టీడీపీలో అసంతృప్తి జ్వాలలు

16 Jun, 2016 09:34 IST|Sakshi
టీడీపీలో అసంతృప్తి జ్వాలలు

* తెలుగు తమ్ముళ్ల అసహనం
* భీమవరంలో రెండు వర్గాలుగా పార్టీ శ్రేణులు

 భీమవరం : క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే అధికార తెలుగుదేశం పార్టీలోని నాయకులు, కార్యకర్తల్లో అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్నాయి. భీమవరం నియోజకవర్గంలో రెండేళ్లుగా నివ్వురుగప్పిన నిప్పులా ఉన్న కార్యకర్తల్లోని అసహనం బయటపడుతోంది. ఇందుకు పార్టీ సమావేశాలే వేదిక కావడం గమనార్హం. మంగళవారం వీరవాసరం, భీమవరంలో జరిగిన పార్టీ సమావేశాల్లో కార్యకర్తలు అసంతృప్తి వెళ్లగక్కారు.

ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు వ్యవహార శైలిని తప్పుపట్టారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన 2014 ఎన్నికల సమయంలో టీడీపీ అభ్యర్థిగా పోటీచేశారు. దీనిని జీర్ణించుకోలేని తెలుగు తమ్ముళ్లు కొందరు ఎన్నికల్లో ఆయనకు సరిగా సహకరించకపోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా తమను కాదని కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారికి ఎమ్మెల్యే రామాంజనేయులు ప్రాధాన్యమిస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అక్కసు వెళ్లగక్కుతున్నారు.
 
భీమవరంలో ఎగిసిన నిరసన
భీమవరం పట్టణ పార్టీ అధ్యక్షుడు గనిరెడ్డి త్రినాథ్ అధ్యక్షతన జరిగిన పార్టీ పట్టణ, మండల క మిటీల సమావేశంలో నిరసన గళం వినిపించింది. ఏళ్ల తరబడి సేవ చేస్తున్న కార్యకర్తలకు గుర్తింపు లేకుండా పోయిందని నాయకులు ధ్వజమెత్తారు. నామినేటెడ్ పదవుల పంపిణీలో  కార్యకర్తలను సంప్రదించడం లేదని, పార్టీ కార్యక్రమాలు నిర్వహించినపుడు జనాన్ని తీసుకురావాలని ఒత్తిడి చేస్తున్నారని మండిపడ్డారు.

టీడీపీ వారిని కాదని వేరే పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెడుతున్నారంటూ ఎమ్మెల్యే రామాంజనేయులు చర్యలను ఖండించారు. ఇంతలా జరుగుతున్నా మండల, పట్టణ పార్టీ కమిటీలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. ఇలా పలువురు వ్యతిరేక గళం విప్పడం పార్టీ అధ్యక్షులకు మింగుడు పడలేదు. దీని ప్రభావం వ్యవసాయ మార్కెట్ కమిటీ, గునుపూడి దేవస్థానం కమిటీల నియామకాలపై పడుతుందని పలువురు అంటున్నారు.
 
సీఎం దృష్టికి..
భీమవరం నియోజకవర్గంలోని వీరవాసరం మండలంలో నాయకులు, కార్యకర్తల మధ్య విభేదాలు కారణంగా వీరవాసరంలో నివాసం ఉండే రాష్ట్ర మంత్రి పీతల సుజాత, ఎమ్మెల్యే రామాంజనేయులు వర్గాలుగా టీడీపీ శ్రేణులు విడిపోయాయి. ప్రతి కార్యక్రమంలో మంత్రి సుజాతను అవమానిస్తున్నారంటూ కొందరు రచ్చకెక్కారు.

దీంతో మంత్రి సుజాత భీమవరం నియోజకవర్గం వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని దీనివల్ల పార్టీలో విభేదాలు తలెత్తుతున్నాయంటూ ఎమ్మెల్యే రామాంజనేయుల వర్గం సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకోకపోడంతో విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి.
 
నివురు గప్పిన నిప్పులా..
భీమవరం పట్టణంలో ఇళ్లస్థలాల పూడిక, వీరవాసరం మండలం మత్స్యపురిలో గొంతేరు డ్రెయిన్ మట్టి తరలింపు విషయంలో మంత్రి సుజాత, ఎమ్మెల్యే రామాం జనేయుల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. రెండేళ్లలో ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యే నియోజకవర్గస్థాయి పార్టీ సమావేశం ఏర్పాటుచేయడంపై కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. అయితే ఇప్పటివరకు నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే, పార్టీ పనితీరుపై బహిరంగంగా ఎక్కడా నోరువిప్పిన సందర్భాలు లేవు.
 
వీరవాసరంలో మండిపాటు
వీరవాసరం మండలం రాయకుదురులో పార్టీ మండల శాఖ అధ్యక్షుడు వీరవల్లి చంద్రశేఖర్ అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో తెలుగు తమ్ముళ్లు వాగ్వాదానికి దిగారు. మంత్రి సుజాతకు మండలంలో ప్రాధాన్యమివ్వడం లేదంటూ మండిపడ్డారు. నామినేటెడ్ పదవుల పంపకంలో వీరవాసరం మండల నాయకులకు ప్రాధాన్యమివ్వాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకంలో పనులు చేపట్టకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు