రైట్‌.. రైట్‌

17 May, 2017 01:21 IST|Sakshi
రైట్‌.. రైట్‌

నిజామాబాద్‌: ఈ ఒక్క ఉదాహరణ చాలు.. టీఎస్‌ఎండీసీ (తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ)లో కొందరు ఉన్నతాధికారులు ఇసుకాసురులకు ఏ స్థాయిలో వంత పాడుతున్నారో అర్థం చేసుకోవడానికి. మహారాష్ట్ర క్వారీల పేరుతో ఈ అక్రమదందా యథేచ్ఛగా సాగుతోంది. నిత్యం వందలాది భారీ వాహనాలు ఇంటర్‌స్టేట్‌ రెగ్యులేటింగ్‌ చార్జీలు చెల్లించకుండా తెలంగాణలోకి ప్రవేశిస్తున్నా టీఎస్‌ఎండీసీ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. దీంతో రాష్ట్ర సర్కారు ఖజానాకు రావాల్సిన ఆదాయానికి పెద్ద మొత్తంలో గండిపడుతోంది.

యథేచ్ఛగా రూ.లక్షల్లో ఎగవేత..
నిబంధనల ప్రకారం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఇసుకపై ఇంటర్‌ స్టేట్‌ రెగ్యులేటింగ్‌ చార్జీలు చెల్లించాలి. ఒక్కో టన్నుకు రూ.200 చొప్పున వసూలు చేయాలి. ఈ మేరకు ఇసుక రవాణా చేస్తున్న వారు ఈ పన్ను మొత్తాన్ని ఆన్‌లైన్‌లో చెల్లించాలి. వే బిల్లులతో పాటు ఈ ఆన్‌లైన్‌ రషీదు ఉంటేనే ఆ ఇసుక వాహనాలను రాష్ట్రంలోకి అనుమతించాలి. ఇందుకోసం ప్రభుత్వం మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న బోధన్‌ మండలంలోని సాలూరా> వద్ద టీఎస్‌ఎండీసీ  చెక్‌పోస్టు ఏర్పాటు చేసింది. అటువైపు నుంచి రాష్ట్రంలోకి వస్తు న్న లారీలను తనిఖీ చేసి ఈ పన్ను చెల్లించిన వాహనాలనే రాష్ట్రంలోకి అనుమతించాలి.

వాటికి మాత్రమే తెలంగాణ రాష్ట్ర ట్రాన్సిట్‌ పాస్‌ను జారీ చేయాలి. కానీ రాష్ట్రంలో పేరున్న ఓ బడా ఇసుకాసురుడికి దాసోహమైన టీఎస్‌ఎండీసీ అధికారులు ఈ లారీలను కనీసం ఆపడం లేదు. నిత్యం వందకు పైగా వాహనాలు ఈ పన్ను చెల్లించకుండా రాష్ట్రంలోకి వరుసకడుతున్నాయి. మహారాష్ట్ర వైపు నుంచి వచ్చే భారీ ఇసుక వాహనాల్లో ఒక్కో లారీలో సుమారు 20 టన్నులపైగా ఇసుకను తరలిస్తున్నారు. టన్నుకు రూ.200 చొప్పున ఒక్కోలారీపై రూ. నాలుగు వేలకు పైగా ఇంటర్‌ స్టేట్‌ రెగ్యులేటింగ్‌ చార్జీలు చెల్లించాలి. ఇలా రోజుకు వందకుపైగా భారీ ఇసుక వాహనాలు మహారాష్ట్ర వైపు నుంచి రాష్ట్రంలోకి వస్తున్నాయి. ఈ లెక్కన రోజుకు రూ. నాలుగు లక్షల నుంచి ఆరు లక్షల వరకు సర్కారు ఖజానాకు గండిపడుతోంది. టీఎస్‌ఎండీసీ జారీ చేసిన ట్రాన్సిట్‌ పాసులు లేకుండానే ఈ లారీలు యథేచ్ఛగా తిరుగుతున్నాయంటే టీఎస్‌ఎండీసీలోని కొందరు అధికారులు ఏ స్థాయిలో ఈ ఇసుకాసురుడి అడుగులకు మడుగులొత్తుతున్నారో తెలుస్తోంది.

తనిఖీల్లో వెలుగుచూసిన అక్రమం..
భూగర్భ గనుల శాఖ ఉన్నతాధికారులు ఇటీవల బో«ధన్‌ ప్రాంతంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. మహారాష్ట్ర వైపు నుంచి పెద్ద ఎత్తున వస్తున్న ఇసుక లారీలను పరిశీలిస్తే.. ఆ వాహనాలకు టీఎస్‌ఎండీసీ ఇచ్చిన ట్రాన్సిట్‌ పాసులు లేవని తేలింది. ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా ఈ భారీ ఇసుక వాహనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నట్లు తనిఖీల్లో స్పష్టమైంది. దీంతో ఒక్కో వాహనానికి రూ.50 వేల చొప్పున జరిమానా విధించారు. జరిమానా మొత్తాన్ని తగ్గించుకునేందుకు అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు కూడా వచ్చినట్లు సమాచారం.

కొన్ని లారీలు మాత్రమే
కొన్ని లారీలు మాత్రమే ఇంటర్‌స్టేట్‌ రెగ్యులేటరీ చార్జీలు చెల్లించకుండా రాష్ట్రంలోకి వచ్చాయి. మహారాష్ట్ర వైపు నుంచి వస్తున్న ఇసుక లారీలను నిత్యం తనిఖీలు చేస్తున్నాం. పన్నులు చెల్లించిన వాహనాలనే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నాం. ఇసుక వ్యాపారులకు సహకరిస్తున్నారనే ఆరోపణల్లో వాస్తవం లేదు.
– తారక్‌నాథ్‌రెడ్డి, టీఎస్‌ఎండీసీ ప్రాజెక్టు అధికారి

మరిన్ని వార్తలు