శంషాబాద్ పరిధిలో కొలువుదీరినకోవెలలు

10 Jul, 2016 01:27 IST|Sakshi
శంషాబాద్ పరిధిలో కొలువుదీరినకోవెలలు

ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీక
చారిత్రక ప్రాభవానికి దర్పణం
జాతరలతో భక్తులసందడి


శంషాబాద్.. ఈ పేరు వినగానే ముందుగా అందరికీ గుర్తుకువచ్చేది ఎయిర్‌పోర్ట్. అంతర్జాతీయ విమానాశ్రయంతో ఖ్యాతి గడించిన ఈ పట్టణం ఆలయాలకు సైతం ఆలవాలమైంది. ఎటు చూసినా పచ్చని పంట పొలాలు.. ఆహ్లాదకర వాతావరణానికి తోడు పట్టణ పరిసరాల్లో ఎన్నో కోవెలలు కొలువుదీరాయి. నాటి కళానైపుణ్యం, భిన్న సంస్కృతులకు ఆనవాలుగా నిలిచిన పురాతన ఆలయాలు కొన్నైతే.. నేటి నిర్మాణ శైలితో రూపుదిద్దుకొన్నవి మరికొన్ని..  ఆధ్యాత్మిక  వైభవానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ ఆలయాల సమాహార కథనమే ఈ ఆదివారం ప్రత్యేకం..

తైలాభిషేకంతో తరించే శనైశ్చరుడు..
మదన్‌పల్లి వద్ద రాష్ట్రంలోనే అతి పెద్ద శనైశ్చరుడి ఏకశిలా విగ్రహాన్ని నెలకొల్పారు. 12.5 అడుగుల శనైశ్చరుడి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠాంచారు. దీనికి ఎదురుగా శనైశ్చరుడి రథమైన కాకి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మహాబలిపురానికి చెందిన శిల్పకారులు ఈ విగ్రహాలను రూపొందించారు. దేవాలయం వెనుక భాగంలో శివలింగం, శివపార్వతుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. శ్రీగిరి శనైశ్చర పీఠం ట్రస్టు ఆధ్వర్యంలో నిర్మించిన ఈ ఆలయంలో కోయదొరలు పూజలు నిర్వహించడం విశేషం. మూడేళ్ల క్రితం విగ్రహ ప్రతిష్ఠాపన జరగగా.. శనైశ్చరుడికి భక్తులు నేరుగా తైలాభిషేకం నిర్వహించేలా ఆలయ నిర్మాణం చేపట్టారు.

 ప్రత్యేక పూజలు..
శని త్రయోదశి, శని అమావాస్య రోజుల్లో ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శనైశ్చరుడికి తైలాభిషేకం, మహాహోహం నిర్వహిస్తుం టారు. శనైశ్చరుడికి ప్రీతిపాత్రమైన నల్లటి దు స్తులు ధరించి భక్తులు ఇక్కడ పూజలు చేస్తారు.

 ఎక్కడుంది..?
శంషాబాద్ పట్టణానికి సుమారు 10 కిలో మీటర్ల దూరంలో బెంగళూరు జాతీయ రహదారి పక్కన ఈ ఆలయం ఉంది.

జీవాలో దివ్యసాకేతాలయం..
ముచ్చింతల్ సమీపంలోని జీవా క్షేత్రంలో దివ్యసాకేతాలయం నెలకొంది. ఆల యంలోని మూడు అంతస్తుల్లో శ్రీరాముడు, శ్రీరంగనాథుడు, శ్రీవైకుంఠనారాయణుడు కొలువుదీరారు. శ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి పర్యవేక్షణలో ఎనిమిదేళ్ల క్రితం ఈ ఆలయ నిర్మాణం చేపట్టారు. ఏటా ఏప్రిల్‌లో ఇక్కడ దివ్య సాకేత బ్రహ్మోత్సవాలను జీయర్‌స్వామి పర్యవేక్షణలో నిర్వహిస్తారు. ఆలయంలో నిత్య పూజలు జరుపుతుంటారు.

 ఎక్కడుంది?
మదన్‌పల్లి వద్ద బెంగళూరు జాతీయ రహదారి నుంచి ముచ్చింతల్ వెళ్లే దారిలో ఈ ఆలయం దర్శనమిస్తుంది.

216 అడుగుల  సమతామూర్తి..
మహాత త్వవేత్త.. సమతామూర్తి అయిన శ్రీరామానుజుల వారి 216 అడుగుల భారీ లోహపు విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచంలో ఉన్న అన్నింటికంటే ఎతై ్తన విగ్రహంగా ఇది  రూపుదిద్దుకోనుంది. 45 ఎకరాల సువిశాల ప్రాంగణంలో సుమారు రూ.400 కోట్లతో ‘సమతామూర్తి స్ఫూర్తి’  కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిశ్చయించారు. రామానుజుల వారి లోహపుమూర్తితో పాటు ఆయన జీవిత విశేషాలు, 108 సుప్రసిద్ధ దివ్యక్షేత్రాల దర్శనం ఒకే చోట ఏర్పాటు చేయనున్నారు. 2017 నాటికి పూర్తి చేయాలని సంకల్పించారు.

ధర్మసాయి మందిరం
అన్ని ప్రాంతాల్లోకి భిన్నంగా ఇక్కడ సాయిబాబా తన చేతిలో ధర్మకాంటాతో భక్తులకు దర్శనమిస్తాడు. ధరణిమాత అనే సాయి భక్తురాలు సుమారు 25ఏళ్ల క్రితం కొండ ప్రాంతంలో ఆలయ నిర్మాణం చేపట్టారు. భారీ శివలింగంలో ఆలయాన్ని ఏర్పాటు చేశారు. పక్కనే ఏర్పాటు చేసిన నందిలో కూడా సాయిబాబా దర్శనమిస్తాడు. ప్రతి గురువారం వందలాదిమంది  భక్తు లు బాబాను దర్శించుకుంటారు. బాబా చేతిలో ఉన్న కాంటాలో మనసులో ఉన్న కోర్కెలను చీటిలో రాసి వేస్తారు. కోర్కె లు తీరిన తర్వాత తమ మొక్కులను తీర్చుకుంటారు. ఆలయం లో వేలాది శివలింగాలు దర్శనమిస్తా యి. ఏనుగు నిర్మాణంలో గణపతి దర్శనిమిస్తాడు.

 ఉత్సవాలు ..
గురుపౌర్ణమి, దసరా నవరాత్రి ఉత్సవాలు, దీపావళి పండుగలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ప్రతి గురు, ఆదివారాల్లో భక్తులకు అన్నదానం చేస్తారు.

 ఎక్కడుంది..?
శంషాబాద్ నుంచి మామిడిపల్లి వైపు వెళ్లే రహదారిలో ఈ మందిరం కొలువైంది. 

అతి ప్రాచీనం అమ్మపల్లి..
చూడముచ్చట గొలుపే ఎతై ్తన గోపురం.. నాటి కళా వైభవానికి ప్రతీకగా నిలిచే ఆలయ ప్రాకారాలు..  రాష్ట్రంలోనే అతి ప్రాచీన ఆలయాల్లో ఒకటిగా నిలిచింది ‘అమ్మపల్లి’ దేవాలయం. శ్రీ సీతారామచంద్రస్వామి కొలువుదీరిన ఈ ఆలయం వద్ద  జరిగే సినిమా షూటింగ్‌లతో జాతరను తలపిస్తుంటుంది. సుమారు 400 ఏళ్ల క్రితం నుంచి ఈ ఆలయం చారిత్రక సంపదగా వెలుగొందుతోంది. నర్కూడ సమీపంలో అమ్మపల్లి దేవాలయం నెలకొంది. సుమారు 90 అడుగుల ఎత్తులో ఉండే రాజగోపురం.. ప్రధాన ద్వారంపై సేదతీరుతూ దర్శనమిచ్చే అనంత పద్మనాభస్వామి.. లోనికి వెళ్లగానే విశాలమైన మహా మంటపం కనిపిస్తాయి. గర్భగుడిలో ఏకశిలా రాతి విగ్రహంపై లక్ష్మణ సమేతా సీతారామచంద్ర స్వామి కొలువుదీరడం ఇక్కడి ప్రత్యేకత. విగ్రహాలపై దశావతారాల్లో మకరతోరణం కనిపిస్తుంటుంది. గర్భగుడిపై భాగంలో దశావతారాలు కళ్లకు కట్టినట్లు కళారూపాలుగా దర్శనమిస్తాయి. 

