రాజకీయ పునరావాస కేంద్రాలుగా ఆలయాలు

24 Mar, 2017 22:48 IST|Sakshi
రాజకీయ పునరావాస కేంద్రాలుగా ఆలయాలు
–శ్రీ విద్యాగణేశానంద మహాసంస్థానం పీఠాధిపతి విద్యాగణేశానంద భారతి
రాజమహేంద్రవరం కల్చరల్‌ : రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రాలుగా ఆలయాలు మారుతున్నాయని హైదరాబాద్‌కు చెందిన శ్రీవిద్యాగణేశానంద మహాసంస్థానం పీఠాధిపతి విద్యాగణేశానందభారతి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన గౌతమఘాట్‌లోని అయ్యప్పస్వామి ఆలయాన్ని దర్శించారు. ఆలయ కమిటీ గౌరవాధ్యక్షురాలు, వైఎస్సార్‌ సీపీ కేంద్రపాలకమండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆయనకు సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా విద్యాగణేశానందభారతి మాట్లాడుతూ ఆలయాల నిర్వహణ ధార్మిక సంస్థలు, పీఠాల ఆధ్వర్యంలో ఉన్నప్పుడే సక్రమంగా నడుస్తుందన్నారు. ధర్మశాస్త్ర పరిజ్ఞానం లేనివారు, వేదవేదాంగాలను అధ్యయనం చేయనివారు, ఆచార సంప్రదాయాలు తెలియనివారు ఆలయ కమిటీలకు చైర్మన్లు, కార్యవర్గసభ్యులు అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఈ రంగాల్లో నిష్ణాతులు ప్రభుత్వం నియమించే ఆలయ కమిటీలలో ఒక్కరయినా ఉంటున్నారా? రాజరాజు, శ్రీకృష్ణదేవరాయలు, శివాజీ, చోళులు ఆలయాలను నిర్మించినా, నిర్వహణలో జోక్యం చేసుకోలేదు. బ్రాహ్మీముహూర్తంలో వచ్చి తొలిపూజ చేసుకుని వెళ్లిపోయేవారు. ఇప్పుడు అంతా అపసవ్యంగా ఉంది.’ అని విద్యాగణేశానంద భారతి తెలిపారు. అయ్యప్పస్వామి ఆలయం నగరానికే తలమానికంగా వెలుగొందుతోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. కోరుకొండ రెవిన్యూ డివిజనులో అధికారులు రిజిస్ట్రేషన్లు నిలిపివేసి, రైతుల జీవితాలతో ఎలా ఆడుకుంటున్నారో జక్కంపూడి విజయలక్ష్మి స్వామీజీకి వివరించారు. ప్రభుత్వ చర్యలను ఖండిస్తున్నానని విద్యాగణేశానంద భారతి అన్నారు. ఆదిశంకరుల షణ్మత పూజల్లో, గణేశ ఆరాధన అంతరించిపోతున్నదని, దీనిని పునరుద్ధరించడమే తన లక్ష్యమని ఆయన అన్నారు. ఆంధ్రపత్రిక సంపాదకుడు దివంగత శివలెంక శంభుప్రసాద్‌కు మూడో తరానికి చెందిన వ్యక్తినని ఆయన తెలిపారు. ధర్మశాస్తాసభ్యులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు