ఆలయాలకు మహర్దశ

9 Jun, 2017 23:00 IST|Sakshi
ఆలయాలకు మహర్దశ

రెండు దఫాలుగా ఎంపిక.. నిధుల విడుదల
ఇప్పటికే మొదటి దఫా గుళ్లల్లో పనులు
ఇటీవలే ఆలయాలకు పాలకవర్గాల నియామకం
పనులపై దృష్టిపెట్టిన మంత్రి, అధికారులు

నిర్మల్‌రూరల్‌: అడుగడుగునా గుడులున్న జిల్లాగా పేరున్న నిర్మల్‌లోని ఆలయాలకు మహర్దశ పట్టింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కొలువుదీరిన కొత్త సర్కార్‌ ఆలయాలాభివృద్ధికి ఎలాంటి ఆటంకం లేకుండా నిధులు అందిస్తోంది. దీంతో జిల్లాలోనూ ఆలయాలు అభివృద్ధి బాట పడుతున్నాయి. దీనికి తోడు జిల్లా నుంచే దేవాదాయశాఖ మంత్రిగా అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఉండడంతో పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే పలు ఆలయాల్లో అభివృద్ధి పనులు ప్రారంభం కాగా, మరికొన్ని గుడులలో త్వరలోనే   ప్రారంభం కానున్నాయి.

రెండు దఫాలుగా ఎంపిక..
జిల్లాలోని ఆలయాల అభివృద్ధిలో భాగంగా దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఇప్పటికే పలు కోవెలలను ఎంపిక చేసి పనులు చేపడుతోంది. వీటిని మొదటి ఫేజ్‌ కింద పరిగణిస్తున్నారు. ఇందులో మొత్తం 81ఆలయాలున్నాయి. వీటి అభివృద్ధికి కామన్‌గుడ్‌ ఫండ్‌ (సీజీఎఫ్‌) కింద రూ.11కోట్ల 9లక్షలు మంజూరు చేశారు. ఈ దఫాలోని ఆలయాల అభివృద్ధి పనులు దాదాపు ప్రారంభమయ్యాయి. ఇక రెండో దశ కింద 313 ఆలయాలను ఎంపిక చేశారు. ఇందులో ఇప్పటికే 24ఆలయాలకు సీజీఎఫ్‌ ద్వారా రూ.63లక్షలు మంజూ రు చేశారు. మిగతా 292 గుడులకూ త్వరలోనే నిధులు మంజూరు కానున్నట్లు అధికారులు తెలిపారు.

ఆలయాన్ని బట్టి నిధులు..
జిల్లాలో బాసరలో చదువులమ్మ కోవెల మొదలుకుని గ్రామాల్లోని భీమన్న ఆలయాల వరకు దేవాదాయశాఖ నిధులు మంజూరు చేస్తోంది. ఇందులో ఆలయాల అభివృద్ధి పనులు, స్థాయిని బట్టి నిధులు కేటాయిస్తోంది. బాసరకు సంబంధించిన అభివృద్ధి పనుల ప్రణాళిక సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి నిధులు విడుదల కాలేదు. ప్రణాళికలు పూర్తయిన తర్వాత ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఆలయాలు.. విడుదలైన నిధులు
సారంగాపూర్‌ మండలంలోని అడెల్లి మహాపోచమ్మ దేవస్థానానికి రూ.కోటి, దిలావర్‌పూర్‌ మండల కాల్వ లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి రూ.35లక్షలు, కదిలి పాపహరేశ్వరాలయానికి రూ.15లక్షలు, జిల్లాకేంద్రంలోని దేవరకోట దేవస్థానానికి రూ.20లక్షలు, వీరహనుమాన్‌ ఆలయానికి రూ.20లక్షలు, బంగల్‌పేట్‌ మహాలక్ష్మీ ఆలయానికి రూ.10లక్షలు, కురన్నపేట్‌ వేంకటేశ్వరస్వామి(బత్తీస్‌గఢ్‌) ఆలయానికి రూ.25లక్షలు, బ్రహ్మపురి రాంమందిర్‌కు రూ.10లక్షలు, బంగల్‌పేట్‌ బోయవాడ హన్మాన్‌ మందిరానికి రూ.8లక్షలు, ఖిల్లాగుట్టపై గల చాందమహంకాళీ ఆలయానికి రూ.5లక్షలు, నగరేశ్వరవాడ భూలక్ష్మి మందిరానికి రూ.10లక్షలు, నగరేశ్వరాలయానికి రూ.5లక్షలు, కురన్నపేట శివాలయానికి రూ.10లక్షల చొప్పున మొదటి ఫేజ్‌లో నిధులు విడుదల చేశారు.

