నేడే తెలంగాణ బడ్జెట్

14 Mar, 2016 03:39 IST|Sakshi
నేడే తెలంగాణ బడ్జెట్

► ప్రణాళిక వ్యయం 67,660 కోట్లు
► ప్రణాళికేతర వ్యయం 60,000 కోట్లు

* అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి ఈటల రాజేందర్
* శాసన మండలిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
* బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం
* నీటి పారుదలకే పెద్దపీట.. రూ.25 వేల కోట్లు కేటాయింపు
* వైద్యారోగ్యానికి రూ.5 వేల కోట్లకుపైగా.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జీతాలు, నియోజకవర్గ అభివృద్ధి నిధులు పెంపు
* అన్ని వర్గాల పేదలకు కల్యాణలక్ష్మి, కాలేజీ విద్యార్థులకు
* సన్నబియ్యం.. ఇవి మినహా మరే కొత్త పథకాలు లేవు

 
 సాక్షి, హైదరాబాద్: బంగారు తెలంగాణ లక్ష్య సాధనే ఎజెండాగా ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో మూడో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. మొదటి రెండేళ్లపాటు భారీ అంచనాలతో బడ్జెట్‌ను ప్రకటించిన ప్రభుత్వం ఈసారి వాస్తవికతకు దగ్గరగా, కొత్త పంథాలో బడ్జెట్‌ను సమర్పించనుంది. జీరో బడ్జెట్‌ను (గత ఏడాది కేటాయింపులతో సంబంధం లేకుండా) ప్రవేశపెడతామని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే ప్రకటించారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి రూ.1.27 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రణాళిక వ్యయం కింద రూ.67,660 కోట్లు, ప్రణాళికేతర వ్యయం కింద రూ.60,000 కోట్లు పొందుపరిచినట్లు సమాచారం. గతానికి భిన్నంగా ప్రణాళికేతర వ్యయానికి మించి ప్రణాళిక వ్యయానికి ఎక్కువ నిధులు కేటాయించనుంది. ద్రవ్యలోటు ఉన్నప్పటికీ రెవెన్యూ మిగులు బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకే ప్రభుత్వం మొగ్గుచూపుతోంది.
11.35కు ముహూర్తం
ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ వరుసగా మూడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సోమవారం ఉదయం 11.35 గంటలకు అసెంబ్లీలో ఆయన బడ్జెట్ ప్రసంగం చేస్తారు. అదే సమయంలో శాసనమండలిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆదివారం అసెంబ్లీ సమావేశం అనంతరం సచివాలయంలో భేటీ అయిన రాష్ట్ర మంత్రివర్గం 2016-17 వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది.

సాగునీటికి పెద్దపీట
 సీఎం ఇంతకుముందే ప్రకటించినట్లుగా ఈ బడ్జెట్‌లో నీటి పారుదల ప్రాజెక్టులకు రూ.25 వేల కోట్లు కేటాయిస్తారు. మూడో విడత రైతుల రుణమాఫీకి రూ.4,230 కోట్లు, వైద్యారోగ్యానికి రూ.5,000 కోట్లకు పైగా కేటాయించనున్నారు. తొలి రెండేళ్లు సంక్షేమానికి పెద్దపీట వేసిన ప్రభుత్వం ఈసారి సంక్షేమంతో పాటు ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వనుంది. ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు నెలనెలా డబ్బులిచ్చేలా ప్రత్యేకంగా కేటాయింపులు జరుపనుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జీతాల పెంపుతోపాటు వారి నియోజకవర్గాల అభివృద్ధి నిధిని పెంచడం, అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలకు బంగ్లాల నిర్మాణానికి బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారు. కళ్యాణలక్ష్మీ పథకాన్ని అన్ని వర్గాలకు విస్తరించటం, కాలేజీ విద్యార్థులకు సన్నబియ్యం భోజనం మినహా కొత్త పథకాల జోలికి వెళ్లటం లేదు.

నిరుటి అంచనాలకు గండి
 గత ఏడాది బడ్జెట్ అంచనాలను ప్రభుత్వం అందుకోలేకపోయింది. ఆశించిన ఆదాయం సమకూరకపోవడంతో ఈ పరిస్థితి తలెల్తింది. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం రూ.1.15 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టింది. తొలి ఏడాదితో పోలిస్తే పన్నులు, పన్నేతర ఆదాయం 30 శాతం పెరుగుతుందని అంచనా వేసింది. కానీ 15 నుంచి 20 శాతమే  ఆదాయం పెరిగింది. భూముల అమ్మకంతో వస్తాయనుకున్న రూ.13,500 కోట్లు, కేంద్రం నుంచి రూ.3,000 కోట్ల ప్యాకేజీ రాలేదు. ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితిని 3.5 శాతానికి పెంచాలనే విజ్ఞప్తిపై కేంద్రం స్పందించలేదు. అకౌంటెంట్ జనరల్ కార్యాలయం ఈ ఏడాది జనవరి నెలాఖరు వరకు (పది నెలలు) వెల్లడించిన లెక్కల ప్రకారం రెవెన్యూ ఆదాయం రూ.62 వేల కోట్లు, రెవెన్యూ వ్యయం రూ.70 వేల కోట్లుగా ఉంది. ఈ లెక్కన మిగిలిన రెండు నెలల వ్యవధిలో గరిష్టంగా మరో రూ.15 వేల కోట్లకు మించి ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. దీంతో రెవెన్యూ ఆదాయం ఇంచుమించుగా రూ.77 వేల కోట్లకు చేరుతుంది. గత ఏడాది రూ.94,131 కోట్ల రెవెన్యూ రాబడి ఉంటుందని అంచనాలు వేసుకుంది. ఈ లెక్కన వాస్తవ ఆదాయంతో పోలిస్తే దాదాపు రూ.17 వేల కోట్లకుపైగా లోటు కనిపిస్తోంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం సవరణ బడ్జెట్‌లో చూపిస్తుందా.. లేదా వేచి చూడాల్సిందే !

అప్పులకే మొగ్గు
ప్రతిష్టాత్మక పథకాల అమలుకు అప్పులు తెచ్చుకోవటమే మార్గమని ప్రభుత్వం భావిస్తోంది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి భారీ మొత్తంలో నిధుల అవసరముంది. కానీ బడ్జెట్‌లో ఇరిగేషన్‌కు పెద్ద వాటా ఇవ్వడంతో బడ్జెట్ కేటాయింపులకు సంబంధం లేకుండానే వీటికి రుణాలు సమీకరించనుంది. ఇంటింటికీ నల్లా నీటిని అందించే లక్ష్యంతో తలపెట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టుకు దాదాపు రూ.30 వేల కోట్లు కావాలి. ఇప్పటికే మంజూరు చేసిన 60 వేల ఇళ్లు, వచ్చే ఏడాది నిర్మించబోయే రెండు లక్షల ఇళ్లు, కొత్త ఆసుపత్రుల నిర్మాణానికి భారీగా నిధులు కావాలి. హడ్కో, నాబార్డు, బ్యాంకులు, నెదర్లాండ్స్‌కు చెందిన రోబో బ్యాంక్ నుంచి వీటికి సరిపడే రుణాలు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది.
 

మరిన్ని వార్తలు