టెన్షన్‌.. టెన్షన్‌

19 Apr, 2017 00:15 IST|Sakshi

– నాల్గో సెమిస్టర్‌లో కొత్తగా 4 కామన్‌ సబ్జెక్టులు
– నమూనా ప్రశ్నపత్రం బహిర్గతపరచని వైనం
– ఆందోళనలో 18 వేల మంది విద్యార్థులు


ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ విద్యార్థుల్లో టెన్షన్‌ మొదలైంది. కోర్సుల్లో నిరంతర, సమగ్ర మూల్యాంకనం నిర్వహించి, విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించడానికి బీటెక్‌ తరహాలో సెమిస్టర్‌ విధానం రూపొందించారు. బీటెక్‌ కోర్సులకు తీసిపోని విధంగా సిలబస్‌ కూడా రూపకల్పన చేశారు. అయితే పరీక్షల్లో మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ఎస్కేయూ పరీక్షల విభాగం అధికారుల వ్యవహార శైలి ఉండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

కొత్తగా నాలుగు సబ్జెక్టులు
డిగ్రీ కోర్సుల్లోని నాల్గో సెమిస్టర్‌లో కొత్తగా నాలుగు కామన్‌ సబ్జెక్టులు ప్రవేశపెట్టారు. అంటే ప్రతి విద్యార్థి తప్పనిసరిగా (నిర్బంధంగా) ఎంపిక చేసుకోవాల్సిన లీడర్‌షిప్‌ ఎడ్యుకేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, కమ్యూనికేషన్‌ అండ్‌ సాఫ్ట్‌ స్కిల్స్, అనలిటికల్‌ స్కిల్స్‌ సబ్జెక్టులను డిగ్రీ నాల్గో సెమిస్టర్‌ సిలబస్‌లో రూపకల్పన చేశారు. వీటికి నూతనంగా ఈ నెల 15 నుంచి పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సబ్జెక్టులకు సంబంధించి నమూనా ప్రశ్నపత్రాన్ని పరీక్షలకు ముందే వర్సిటీ అధికారులు వెల్లడించాలి. కానీ అధికారులు బాధ్యతలు మరిచి నిబంధనలకు విరుద్ధంగా ప్రశ్నపత్ర గురించి ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే పరీక్షలు నిర్వహించారు.

ఇష్టానుసారంగా నిర్ణయాలు
నూతన సబ్జెక్టులు ప్రవేశపెట్టినపుడు నమూనా ప్రశ్నపత్రాలు తయారీ బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ (బీఓఎస్‌)కు అప్పగించాలి. కానీ ఇంతవరకు బీఓఎస్‌కు అప్పగించిన దాఖలాలు లేవు. ఇప్పటికే సెమిస్టర్‌ పరీక్షల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం బాగా తగ్గుతోంది. దీనికి గత సెమిస్టర్‌ ఫలితాలే నిదర్శనం. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులకు అండగా నిలవాల్సిన వర్సిటీ అధికారులు బాధ్యత మరచి ప్రవర్తిస్తుండడంతో 18 వేల మంది విద్యార్థులకు ఆందోళన మిగిలిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

మరిన్ని వార్తలు