వేగంగా సాగుతున్న పనులు..
మొదటి ఫేజ్‌లో నిధులు మంజూరు చేసిన ఆలయాల్లో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. కాల్వలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని పూర్తిగా తొలగించి నూతన మందిరాన్ని నిర్మిస్తున్నారు. అలాగే మిగతా ఆలయాల్లోనూ మరమ్మతులు, మండపాలు, గోపురాల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. దేవరకోటలో గతంలో వేసిన షెడ్డు పాడవ్వడంతో రూ.20లక్షలతో నూతన షెడ్డును వేయనున్నారు.  

కొలువుదీరిన పాలకవర్గాలు..
ఓ వైపు నిధులను కేటాయించడంతో పాటు మరోవైపు ఆలయాల పాలనను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ఇటీవలే పాలకవర్గాలనూ నియమించింది. అన్నింటికంటే ముందు అడెల్లి మహాపోచమ్మ దేవస్థానం పాలకమండలి ఖరారైంది. చైర్మన్‌గా వంజర్‌కు చెందిన శ్రీనివాస్‌రెడ్డి నియమితులు కాగా, మరో ఆరుగురు ధర్మకర్తలుగా నియమితులయ్యారు. బాసరలో చైర్మన్‌గా ఫౌండర్‌ ట్రస్టీ శరత్‌పాఠక్‌ కొనసాగగా, 13మంది ధర్మకర్తలుగా ఉన్నారు. కాల్వ లక్ష్మీనర్సింహస్వామి ఆలయ చైర్మన్‌గా ఇప్ప నర్సారెడ్డి, కదిలి పాపహరేశ్వరాలయం చైర్మన్‌గా శంభాజీపటేల్‌ నియమితులయ్యారు.

ఈ ఆలయాల్లోనూ ఆరుగురు చొప్పున ధర్మకర్తలున్నారు. ఇక జిల్లాకేంద్రంలోని ప్రముఖ దేవరకోట లక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్‌గా ఆమెడ కిషన్‌ నియమితులయ్యారు. మరో ఆరుగురు ఇక్కడ ధర్మకర్తలుగా ప్రమాణ స్వీకారం చేశారు. అన్ని ఆలయాలకు పాలకవర్గాలు రావడంతో సమస్యలు తీరుతాయని భక్తులు ఆశిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సహాయం తీసుకుంటామని ఆలయాల చైర్మన్లు చెబుతున్నారు.

అమాత్యుడి అండతో..
దేవాదాయశాఖ రాష్ట్ర మంత్రిగా నిర్మల్‌ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఉండడంతో జిల్లాలో ఆలయాల అభివృద్ధి వేగంగా సాగుతోంది. ఇటీవల పలు సభలు, కార్యక్రమాల్లోనూ ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ఆలయాలనూ అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో యాదాద్రి, వేములవాడలతో సమానంగా జిల్లాలోని ఆలయాలను తీర్చిదిద్దుతామన్నారు. ఇందుకు పూర్తిస్థాయిలో నిధులు కేటాయిస్తామన్నారు. మంత్రి కృషితోనే నిధులు మంజూరవుతూ పనులు వేగంగా సాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

త్వరలోనే అభివృద్ధి పనులు
జిల్లాకేంద్రంలోని ప్రముఖ చారిత్రక ఆలయమైన దేవరకోట శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో త్వరలోనే అభివృద్ధి పనులు చేపడతాం. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సహకారంతో ఇప్పటికే రూ.20లక్షలు మంజూరయ్యాయి. మరిన్ని నిధులు రాబట్టి ఆలయాన్ని నిర్మల్‌ తిరుమలగా మారుస్తాం.
– ఆమెడ కిషన్,దేవరకోట దేవస్థానం చైర్మన్, నిర్మల్‌  

రెండో దశ ఆలయాలకూ..
జిల్లాలో మొదటి దశలో 81ఆలయాలకు రూ.11కోట్ల 9లక్షలు మంజూరయ్యాయి. ఈ పనులు కొనసాగుతున్నాయి. రెండో దశలో 313 ఆలయాలకు గానూ ఇప్పటికే 24ఆలయాలకు రూ.63లక్షలు మంజూరయ్యాయి. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సహకారంతో త్వరలోనే మిగతా ఆలయాలకు నిధులు మంజూరు చేస్తాం.
– రంగు రవికిషన్‌గౌడ్, దేవాదాయశాఖ ఇన్‌స్పెక్టర్‌.

మరిన్ని వార్తలు