తెలంగాణ నేపథ్యంపైనే అధిక ప్రశ్నలు!

2 Nov, 2015 01:22 IST|Sakshi
తెలంగాణ నేపథ్యంపైనే అధిక ప్రశ్నలు!

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్‌సప్లై అండ్ సేవరేజ్ బోర్డులో మేనేజర్(ఇంజనీరింగ్) పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) రాత పరీక్షను ఆదివారం నిర్వహించింది. గతంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల రాత పరీక్షలను ఆన్‌లైన్‌లోనే టీఎస్‌పీఎస్సీ విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సారి దరఖాస్తులు ఎక్కువ సంఖ్యలో రావడంతో తొలిసారి ఆఫ్‌లైన్‌లో పరీక్షను నిర్వహించింది. అభ్యర్థుల్లోని సాధారణ నైపుణ్యాలు, సామర్థ్యాలు పరీక్షించేలా ప్రశ్న పత్రాన్ని రూపొందించింది. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఎకానమీ, పాలిటీ, జాగ్రఫీ అన్ని అంశాల నుంచి ప్రామాణిక ప్రశ్నలను అడిగారు.

 చరిత్ర నుంచి సుమారు 35 ప్రశ్నలు!
 ప్రశ్న పత్రంలో తెలంగాణ నేపథ్యం ఉన్న  భూగోళ శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. తెలంగాణ, భారతదేశ చరిత్రకు సంబంధించి సుమారు 35 వరకు ప్రశ్నలు అడిగారు. తెలంగాణ సంస్కృతికి సంబంధించి పలుకుబడిలో ఉన్న ప్రశ్నలనే ఇచ్చారు. ఉదాహరణకు ‘దసరా పండగ రోజు ఒకరికొకకు ఇచ్చుకునే జమ్మి ఆకును తెలంగాణలో ఏమని పిలుస్తారు?’, ‘బతుకమ్మ పండగ తొలిరోజును ఏమంటారు?’తోపాటు కాకతీయులు తవ్వించిన చెరువులు, కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీలపై ప్రశ్నలు ఇచ్చారు. సాలార్ జంగ్ సంస్కరణలపై రెండు మూడు ప్రశ్నలు ఇచ్చారు.

తెలంగాణ సంస్కృతిలో ప్రధానంగా పండగలు, జాతరల గురించి అడిగారు. ‘ఆదిలాబాద్ జిల్లాలో గోండులు జరుపుకునే ప్రముఖ జాతర?’,  ‘కొండగట్టు దేనికి ప్రసిద్ధి?’,  ‘మెదక్ జిల్లాలోని ప్రఖ్యాత యాత్రా స్థలం ఏది?’ మొదలైన ప్రశ్నలతోపాటు 1969 ఉద్యమంపై, భౌగోళిక సూచికగా నమోదైన హైదరాబాద్ హలీమ్‌పై, కుతుబ్‌షాహీ సాహిత్యంపై ప్రశ్నలు ఇచ్చారు. భారత దేశ చరిత్రలో సంస్కరణ ఉద్యమాలు, ఆర్యసమాజంపై ప్రశ్నలు ఇచ్చారు. జాగ్రఫీలో తెలంగాణ నేలలు, వర్షపాతం, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, ఖనిజాలు, విద్యుచ్ఛక్తి, పరిశ్రమలు, చెరువులు, ప్రాజెక్టులు తదితర అంశాలతోపాటు ఇండియన్ జాగ్రఫీపై ప్రశ్నలు అడిగారు. తెలంగాణ ఆర్థిక అంశాలు, ప్రభుత్వ పథకాలు, విధానాలపై ప్రశ్నలు ఇచ్చారు.

 జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలు!
 జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అంశంలో జాతీయ అంతర్జాతీయ అంశాలకు ప్రాధాన్యతనిచ్చారు. నోబెల్ బహుమతిపై, బ్రహ్మోస్ క్షిప ణి, జలాంతర్గా మి నుంచి ప్రయోగించే బాలెస్టిక్ క్షిపణిపై, అంతర్జాతీయ దినోత్సవాల గురించి ప్రశ్నలు ఇచ్చారు. జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగారు.

 సుమారు 15 ప్రశ్నలు ఈ అంశాలకు సంబంధించినవే. పాలిటీ విభాగంలో అన్ని అంశాల్లోంచి ప్రశ్నలు ఇచ్చారు. గతంలో టీఎస్‌పీఎస్సీ పరీక్షల కంటే కొద్దిగా క్లిష్టంగానే ప్రశ్నలు రూపొందించారు. ఇంగ్లిష్ విభాగంలో సులువైన ప్రశ్నలు ఇచ్చారు. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఎంటర్‌ప్రిటేషన్‌లో ప్రశ్నలు అభ్యర్థులు తార్కిక నైపుణ్యాలు పరీక్షించే విధంగా ఉన్నాయి.
 
 క్లిష్టం, సందిగ్ధం!
  క్రీడలకు సంబంధించి లోతుగా ప్రశ్నలు ఇచ్చారు. ‘కల్టివేటెడ్ స్టైలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న హైదరాబాద్ క్రికెటర్ ఎవరు?’, ‘వరంగల్‌కు చెందిన ఏ ఆటగాడు బాల్‌బ్యాడ్మింటన్ ఆటను విప్లవీకరించాడు?’ అనే ప్రశ్నలు ఈ తరం విద్యార్థులకు పెద్దగా తెలిసే అవకాశం లేదని సబ్జెక్టు నిపుణులు అభిప్రాయపడ్డారు. అలాగే ‘ప్రతిపాదిత పోలవరం ప్రాజెక్టు వల్ల ఎక్కువగా నష్టపోయే గిరిజన తెగ?’ అనే ప్రశ్నకు ఇచ్చిన ఆప్షన్లు, మరో ప్రశ్నలో తెలంగాణ ప్రభుత్వ పథకం పేరును ఇంగ్లిష్‌లో వాటర్ గ్రిడ్‌కు బదులు జలహారంగా ఇవ్వడం  ఇంగ్లిష్ మీడియం అభ్యర్థులను సందిగ్ధానికి గురిచేసిందని నిపుణులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు