అఖండ జ్యోతి మన వెలుగు

28 Aug, 2016 23:34 IST|Sakshi
అఖండ జ్యోతి మన వెలుగు
నేడు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా...
అచ్చ తెనుగు వింటే జుంటి తేనెధారలు జుర్రుకున్నంత మధురంగా ఉంటుంది. తర తరాల మన సాంస్కృతిక ప్రగతికి పట్టుగొమ్మ తెలుగు మన అమ్మభాష. వేల ఏళ్ల చరిత్ర కలిగిన తెలుగు భాషకు ప్రాచీన హోదా గుర్తింపు ఒక లాంఛనమే. ఎందుకంటే ‘ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌’గా పేరుగాంచిన తెలుగు భాష  ప్రపంచ మేధావులు మెచ్చిన అజంత భాష. ఏక వాక్యం మహా కావ్యం అన్న పద్ధతిలో బహుభాషా పండితుడు శ్రీ కష్ణదేవరాయలు ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని ఇచ్చిన కితాబు తెలుగు భాష ఔన్నత్యం భూదిగంతాలకు వ్యాపించేట్టు చేసింది. వ్యవహార భాషా ఉద్యమానికి ఆద్యుడు గిడుగు వెంకట రమణ మూర్తి జయంతి సందర్భంగా ఆగస్టు 29వ తేదీని ‘తెలుగు భాషా దినోత్సవం’గా ఆచరిస్తున్నాం.
విశాఖ–కల్చరల్‌ :
తొలి అడుగు గిడుగు
ఇతిహాసాలు, పురాణాలు, ప్రామాణిక గ్రంథాలు కేవలం పండితులకు మాత్రమే అర్థమయ్యే దేవ భాష (దేవ నాగర లిపి)గా సంస్కృతానికి పెద్ద పీట వేసిన రోజుల్లో ఒక నిశ్శబ్ధ విప్లవం పుట్టింది. గ్రాంధికం స్థాయి నుంచి సామాన్యులకు సులభంగా అర్థమయ్యే విధంగా వ్యవహార భాషా ఉద్యమానికి భాషను నడిపించిన నాథుడు, ఉద్యమానికి ఆద్యుడు గిడుగు రామ్మూర్తి. తెలుగు వాడుక భాష ఉద్యమానికి పితామహుడు.పండితులకు అర్థమయ్యే గ్రాంధిక భాషలో ఉండే ప్రబంధ సాహిత్యమే సాహిత్యం అనుకునే రోజుల్ని ఆయన తిరగరాశారు. తెలుగు వచనాన్ని వాడుకభాషలోకి తీసుకొచ్చినlమహానీయుడయ్యాడు. 
గ్రాంధికం నుంచి వాడుక భాష వరకూ ...
మనస్సులోని భావనను బహిర్గతపరచే సాధనం భాష. స్పష్టమైన ఉచ్ఛారణతో అభిప్రాయాన్ని ఎదుటివ్యక్తికి అర్థమయ్యేట్లు చెప్పగలగటమే భాషకు సార్ధకత. దాన్ని ప్రయోగాత్మకంగా రుజవు చేసి గిడుగు రామ్మూర్తి విజయం సాధించారు. భారత దేశం భిన్న సంస్కతులు, వేష, భాషలకు ఆలవాలమైనట్టే మన తెలుగు భాషకూ వేర్వేరు రూపాలున్నాయి. వ్యవహారిక భాషకు పట్టం గట్టిన రచనలు ఇబ్బడిముబ్బడిగా వచ్చి భాషను సుసంపన్నం చేశాయి. ఆ క్రమం నుంచే మాండలికాలలో రచనలు, లిపి లేని అనుబంధ భాషా కవితోద్యమాలు తెలుగుదనాన్ని సమున్నత శిఖరాలవైపు పయనింపజేశాయి. 