 రాములవారి కల్యాణం ప్రత్యేకం..
ఏటా శ్రీరామనవమి సందర్భంగా శ్రీసీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తారు. నిత్యం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

 ఎక్కడుంది..?
శంషాబాద్‌కు దక్షిణ వైపు షాబాద్ రోడ్డులో నాలుగు కిలో మీటర్లు ప్రయాణం చేస్తే ఆలయానికి చేరుకోవచ్చు.

శతాబ్దాల చరితగల సిద్దులగుట్ట ..
వెండికొండ సిద్దేశ్వరాలయానికి (సిద్దులగుట్ట) శతాబ్దాల చరిత్ర ఉంది. పాలరాతి కొండపై వెలిసిన ఈ దేవాలయం వెండికొండగా ప్రసిద్ధిగాంచింది. వ్యాధి పీడితులతో అల్లాడుతున్న ఈ ప్రాంతంలో పూర్వకాలం ఓ రుషి వెండి కొండపై తపస్సు చేసి సిద్దేశ్వరుడిని ప్రతిష్ఠించడంతో రోగులకు విముక్తి కలిగినట్లు చరిత్ర చెబుతోంది. ఆలయంలోని అంతర్భాగంలో ఉన్న నిర్మాణాన్ని మూడేళ్ల క్రితం పురావస్తు శాఖ అధికారులు పరిశీలించి చోళరాజుల నాటి కట్టడాలుగా నిర్ధారించారు. ఇక్కడి సిద్దేశ్వరుడిని కొలిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం. శంషాబాద్, మహేశ్వరం, మొయినాబాద్, రాజేంద్రనగర్‌లో వందలకొద్ది సిద్దేశ్వర్, సిద్దుల పేర్లతో ఉన్నారు. ఇక్కడి మొక్కులతోనే వారంతా ఆ పేరు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

 ఉత్సవాల సమయం..
ఏటా శ్రావణమాసం మూడో వారంలో అత్యంత వైభవంగా సిద్దులగుట్ట జాతర కొనసాగుతోంది. 1955 ప్రారంభమైన ఈ జాతరను ప్రతి ఏడాది వైభవంగా నిర్వహిస్తారు. వేలాది మంది భక్తుల రాకతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది.

ఎక్కడుంది..?
శంషాబాద్ పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం కొలువుదీరింది.

మహాద్భుత క్షేత్రం..శృంగేరి పీఠం
ఊట్‌పల్లి పంచాయతీ పరిధిలో శ్రీశారదానగర్‌లో శ్రీశృంగేరి పీఠం నెలకొంది. దక్షిమ్నాయ శృంగేరి శ్రీశారదాపీఠం నేతృత్వంలో జగద్గురు శంకరాచార్యుల వారి దేవాలయ సముదాయాన్ని ఇక్కడ నిర్మించారు. 2012లో పూర్తి చేసుకున్న ఈ ఆలయంలో శారదాదేవి, చంద్రమౌళీశ్వరస్వామి, గణేశుడు, ఆదిశంకరాచార్యులు, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కొలువుదీరారు. శృంగేరి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య భారతీతీర్థ మహాస్వామి స్వయంగా ఆలయ మూలవిరాట్‌లతో పాటు ఇతర దేవతా విగ్రహమూర్తులను ప్రతిష్ఠించారు.

 వార్షికోత్సవ వైభవం..
ఆలయంలో నిత్యం ఉదయం విశేషార్చనలు, ప్రతీనెల మాస శివరాత్రి మహాలింగార్చన జరుపుతారు. ఏటా ఆలయ వార్షికోత్సవాలను వైభవంగా నిర్వహిస్తుంటారు.

 ఎక్కడుంది..?
శంషాబాద్ నుంచి నర్కూడ వెళ్లే దారి నుంచి కిలో మీటరు దూరంలో ఈ ఆలయం ఉంటుంది.

మరిన్ని వార్తలు