పెరగనున్న ఉష్ణోగ్రతలు

9 Mar, 2016 02:39 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: కొద్ది రోజుల విరామం తర్వాత మళ్లీ ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. ఫిబ్రవరి మూడో వారంలోనే సాధారణంకంటే ఐదారు డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్చి ఆరంభంలో అవి కాస్త తగ్గుముఖం పట్టాయి. దాదాపు వారం రోజుల పాటు సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతూ వచ్చాయి.

తాజాగా మళ్లీ పెరుగుతున్నాయి. మంగళవారం పగటి ఉష్ణోగ్రతలు అత్యధికంగా తెలంగాణలోని నిజామాబాద్, రాయలసీమలోని అనంతపురంలోనూ 39 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఇవి సాధారణంకంటే రెండు డిగ్రీలు అధికం. కోస్తాంధ్రలోని తుని, నందిగామల్లో 37 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత (2 డిగ్రీలు అధికం) నమోదైంది. ఇకపై క్రమేపీ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో ఎండల తీవ్రత అధికమై సాయంత్రం వేళ తెలుగు రాష్ట్రాల్లో  ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని రిటైర్డ్ వాతావరణ అధికారి ఆర్.మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు.

మరిన్ని వార్తలు