తెలుగు మాధుర్యాన్ని భావితరాలకు పంచుదాం

27 Feb, 2017 01:15 IST|Sakshi
కర్నూలు(వైఎస్‌ఆర్‌ సర్కిల్‌): సమాజంపై నవీన నాగిగరికత ప్రభావం పెరిగిపోతున్న నేపథ్యంలో  తెలుగు భాష మాధుర్యాన్ని భావితరాలకు పంచేందుకు ప్రతి ఒక్కరూ ముఖ్యంగా తెలుగు పండితులు కృషి చేయాలని కర్నూలు జిల్లా తెలుగురచయితల సంఘం అధ్యక్షులు గన్నమరాజు సాయిబాబా పిలుపునిచ్చారు.  స్థానిక మద్దూర్‌ నగర్‌లోని తెలుగుతోటలో ఆదివారం ‘తెలుగు పద్యము-వ్యక్తిత్వ వికాసము’ అన్న అంశంపై ఏర్పాటు చే సిన సాహిత్య సదస్సులో సాయిబాబా మాట్లాడారు. సాహిత్య సౌరభాల గుభాళింపులే సమాజ చైతన్యానికి ప్రామాణికమన్నారు. విశాలము, విస్తార భావాలను సంక్షిప్తంగా రసవత్తరంగా పదకూర్పుతో పద్యాలల్లి సమాజానికి దిశానిర్దేశము చేయగల సత్తా ఒక కవికి మాత్రమే ఉందన్నారు. వేమనశతకం, కృష్ణశతకాల్లో అలతి అలతి పదాలతో మహోన్నత వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే నీతి బోధనలెన్నో ఉన్నాయన్నారు. బాల్యం నుంచి ఇలాంటి పద్యకవితలపై అవగాహన కల్పిస్తే భావితరాలు కూడా తెలుగుభాషలోని తీయదనాన్ని రుచి చూస్తారనీ, తద్వారా మాతృభాష ఔన్నత్యాన్ని చాటిచెప్పిన వారమవుతామన్నారు. అనంతరం డోన్‌కు చెందిన తెలుగు పండితుడు సురేష్‌ దంపతులను ఈ సందర్భంగా సన్మానించారు. కార్యక్రమంలో చంద్రశేఖర్, జేఎస్‌ఆర్‌కే శర్మ, వీపూరి వెంకటేశ్వర్లు, పురోహితులు శ్రీనివాసులు, రఘుబాబు, కెంగేరి మోహన్, సూర్యచంద్రారెడ్డి, రఘునాథ్, హరినాథ్, శ్రీధర్‌మూర్తి, దేవేంద్రప్ప తదితరులు పాల్గొన్నారు.  
 
మరిన్ని వార్తలు