సాహితీచరిత్రలో ఎందరో మహారధులు
సాహితీ చరిత్రలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన ‘కన్యాశుల్కం’ నాటకం రాసిన గురజాడ అప్పారావు మొదలు తెలుగు భాషకు సంబంధించిన నవీన పోకడలకు ఈ ప్రాంతం పెట్టింది పేరు. నవలా సాహిత్యం అగ్రతాంబూలం అందుకునే రోజుల్లో వాస్తవికతకు అద్దం పట్టే రచనలతో సమాజాన్ని కుదిపేసిన గుడిపాటి వెంకటా చలం (చలం) ఈ విశాఖ సాగర తీరం నుంచి పాఠక లోకానికి ‘ప్రేమలేఖలు’ రాసి మనసు గెలుచుకున్నాడు. గ్రాంధిక భాషాభిమానం తగ్గుముఖం పట్టాక వ్యవహార భాషోద్యమం ఊపందుకున్నాక తెలుగు సాహిత్యంలో పైరగాలి తెమ్మెరలా చెవుల్ని కమ్మేసే కమ్మటి లలిత సంగీతమై హత్తుకుంది. ఆ తరహా సాహిత్యానికి వెండితెర వేదికైంది. విప్లవ సాహిత్యం, ప్రేమ సాహిత్యం అన్న పరిధుల్ని చెరిపేసి సాహిత్యానికి అవధులు లేవని చాటి చెప్పిన మహా కవి శ్రీశ్రీ, ఆరుద్ర, అనువాద సాహిత్యానికి వన్నెలద్దిన మహనీయుడు ‘రాజశ్రీ’ ఈ ప్రాంతానికి చెందిన వారే కావడం గమనార్హం. ఓ పక్క ఫక్తు సంగీతం, మరోపక్క అద్భుతమైన సాహిత్యం సమపాళ్లలో సృజించిన బాలాంత్రపు రజనీకాంతరావు తెలుగు భాషా వికాసానికి చేసిన కషి మరువలేనిది. వ్యవహార భాషలో కవిత్వాన్ని అరటి పండు ఒలిచిపెట్టినంత సులభంగా రచించిన అబ్బూరి వరద రాజేశ్వరరావు, ఆ వరసలోనే ఆయన తమ్ముడు గోపాలకష్ణ గణనీయమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఉత్తరాంధ్ర మాండలికానికి రాచఠీవి ఆపాదించిన మహా రచయిత ‘రావి శాస్త్రి’ తెలుగు నాట నాటక కళ ప్రయోగాలకు విశాఖపట్నం పెట్టింది పేరు. 
ఆధునిక నాటక రంగంలో తనకంటూ ప్రత్యేక ముద్రలు పదిలపరచుకున్న గొల్లపూడి మారుతీరావు రచనలకు ప్రాకారం శ్రీకారం విశాఖ నగరమే. నాటకం, సినిమా అన్న తేడా లేకుండా తన కలం పాళీ నుంచి అద్భుతమైన సంభాషణలు, రసపట్టులో సాగే సమకాలీన కథలకు జీవం పోసిన కాశీ విశ్వనాథ్‌ తెలుగు భాషా వికాసానికి చేసిన సేవలు అనితర సాధ్యం. వ్యంగబాణాలు వేయడంలో అందెవేసిన చేయి పతంజలి. సంగీతం, సాహిత్యం రెంటినీ మేళవించి సంగీత నవావధానం ప్రక్రియతో భాషాభిమానులకు కొత్త ఇంధనం నింపే మీగడ రామలింగస్వామి ప్రయోగాలు తెలుగు జాతికి తరగని ఆస్తులు.
తెలుగుకు తెగులెందుకంటే...
  • ప్రాథమిక విద్యాస్థాయి బోధకులలో భాషాపండితులు ఉండడం లేదు.
  • పరభాషా పదాలను విచ్చలవిడిగా వినియోగించడం, 
  • ప్రభుత్వ స్థాయిలోనే వివిధ పథకాలకు ఇంగ్లిష్‌లో పేర్లు పెట్టడం, 
  • తెలుగు భాషను పిల్లలకు చేరువ చేసేలా తెలుగులో కొత్త కృత్రిమ సచేతమైన వ్యక్తలు(యానమేషన్‌ చార్టర్‌)కార్యక్రమం నిర్వహించాలి.
  • ప్రభుత్వ కార్యకలాపాల్లో తెలుగుకి ప్రాధాన్యం తగ్గిపోతుంది. ఈ స్థితిని చక్కదిద్దడానికి వ్యక్తులు, సంస్థలు కృషి మరింత పెరగాలి.
  • తేటతెలుగు మాటల అల్లిక కరువైపోతుంది. స్వరమాధుర్యం కరువైపోతుంది. తెలుగు భాషలో మాట్లాడే వారే తక్కువైపోతున్నారు. ఆధునిక పోకడల పేరుతో మాతృభాష స్వరూప స్వభావాలను, రూపురేఖలను మార్చేస్తున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే వర్ణ, పద, వాక్య స్థాయిలలో పరభాషా పదాలు ఎక్కువై, వ్యాకరణం మాత్రమే తెలుగులో ఉండే స్థితి వచ్చింది.
సారస్వత వేదికలకు కల్ప తరువు
 తెలుగు భాషకు పూర్వ వైభవం తేవాలన్న మొక్కవోని దీక్షతో ఆహర్నిశలూ శ్రమిస్తూ సాహితీ సజనకు అంకితమయ్యే సారస్వత వేదికలకు విశాఖ ఆది నుంచి కల్పతరువే. విశాఖ సాహితి, సహదయ సాహితి, మొజాయిక్, సాహిత్య సురభి, వంటి ఎన్నో సంస్థలు సాహితీ సజనకు గీటురాయి వంటి చర్చోపచర్చలు చేపట్టి నేటి తరాలకు వేగుచుక్కల్లా వ్యవహరిస్తున్నాయి.
