తెలుగుభాషకు తృణీకరణా..!

20 Feb, 2017 23:14 IST|Sakshi
తెలుగుభాషకు తృణీకరణా..!
భాషాసాహిత్యాలకు తప్పని ‘చంద్ర’గ్రహణం
వెంటిలేటర్‌పై ఆంధ్రయువతీ సంస్కృత కళాశాల 
దాతల విరాళాలతో నామమాత్రపు జీతాలు
కళాగౌతమి, రచయితల సమితి సమావేశాలకు చోటు కరువు
 
‘తెలుగదేల యన్న దేశభాషలందు తెలుగు లెస్స’ అని శ్రీకృష్ణదేవరాయలు నాడు అన్న మాటలని కాస్తఅటూఇటూ (ఏ)మార్చి, ‘తెలుగదేల? దేశభాషలందు తెలుగు లెస్‌’ అని నేటి పాలకులు అక్షరాలా రుజువు చేస్తున్నారు. ఆంధ్ర మహాభారతం పుట్టిన రాణ్మహేంద్రవరం గడ్డమీద-వేయి సంవత్సరాలకు మించిన చరిత్రగల తెలుగు భాష నేడు అత్యంత నిరాదరణకు గురి అవుతోంది. తెలుగుభాషా సాహిత్యాల వికాసానికి ఆవిర్భవించిన సంస్థల అస్తిత్వానికే ప్రమాదం ముంచుకొస్తోంది. - రాజమహేంద్రవరం కల్చరల్‌ 
 
