కొత్త రేషన్ కార్డులకు బ్రేక్

11 Oct, 2016 01:52 IST|Sakshi
కొత్త రేషన్ కార్డులకు బ్రేక్

 కొత్త జిల్లాల ఏర్పాటుతో నిలిచిన పంపిణీ
 కార్డులపై పాత జిల్లాల పేర్లే కారణం
 ముందు చూపులేక కోట్లాది నిధులు వృథా..

 
 సాక్షి ప్రతినిధి, నిజామాబాద్:
రాష్ట్ర ప్రభుత్వం, పౌర సరఫరా ల శాఖ అధికారులకు ముందు చూపులేకపోవడంతో రెండేళ్ల తరువాత చేతిదాక వచ్చిన కొత్త రేషన్ కార్డులు చేజారే పరిస్థి తి ఏర్పడింది. కొత్త జిల్లాలు ఆవిర్భవించడంతో కొత్త రేషన్ కార్డులకు చిక్కు వచ్చి పడింది. ప్రస్తుతం ఉన్న జిల్లాల నుంచి వేరే జిల్లాలను ఏర్పాటు చేయనుండడంతో రేషన్‌కార్డుల్లో లబ్ధిదారుల జిల్లా, మండలం పేర్లు మారనున్నాయి. దీంతో రేషన్ కార్డుల పంపిణీ పక్రియకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ బ్రేక్ వేసింది.
 
  తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పాత రేషన్ కార్డులను తొల గించిన విషయం తెలిసిందే. ఆనాటి నుంచి నేటి వరకు దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తున్నా లబ్ధిదారులకు రేషన్ కార్డులను అందజేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ వచ్చింది. ఈ క్రమంలో గత ఆగస్టు నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పది జిల్లాలకు కొత్త రేషన్ కార్డులు ముద్రించి ఆయా జిల్లాలకు పంపింది. ఇందుకు వీటి ముద్రణ కోసం ప్రభుత్వం ఓ సంస్థకు టెండర్లు అప్పగించింది.
 
 దాదాపు రూ.7 కో ట్ల వరకు నిధులు వెచ్చించి, కొత్త రేషన్ కార్డులపై కుటుంబ సభ్యుల ఫొటోలతో పాటు వారి పేర్లను, ప్రభుత్వ లోగో, ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటోలను సైతం ముద్రించింది. ఆయా జిల్లాల పౌర సరఫరాల శాఖ కార్యాలయాలకు వచ్చిన రేషన్ కార్డులను మండలాలు, మున్సిపాలిటీల వారీగా వేరు చేసి పంపిణీకి సిద్ధంగా ఉంచారు. ఈ క్రమంలోనే కొత్త జిల్లా ల చిక్కు వచ్చి పడడంతో ప్రక్రియ   నిలిచిపోయింది.
 
 కొద్ది రోజులు అగితే... రూ.7 కోట్లు మిగిలేవి....

 కాంట్రాక్టర్‌లకు ఆహార భద్రతా కార్డుల ముద్రణ బాధ్యత అప్పగించే సమయానికి కొత్త జిల్లాల పునర్విభజన పక్రియ మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలను దసరాకే ప్రారంభిస్తామని పదే పదే చెప్తున్నప్పటికీ రేషన్ కార్డులను ఈ సమయంలో ముద్రిస్తే అవి ఉపయోగపడవని అధికారులు ఆలోచించలేకపోయారు. రేషన్ కార్డులు లబ్ధిదారులకు అందజేయడంలో దాదాపు రెండేళ్ల పాటు జాప్యం చేసిన సర్కారు మరి కొన్ని రోజులు ఆగి ఉంటే ఈ సమస్య తలెత్తేది కాదని పలువురు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఎంచక్కా కొత్త జిల్లాలు, మండలాల పేర్లతో ముద్రణ జరిగేదంటున్నా రు. ఒకటి కాదు రెండు కాదు పది జిల్లాలకు సంబంధించిన లక్షల కొద్దీ రేషన్ కార్డులు ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంతో పనికి రాకుండా పోనున్నాయి. ఇటు వీటి ముద్రణ కోసం ఖర్చు చేసిన దాదాపు రూ.7 కోట్ల నిధులు బూడిదలో పోసిన పన్నీరు లాగా అయ్యింది.
 
 మళ్లీ కొత్తవి ముద్రిస్తారా...?
 కొత్త రేషన్ కార్డుల పంపిణీ నిలిచిపోయింది. అయితే కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం ముద్రించిన కార్డుల స్థానంలో జిల్లా, మండలం పేర్లు మార్పు చేసి మళ్లీ కొత్త కార్డులను ముద్రిస్తారా..? లేదా ముద్రించిన కార్డులపైనే స్టిక్కర్లు అతి కించి వాటినే కొనసాగిస్తారా..? అనేది తేలాల్సి ఉంది. కొత్త ముద్రణ జరిగితే మాత్రం ప్రభుత్వ నిధుల వృథాతో పాటు మరో ఆరు నెలల పాటు లబ్ధిదారులకు రేషన్ కార్డుల కోసం ఎదురు చూపులు తప్పవు. ఇటు ప్రభుత్వ తీరుపై లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంలో తమకు మాత్రం రాష్ట్ర అధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదని, తాత్కాలికంగా రేషన్ కార్డుల పంపిణీ చేయకుండా నిలిపివేశామని పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు.
 

మరిన్ని వార్తలు