ట్విట్టర్ సీఈవో రేసులో తెలుగు మహిళ

4 Sep, 2015 20:49 IST|Sakshi
ట్విట్టర్ సీఈవో రేసులో తెలుగు మహిళ

విజయవాడ: ప్రముఖ సోషల్ మీడియా ట్విట్టర్‌కు సీఈవోగా విజయవాడకు చెందిన ఎల్లపద్ది పద్మశ్రీ వారియర్ పేరు పరిశీలనలో ఉంది. నలుగురి పేర్లను ట్విట్టర్ యాజమాన్యం పరిశీలనకు తీసుకుంది. ఇందులో పద్మశ్రీ పేరు కూడా ఉండటంతో అంతర్జాతీయ స్థాయిలో విజయవాడ పేరు తెరపైకి వచ్చింది. పద్మశ్రీ ఎలిమెంటరీ స్థాయి నుంచి డిగ్రీ వరకు విజయవాడలోనే చదువుకున్నారు. అనంతరం ముంబై, అమెరికాల్లో విద్యాభ్యాసం చేశారు. మోటరోలా ఎనర్జీ సిస్టమ్స్‌లో 23 ఏళ్ల పాటు పనిచేసి శభాష్ అనిపించుకున్నారు. అమెరికా అధ్యక్షుడి చేతుల మీదుగా పలు అవార్డులు కూడా అందుకున్నారు.

విజయవాడ గాంధీనగర్ ప్రాంతంలో పద్మశ్రీ 1961లో జన్మించారు. పదో తరగతి వరకు చిల్డ్రన్స్ మాంటిస్సోరిలో.. మేరీ స్టెల్లా కళాశాలలో ఇంటర్ చదివారు. ఐఐటీ, ముంబైలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అమెరికాలో కార్నెల్లి యూనివర్సిటీలో పీజీ చేసిన అనంతరం మోటరోలా ఎనర్జీ సిస్టమ్స్‌లో 1984లో ఉద్యోగంలో చేరిపోయారు. 2007 వరకు పనిచేశారు. 2007లో సిస్కో ఎనర్జీ సిస్టమ్స్‌లో సీటీవోగా చేరారు. 2015 జూన్‌లో సంస్థ నుంచి బయటకు వచ్చేశారు. ఆమెకు భర్త మోహన్‌దాసు వారియర్, కుమారుడు కర్నా వారియర్ ఉన్నారు.

మరిన్ని వార్తలు