ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ వైఫల్యం

16 Feb, 2017 01:06 IST|Sakshi

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు
 గట్టు శ్రీకాంత్‌రెడ్డి


సూర్యాపేట : ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలో కాంగ్రెస్‌ పార్టీ వైఫల్యం చెందిందని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. బుధవారం సూర్యాపేట పట్టణంలోని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దొంతిరెడ్డి సైదిరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇటీవల ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 సీట్లకు 10 సీట్లు కాంగ్రెస్‌ పార్టీకే వస్తాయని, కేవలం రెండు సీట్లు మాత్రం సమస్య ఉందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసినా 3 సీట్లు కాంగ్రెస్‌ పార్టీకి రావడం అతికష్టమన్నారు.  2014 సంవత్సరంలో అధికారంలోకి రావాలనే కుయుక్తులతో తెలంగాణ రాష్ట్రం ఇచ్చాక తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి ఎన్ని సీట్లు ఇచ్చారని ప్రశ్నించారు. ఓట్లు, సీట్ల గురించి మాట్లాడడం తప్పా..

రైతులు, విద్యార్థుల ఫీజురీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీపై ఎన్నడైనా అసెంబ్లీలో కాంగ్రెస్‌ పార్టీ తరుపున మాట్లాడారా..అని ప్రశ్నించారు. సర్వేలు చేయించుకొని రాష్ట్రంలో 70 సీట్లు కాంగ్రెస్‌ పార్టీకి వస్తాయని చెప్పడం సరికాదన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 15 సీట్లు కూడా కాంగ్రెస్‌పార్టీకి రావని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌పార్టీ అధికారంలో వచ్చేంత వరకూ గడ్డం తీయనని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్లశక్తిని గడ్డంతో పోల్చడం నీతిమాలిన పని అని విమర్శించారు.

 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వైఎస్సార్‌సీపీకి ఒక ఎంపీ, మూడు ఎమ్మెల్యే సీట్లు రావడంతో పాటు నాలుగు చోట్ల డిపాజిట్‌లు దక్కాయని గుర్తు చేశారు. కాంగ్రెస్‌పార్టీ ప్రస్తుతం రెండు ఎంపీ సీట్లు వస్తే ఆ ఎంపీలు ఎక్కడున్నారని ప్రశ్నించారు. అధికారంలోకి రావాలనే తపన తప్ప కాంగ్రెస్‌పార్టీకి, ప్రజాసమస్యలపై పోరాడుదామనే ఆలోచన లేదన్నారు. ఇతర పార్టీలను కించపరిచే విధంగా ఉత్తమ్‌ మాట్లాడడం సరికాదన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శులు దొంతిరెడ్డి సైదిరెడ్డి, శేఖర్‌రెడ్డి, నాయకులు మద్ది ఉపేందర్‌రెడ్డి, గోరెంట్ల సంజీవ, ఎజాజ్, తాడోజు జనార్దన్‌చారీ, ఎండీ ఇఫ్రాన్, విష్ణు, రాజిరెడ్డి, మహేందర్‌రెడ్డి, నాగేశ్వరరెడ్డి, చంటి, పవన్, వీరస్వామి, హరీష్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు