజేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో బంద్ ప్రశాంతంగా జరిగింది. కల్వకుర్తిలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. మహబూబ్‌నగర్‌లో ఆందోళన చేస్తున్న మాజీ మంత్రి డీకే అరుణ, టీడీపీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మామిడి శ్యాంసుందర్‌రెడ్డి తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. కల్వకుర్తిలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎడ్మ కిష్టారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి తదితరులు బంద్‌లో పాల్గొన్నారు. ఇక నల్లగొండ జిల్లాలో భువనగిరి, మునుగోడు, దేవరకొండ, హాలియా, గుర్రంపోడు, త్రిపురారం, నిడమనూరులలో రాస్తారోకో చేస్తున్న 150 మంది నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
ఖమ్మం జిల్లాలో విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలను మూసివేశారు. ఆందోళన చేస్తున్న నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రాచలంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ర్యాలీ నిర్వహించారు. సత్తుపల్లిలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మట్టా దయానంద్‌ను, మణుగూరులో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో బస్సులు పాక్షికంగా నడిచాయి. భైంసాలో అఖిలపక్ష నాయకులు మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు.
 
 రాజధానిలో..
 హైదరాబాద్‌లో బంద్ ప్రశాంతంగా ముగిసింది. కొద్దిసేపు బస్సుల రాకపోకలు నిలిచిపోయినా.. ఆ తరువాత యథావిధిగా కొనసాగాయి. పెట్రోల్ బంకులు, దుకాణాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలను కొద్దిసేపు మూసి ఉంచారు. అబిడ్స్ వద్ద ఆందోళనకారులు రెండు బస్సుల అద్దాలు పగులగొట్టారు. స్కూళ్లు, విద్యాసంస్థలకు సెలవు కావడంతో బంద్ ప్రభావం తక్కువగానే కనిపించింది. విపక్షాలు నిర్వహించిన ఈ బంద్‌లో తెలుగుదేశం పార్టీ ముఖ్య భూమిక పోషించింది. కానీ ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ మాల్స్ మాత్రం యథావిధిగా పనిచేయడం గమనార్హం. పోటీలు పడి దుకాణాలను మూయించిన టీడీపీ, బీజేపీ నాయకులు వీటి జోలికి మాత్రం వెళ్లలేదు.
 
 కేసీఆర్ నియంత
 రాష్ట్రాన్ని కేసీఆర్ నియంతలా పాలిస్తున్నాడని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం వెంటనే రైతు రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. వరి, పత్తి, మొక్కజొన్న రైతులకు అదనంగా బోనస్ ఇవ్వాలని... ఆత్మహత్య చేసుకున్న రైతులందరికీ పెంచిన ఎక్స్‌గ్రేషియా అందజేయాలని కోరారు. రైతులకు సంఘీభావంగా ప్రతిపక్షాలు చేపట్టిన బంద్‌ను అడ్డుకొనేందుకు సీఎం కేసీఆర్ ఎంతగా ప్రయత్నించినా... అన్ని జిల్లాల్లో విజయవంతమైందని చెప్పారు.   

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు