‘సుంకేసుల’లో ఉద్రిక్తత

13 Feb, 2017 22:21 IST|Sakshi
మున్సిపల్‌ అధికారులతో వాగ్వాదం చేస్తున్న రైతులు
- విద్యుత్‌ మోటార్ల తొలగింపును అడ్డుకున్న రైతులు
- మున్సిపల్‌ అధికారులతో వాగ్వాదం 
 
సుంకేసుల(గూడూరు): తుంగభద్ర నదీ తీరం వెంట విద్యుత్‌ మోటార్లను తొలగించాలన్న కలెక్టర్‌ ఆదేశాలతో సోమవారం సుంకేసుల వద్ద ఉద్రిక్తత నెలకొంది. సుంకేసుల రిజర్వాయర్‌ పూర్తి స్థాయి నీటి మట్టం 1.20 టీఎంసీలు. ప్రస్తుతం డ్యాంలో 0.302 టీఎంసీల నీరు మాత్రమే ఉంది.  ఈ నీరు మరో నెలరోజులు మాత్రమే సరిపోతాయి. ఇటువంటి పరిస్థితుల్లో మోటార్లను తొలగించాలని నాలుగు రోజుల క్రితం కలెక్టర్‌ సీహెచ్‌ విజయ్‌మోహన్‌ కర్నూలు కార్పొరేషన్, ట్రాన్స్‌కో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ట్రాన్స్‌కో, కర్నూలు కార్పొరేషన్, రెవెన్యూ అధికారులు సోమవారం సుంకేసుల దగ్గరికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న కొత్తకోట, సుంకేసుల, ఆర్‌.కొంతలపాడు, తదితర గ్రామాలకు చెందిన రైతులు జలాశయం దగ్గరికి చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
 
కర్నూలు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ రవీంద్రబాబు, ఈఈ రాజశేఖర్, కర్నూలు తహసీల్దార్‌ రమేష్‌బాబు,  ట్రాన్స్‌కో గూడూరు ఏడీ పార్థసారధి, తదితర అధికారులు సుంకేసులకు చేరుకోవడంతో రైతులు అధికారులను చుట్టుముట్టి వాదనకు దిగారు. తుంగభద్ర నది నీటిని నమ్ముకుని వందల ఎకరాల్లో ఉల్లి, మొక్కజొన్న, పత్తి, మిరప, చెరుకు, తదితర పంటలు సాగు చేసుకున్నామని.. విద్యుత్‌ కనెక‌్షన్లు తొలగిస్తే నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేశారు. మరో 15 రోజులు అవకాశం ఇస్తే పంటలు చేతికి వస్తాయని అధికారులతో  మొరపెట్టుకున్నారు. రిజర్వాయర్‌కు అవతలి వైపు (తెలంగాణ) కూడా అధిక సంఖ్యలో విద్యుత్‌ మోటర్లు ఉన్నాయని వాటిని తొలగించడం లేదని వాదనకు దిగారు. సాగునీటి కంటే తాగునీరు ముఖ్యమని..అధికారులు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కోడుమూరు సీఐ శ్రీనివాసులు, గూడూరు, కోడుమూరు ఎస్‌ఐలు పవన్‌కుమార్, మహేష్‌కుమార్‌లు రైతులకు సర్ది చెప్పారు. 
 
కలెక్టర్‌ను కలిసేందుకు కర్నూలుకు వెళ్లిన రైతులు:
కలెక్టర్‌ ఆదేశాల మేరకే విద్యుత్‌ మోటార్లను తొలగిస్తున్నట్లు అధికారులు చెప్పడంతో తమ గోడు తెలిపేందుకు సుంకేసుల సర్పంచు నాగన్న ఆధ్వర్యంలో రైతులు కర్నూలుకు వెల్లారు. చేతికి వచ్చిన పంటలు అందకుండా పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా రైతులు కర్నూలుకు వెళ్లిన తరువాత ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లకు కనెక‌్షన్లను తొలగించారు.
 
>
మరిన్ని వార్తలు