అంపశయ్యపై తెలుగుసాహిత్య పీఠం 
దివంగత నందమూరి తారక రామారావు మానసపుత్రిక తెలుగు విశ్వవిద్యాలయం. 1985లో ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా 1987లో బొమ్మూరులో తెలుగు సాహిత్యపీఠం ఏర్పడింది. సుమారు 40 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాహిత్య పీఠంలో ఇప్పటి వరకు 340 మంది డాక్టరేట్‌ పట్టాలను అందుకున్నారు. 400 మందికిపైగా పరిశోధక విద్యార్థులు ఎం.ఫిల్‌ పూర్తి చేశారు. సాహిత్య పీఠం గ్రంథాలయంలో అరుదైన 27 వేల గ్రంథాలు ఉన్నాయి. రాష్ట్ర విభజన సాకుగా ప్రభుత్వం సృష్టించిన అనిశ్చిత పరిస్థితితో, నేడు విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. ఎంఏ తెలుగు మొదటి సంవత్సరంలో తొమ్మిది మంది విద్యార్థులు, రెండో సంవత్సరంలో పది మంది విద్యార్థులు మిగిలారు. ‘నేనే వార్డెన్‌ను, నేనే గ్రంథాలయాధికారిని, నేనే డీన్‌ను’ అని సాహిత్యపీఠం డీన్‌ ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌ సాక్షితో అన్నారు. ఇంతటి చరిత్రగల సాహిత్య పీఠం నేడు ఏకోపాధ్యాయ పాఠశాల స్థాయికి దిగజారిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సాహిత్యపీఠం అస్తిత్వానికే ముప్పు
తెలుగు విశ్వవిద్యాలయానికి రాజమహేంద్రవరం ప్రధాన కేంద్రమవుతుందని 2015లో జరిగిన పుష్కరాలలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా ప్రకటన చేశారు. అయితే, ఈ దిశగా ఒక్క అడుగూ ముందుకు పడలేదు సరికదా, అధినేతల నిర్లక్ష్యధోరణితో సాహిత్యపీఠం అస్తిత్వానికే ముప్పు ఏర్పడిందని, ప్రతిష్టాత్మకమైన గౌతమీ విద్యాపీఠం (ఓరియంటల్‌ కళాశాల)కు పట్టిన గతే దీనికి పడుతుందని  çపలువురు సాహితీవేత్తలు, భాషాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విరాళాలతో మనుగడ
గోదావరి గట్టుపై ఉన్న ఆంధ్రయువతీ సంస్కృత కళాశాలకు సుమారు 90 ఏళ్ల చరిత్ర ఉంది. ఒకప్పుడు ఎయిడెడ్‌ హోదా ఈ కళాశాలకు ఉండేది. ఎనిమిది జిల్లాలో అతివలకు తెలుగు, సంస్కృతం బోధించే ఏకైక కళాశాల ఇదే. ఇక్కడ అవధానం నేర్చుకున్న అమ్మాయిలు శతావధానాలు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు తెచ్చిన చీకటి జీవో పుణ్మమా అని ఎయిడెడ్‌ హోదా పోయింది. ఎవరైనా ఒక ఉపాధ్యాయుడు రిటైరయితే, ఆ స్థానంలో మరొకరిని భర్తీ చేసే వెసలుపాటు పోయింది. ప్రతినెలా దాతల నుంచి వచ్చిన విరాళాలతో నామమాత్రపు జీతాలు అధ్యాపకులకు చెల్లిస్తున్నారు. ఎన్ని వినతులు ఇచ్చినా ప్రభుత్వంలో కదలిక లేదు. ప్రభుత్వం నిర్వాకం వలన వెంటిలేటర్‌కు చేరుకున్న మరో సంస్థ ఇది. నగరపాలక సంస్థ పాఠశాలల్లో తెలుగుస్థానే ఇంగ్లిష్‌ భాషను ప్రవేశపెడుతూ జనవరిలో ప్రభుత్వం జారీ జీవో చంద్రబాబు కీర్తికిరీటంలో ‘మరో కలికి తురాయి’. కర్ణాటక రాష్ట్రం, మైసూరులో ఉన్న భారతీయ భాషల అధ్యయన కేంద్రానికి సంబంధించి, తమిళ, కన్నడ, మళయాళ భాషలను ఆయా ప్రభుత్వాలు తమ గూటికి మార్చుకోగలిగాయి. తెలుగుభాషను మాత్రం సొంతగడ్డపైకి మార్చుకోవడానికి ప్రభుత్వం ఎటువంటి కృషి చేయడం లేదు. 
స్వచ్ఛంద సంస్థలకు ప్రోత్సాహం ఏదీ?
అమ్మ పెట్టనూ పెట్టదు, అడుక్కుతిననివ్వదు అన్న రీతిలో అధికారులు తెలుగు భాషా సాహిత్య వికాసాలకు కృషి చేస్తున్న సంస్థలతో వ్యహరిస్తున్నారు. 25 ఏళ్లుగా యువతకు తెలుగు సాహిత్యంపై అభినివేశం కలిగించడానికి కృషి చేస్తున్న కళాగౌతమి, దశాబ్దకాలంపైగా క్రమం తప్పకుండా జరుగుతున్న రచయితల సమితి సమావేశాలకు కాసింత చోటు తెలుగువారి సాంస్కృతిక రాజధానిలో కరువైంది. నూనూగు మీసాల యువకుల నుంచి తల నెరిసిన వృద్ధుల వరకు హాజరయ్యే రచయితల సమితి నెలకు ఒక్కరోజు తన కార్యక్రమాలకు చోటు ఇమ్మని అధికారులను, ప్రజాప్రతినిధులను పదేపదే కోరినా, స్పందన లేకుండా పోయింది. నన్నయ వాజ్ఞ్మయ వేదిక ఇదే సమస్యను ఎదుర్కొంటోంది. అనేక ఇతర సంస్థలదీ ఇదే సమస్య.
తల్లిని, తల్లిభాషను తృణీకరిస్తున్న కాలం ఇది
తల్లిని, తల్లి భాషను తృణీకరిస్తున్న-కాదు తరిమేస్తున్న కాలం ఇది. గతంలో పెద్దలు ఇంట్లోనే తెలుగు అక్షరాలు దిద్దించడం జరిగేది. ఇల్లు బడిగా ఉండేది. ఇప్పుడు అ ఆలు బదులు ఏబీసీడీలు మాత్రమే నేర్పుతున్నాం. ఇంగ్లిష్‌ వ్యాపార భాష. తెలుగు వ్యాపారభాష కాదు. తమిళులకు ఉన్న భాషాభిమానం తెలుగువారికి లేదేమోననిపిస్తోంది.
- ఆచార్య ఎండ్లూరి సుధాకర్, 
డీన్‌ తెలుగు సాహిత్యపీఠం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం
ఆత్మవిశ్వాసం నింపేది మాతృభాషే
ఒక విషయం నిర్మొగమాటంగా చెప్పాలి. ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారిలో దాదాపు అందరూ శాస్త్ర, సాంకేతిక రంగాలకు చెందిన విద్యార్థులు. భాషాసాహిత్యాలను చదివే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం జరుగదు. ఎందుకంటే, సాహిత్యం మనిషిలో ఆత్మస్థైర్యం నింపుతుంది.
- డాక్టర్‌ పీవీబీ సంజీవరావు, తెలుగు అధ్యాపకుడు, ఎస్‌కేవీటీ డిగ్రీ కళాశాల
>
మరిన్ని వార్తలు