భవిష్యత్తులో ‘తెలుగు’ వెలుగులు

17 Sep, 2016 22:15 IST|Sakshi
భవిష్యత్తులో ‘తెలుగు’ వెలుగులు
  •  తెలుగు వర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్‌ శివారెడ్డి
  •  తెయూలో తెలుగు అధ్యాపకుల సదస్సు
  • తెయూ(డిచ్‌పల్లి):
    భవిష్యత్తులో తెలుగు వెలుగులీనుతుందని తెలుగు విశ్వవిద్యాలయం మాజీ ఉప కులపతి ఎల్లూరి శివారెడ్డి తెలిపారు. తెలుగుకు ప్రాచీన హోదా దక్కడంతో భవిష్యత్‌లో మన భాషకు మంచి రోజులు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ యూనివర్సిటీ తెలుగు అధ్యయన శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన తెలుగు అధ్యాపకుల నాలుగో సమావేశంలో శివారెడ్డి ప్రసంగించారు. తెలుగుకు ప్రాచీన హోదా దక్కడానికి తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషియే ప్రధాన కారణమని, తెలంగాణ సాంస్కృతిక సంచాలకుడు మామిడి హరికృష్ణ అభినందనీయుడని ఆయన పేర్కొన్నారు. హృదయానందాన్ని పంచేదే సాహిత్యమని, తెలుగు అధ్యాపకులు ఎవరికీ తీసిపోరని, ఆత్మగౌరవంతో ఉండాలని పిలుపునిచ్చారు. తెలుగు అధ్యాపకులు హృదయ వికాసం చేస్తారని, తెలుగును శక్తివంతం చేయాలంటే ఇతర భాషలపై పట్టు సాధించాలని వివరించారు. 
    తెలుగు భాష మహోన్నతమైనదని, భాష, యాస, నుడికారం, జాతీయాలపై పట్టుతోనే సీఎం కేసీఆర్‌ ఒక మహా ఉద్యమాన్ని నిర్మించ గలిగారని తెయూ రిజిస్ట్రార్‌ జయప్రకాశ్‌రావు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ భాషపై పట్టుతోనే ప్రజలను కదిలించ గలిగారన్నారు. తెలుగు అధ్యయన శాఖ అధిపతి, ప్రిన్సిపల్‌ కనకయ్య మాట్లాడుతూ.. తెయూ తెలుగు అధ్యయన శాఖ రాష్ట్రంలో ప్రత్యేకతను సంతరించుకుందన్నారు. ఆణిముత్యాలాంటి అధ్యాపకులు, విభాగానికి  గొప్ప పేరు తెచ్చారని అన్నారు. ఈ సందర్భంగా ‘సాహితీ మంజీర, సాహితీ కిన్నెర’ అనే పుస్తకాలను అతిథులు ఆవిష్కరించారు. అనంతరం ప్రొఫెసర్‌ శివారెడ్డి, రిజిస్ట్రార్‌ జయప్రకాశ్‌రావు, సీవోఈగా నియమితులైన  కనకయ్యను ఘనంగా సన్మానించారు. సహాయ ఆచార్యులు బాలశ్రీనివాసమూర్తి, లావణ్య, త్రివేణి, బీవోఎస్‌ లక్ష్మణ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు