విగ్రహాలు ప్రస్తుతం విలపిస్తున్నాయి..

30 Jul, 2016 11:38 IST|Sakshi
బందీగా దేవతామూర్తులు..

విజయవాడ: నూతన రాజధానిలో వందల సంవత్సరాల నాటి దేవాలయాలు, మఠాలు విజయవాడలో కూల్చివేతకు గురయ్యాయి. అందులోని విగ్రహాలు ప్రస్తుతం విలపిస్తున్నాయి. నిత్యం ధూపదీప నైవేద్యాలతో పూజలందుకునే దేవతామూర్తుల విగ్రహాలు కొన్ని ప్రస్తుతం ఏ పూజకూ నోచుకోకుండా మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని గదుల్లో బందీలయ్యాయి. కృష్ణా నది ఒడ్డున నిత్యపూజలతో ఆధ్యాత్మికత విలసిల్లే వాతావరణం నేడు కనుమరుగవుతోంది.

భక్తులతో కిటకటలాడాల్సిన ఆలయాలు నేలమట్టమై, దేవతామూర్తులు కనిపించకుండాపోవడంపై భక్తజనం ఆక్రోశిస్తున్నారు. విగ్రహాలు ఎక్కడికి తరలించారో అధికారులు చెప్పకపోవడంతో భక్తులు మండిపడుతున్నారు. ఆలనాపాలన, పూజా కార్యక్రమాల నిర్వహణకు విగ్రహాలు నోచుకోక ఎక్కడో ఓ మూలలో, చీకటి గదుల్లో ఉంచేశారు. తొలగించిన దేవాలయాలను పునర్మిస్తామని, విగ్రహాలకు నిత్య పూజలు జరిగేలా చూస్తామని చెప్పిన దేవాదాయశాఖ మంత్రి ఆ విషయం మరిచిపోయారు.

చెల్లా చెదురైన విగ్రహాలు
గుళ్లు తొలగించిన వారు ఇష్టమొచ్చిన చోట విగ్రహాలు పడేశారు. కొన్నింటిని మునిసిపాలిటీలో ఉంచారు. రథం సెంటర్‌లో ఉన్న పురాతన ద్వారపాలకుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. శనీశ్వరాలయానికి ఎదురుగా ఇంద్రకీలాద్రికి దిగువ భాగంలో ఉండే సీతమ్మవారి పాదాలు తీసివేశారు. పురాతనమైన ఆంజనేయస్వామి దేవాలయాన్నీ కూల్చివేశారు.

అర్జునవీధిలోని మహామండపం దిగువన గుడి ఉంది. అమ్మవారి గుడికి నాలుగు వైపుల ఆంజనేయస్వామి గుడులు ఉన్నాయి. అందులో తూర్పువైపున ఉన్న ఆంజనేయుడి దేవస్థానాన్ని కూల్చాక విగ్రహాన్ని ట్రాలీలో వేసి తాళ్లతో కట్టి మునిసిపల్ ఆఫీసుకు తీసుకెళ్లారు. అక్కడ ఆరుబయట ట్రాలీని ఉంచడంతో ‘సాక్షి’లో ఆ ఫొటో ప్రచురితమైంది. దీంతో తేరుకున్న అధికారులు అందులోని విగ్రహాలను వేరే ప్రాంతాలకు తరలించారు.

పుష్కరాల సమయంలో దర్శనానికి దిక్కేది?
పుష్కరాల సమయంలో భక్తులు దేవుడి దర్శనం చేసుకుందామంటే దేవాలయం కనిపించడం లేదు. ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గామల్లేశ్వరస్వామిని దర్శించుకుందామంటే ఘాట్ రోడ్డును మూసేశారు. అక్కడ ఉండే దుకాణాలు, విచారణ కేంద్రాలు, కార్యనిర్వహణాధికారి, పరిపాలనా భవనాలు, ఇతర దీక్ష మండపాలు, భవనాలు కూల్చి వేశారు. ఎందుకిలా చేశారని ప్రశ్నిస్తే ఈ ప్రాంతాన్ని గ్రీనరీగా మారుస్తామని చెబుతున్నారు. మరోవైపు ఆలయాల కూల్చివేతపై వేసిన మంత్రుల కమిటీ మాటలకే పరిమితమైంది. సీతమ్మవారి పాదాలు, దక్షిణముఖ ఆంజనేయ స్వామి ఆలయాలు పునర్మిస్తామని మంత్రి మాణిక్యాలరావు హామీ ఇచ్చారు. ఇంతవరకు ఆ ఊసేలేదు.

మరిన్ని వార్తలు