తెలుగు రచయితల వేదిక 
విశాఖ సాహితి, మొజాయిక్‌ సాహిత్య సంస్థలు తెలుగు రచయితల వేదికగా నిలుస్తున్నాయి. తెలుగు భాషా సాహిత్యాలు వికాసమే లక్ష్యంగా తెలుగు రచయితల వేదికగా నిలుస్తున్నాయి. కథారచన, కవితారచన, సాహిత్య విమర్శల జల్లుకు వేదికగా నిలుస్తోంది. ముఖ్యంగా మొజాయిక్‌ సాహిత్య సంస్థ రచయితల కల్పతరువుగాను, అనువాద సాహిత్యాల వేదికగా నిలుస్తోంది.
తెలుగు భాష పరిరక్షణ చట్టాన్ని అమలు పరచాలి
నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో నూతనంగా ఏర్పాటు చేసిన అన్ని శిలాఫలకాలు తెలుగులోనే ఉండాలి. తెలుగు భాష పరిరక్షణ చట్టాన్ని సంపూర్ణంగా అమలు పరచాలి. తెలుగు పరిరక్షణ కోసం ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు పరచాలి. గత ఏడాది గిడుగు రామూర్తి పంతులుగారి పుట్టిన రోజు సందర్భంగా నాలుగో తరగతి నుంచి డిగ్రీ వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులో బోధిస్తామని చేసిన వాగ్దానాలు, చట్టాలు సంపూర్ణంగా అమలు చేయాలి.
– డాక్టర్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, సాహితీవేత్త
తెలుగు భాష ఔన్నత్యం చాటాలి
తెలుగు భాష జ్ఞానాన్ని, ఔన్నత్యాన్ని వెలుగెత్తి చాటాలి. వ్యవహారిక భాషకు ప్రాధాన్యం ఇవ్వాలి. తెలుగు వ్యవహారిక భాషోద్యమకారుడైన గిడుగు రామ్మూర్తి సేవలను గుర్తించాలి. వెయ్యేళ్ల సాహిత్యం ఉన్న భాషగా తెలుగును గుర్తించాలి. భవిష్యత్తు తరాలకు తెలుగుదనం బోధించే విధంగా విద్యామాధ్యమాల్లో తెలుగు ప్రాథమిక బోధన వాడాలి. ఒకటి నుంచి డిగ్రీ, సాంకేతిక విద్య, ఎంబీఏ వంటి పోస్టుగ్రాడ్యుయేట్‌ చదువుల వరకు తెలుగు భాషను కచ్చితంగా అమలు పరచాలి. భాషా అభివద్ధి, నైపుణ్యతకు ప్రభుత్వ చిత్తశుద్ధి వహించాలి.
–రామతీర్ధ, మొజాయిక్‌ వ్యవస్థాపక కార్యదర్శి, సాహిత్య విమర్శకుడు
ఆదివారం–తెలుగువారం
 ‘ఆదివారం–తెలుగువారం’అనే నినాదం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. ఆహార వ్యవహారాలన్నీ తెలుగులోనే నిర్వహించే ఒరవడికి శ్రీకారం చుట్టాలి. దీని కోసం మూడు రోజులపాటు ఒక నిర్దుష్ట లక్ష్యసాధన కోసం 29 నుంచి మూడు రోజుల పాటు తెలుగు దీక్ష పేరుతో యజ్ఞం చేస్తున్నాను. ‘తెలుగు దండు’పేరుతో లక్ష సంతకాలు సేకరిస్తున్నాం. భావ సారూప్యం కలిగిన భాషాభిమానులతో ఏర్పడిన తెలుగు దండులో భాషాభిమానులంతా సభ్యులుగా చేరి తెలుగు భాషాభివద్ధికి కషి చేయాలి.
–పరవస్తు ఫణిశయన సూరి, పరవస్తు పద్యపీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు
భాషా పరిరక్షణలో భాగస్వాములు కావాలి
ప్రపంచీకరణ మోజులో తెలుగు జాతి తన ఉనికి, అస్తిత్వం కోల్పోతుందేమోనన్న దిగులు తొలిచేస్తోంది. దాన్నుంచి మన తెలుగు జాతి త్వరగా బయటపడాలి. లేకపోతే మన మాతృభాష ‘మృత’భాషల జాబితాలో చేరిపోయే ప్రమాదం పొంచి ఉంది. యునెస్కో చేసిన పిడుగులాంటి హెచ్చరిక నిజం కాకూడదని త్రికరణ శుద్ధితో కోరుకొంటున్నా. ఆగస్టు 29న వ్యవహారిక భాషా ఉద్యమానికి ఆద్యుడైన గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా మాతృభాషాదినోత్సవం రోజున ఈ మహా క్రతువు చేపడుతున్నాం. ఒక వేలు పిడికిలి కాదు..ఒక చెట్టు వనం కాదు’ కాబట్టి తెలుగు వారందరూ ఇందులో భాగస్వాములు కావాలి. 
–సాహితీ రత్నాకర డాక్టర్‌ డి.వి.సూర్యారావు, సాహిత్య విమర్శకుడు
 
 
మరిన్ని వార్తలు