‘పాలమూరు’కు పోటాపోటీ

21 Feb, 2016 04:02 IST|Sakshi
‘పాలమూరు’కు పోటాపోటీ

రూ. 29,924 కోట్ల పనులకు టెండర్లు వేసిన పెద్ద సంస్థలు
పోటీలో ఎల్‌అండ్‌టీ, నవయుగ, గాయత్రి, కేఎన్‌ఆర్, పటేల్, మెగా ఇంజనీరింగ్ సంస్థలు
సాంకేతిక కారణంతో తెరుచుకోని ప్యాకేజీ-4, ప్యాకేజీ-15 టెండర్లు
చివరి నిమిషం వరకు టెండర్ల దాఖలుకు పోటీపడ్డ కాంట్రాక్టర్లు
టెక్నికల్ బిడ్‌ను తెరిచిన అధికారులు.. ఈ నెల 29న ప్రైస్‌బిడ్

 
 సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులకు భారీగా పోటీ నెలకొంది. ఈ పనులకు సాంకేతిక టెండర్లను శనివారం సాయంత్రం బహిర్గతం చేశారు. మొత్తంగా రూ.29,924.78 కోట్ల విలువైన 18 ప్యాకేజీల పనులు దక్కించుకునేందుకు పేరుపొందిన కాంట్రాక్టు సంస్థలు క్యూ కట్టాయి. సాంకేతిక కారణాలతో ప్యాకేజీ-4, ప్యాకేజీ-15ల టెండర్లను తెరవలేదు. మిగతా 16 ప్యాకేజీలకు ఎల్‌అండ్‌టీ, నవయుగ, గాయత్రి, మెగా, కేఎన్‌ఆర్, పటేల్ ఇంజనీరింగ్ వంటి సంస్థలు పోటీపడ్డాయి. ఆయా సంస్థలు సాంకేతిక నిబంధనల మేరకు అర్హత సాధించాయా, లేదా? అన్న అంశాలను పరిశీలిస్తామని... దీనికి సుమారు 9 రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. అనంతరం ఈ నెల 29న ప్రైస్‌బిడ్‌ను తెరుస్తారు. అందులో తక్కువ ధర కోట్ చేసిన సంస్థను ఎల్-1గా గుర్తించి వారికి టెండర్ ఖరారు చేయనున్నారు.

 భారీగా పనులు..
 మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 62 మండలాల్లోని 1,131 గ్రామాల పరిధిలో 10 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే లక్ష్యంతో ‘పాలమూరు-రంగారెడ్డి’ ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లాలో నిర్మించే కేపీ లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్ మినహా ప్రాజెక్టులోని ఐదు రిజర్వాయర్లు, అనుసంధానంగా నిర్మించే టన్నెల్, కాల్వల పనులకు గత నెల 17న నీటి పారుదల శాఖ టెండర్లు పిలిచింది. దీనికి సంబంధించిన టెక్నికల్ బిడ్‌లను శనివారం సాయంత్రం ఆరున్నరకు తెరిచారు. బిడ్ సమయం ముగిసే కొద్ది నిమిషాల ముందు వరకూ కూడా టెండర్లు దాఖలు కావడం గమనార్హం.

 పెద్ద ప్యాకేజీల వైపే బడా సంస్థల మొగ్గు
 ప్రాజెక్టులోని పెద్ద ప్యాకేజీల పనులను దక్కించుకునేందుకు పటేల్, నవయుగ, ఎల్ అండ్‌టీ, మెగా వంటి సంస్థలు పోటీలో నిలిచాయి. రూ. 3,226.46 కోట్లు విలువైన పనులున్న ప్యాకేజీ-1 కోసం పటేల్, నవయుగ కంపెనీలు టెండర్ వేయగా... రూ. 5,027.90 కోట్ల విలువైన ప్యాకేజీ -5 పనులకు మెగా, ఎల్‌అండ్‌టీ, నవయుగ సంస్థలు టెండర్లు వేశాయి. ప్యాకేజీ-8లో ఉన్న రూ. 4,303.37 కోట్ల పనులకు, రూ. 2వేల కోట్ల పైచిలుకు విలువున్న ప్యాకేజీ-7, ప్యాకేజీ-16, ప్యాకేజీ-18ల పనులకు  సైతం ఇవే సంస్థలు పోటీ పడుతున్నాయి. రూ.వెయ్యి కోట్ల కంటే తక్కువ విలువైన ప్యాకేజీల పనులకు మాత్రం నాలుగు నుంచి ఐదేసి సంస్థలు పోటీ పడ్డాయి. రూ. 1,669.99 కోట్ల విలువైన ప్యాకేజీ-4, రూ. 838.30 కోట్ల విలువైన ప్యాకేజీ-15ల టెండర్లను ఆదివారం తెరిచే అవకాశముంది.

మరిన్ని వార్తలు