‘వెలుగు’లో గుబులు!

22 May, 2017 00:28 IST|Sakshi
‘వెలుగు’లో గుబులు!

– ‘బదిలీలల’కు చెక్‌పెట్టిన కలెక్టర్‌ వీరపాండియన్‌
– కౌన్సెలింగ్‌కు జేసీ–2ను పంపిన వైనం
– సిబ్బంది వ్యవహారంపై డీఆర్‌డీఏ పీడీ ఆగ్రహం
– తనకు ‘అవమానం’ జరిగిందంటూ నిర్వేదం!


(సాక్షి ఎఫెక్ట్‌)

అనంతపురం టౌన్‌ : జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ)–వెలుగులో బది‘లీలల’కు చెక్‌ పడింది. యూనియన్ల ముసుగులో కొందరు  ఓ వైపు రాజకీయ సిఫార్సులు, మరోవైపు తమకు అనుకూలంగా ఉన్న వారిని అనుకున్న స్థానాలకు పోస్టింగ్‌లు ఇప్పించుకోవడంలో సఫలీకృతులయ్యారు. తాజాగా మరికొన్ని బదిలీల్లో కూడా చక్రం తిప్పుదామనుకున్నా అది నెరవేరలేదు.  కలెక్టర్‌ వీరపాండియన్‌ రంగంలోకి దిగడంతో అడ్డుకట్టపడింది.  గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సీసీల బదిలీల్లో కొందరు ఉద్యోగులు అన్నీ తామై ‘లీలలు’ ప్రదర్శించారు.

ఈ క్రమంలో ‘వెలుగులో బదిలీలలు’, వెలుగులో చీకటికోణం.. అనే శీర్షికలతో సాక్షిలో కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై కలెక్టర్‌ ఆరా తీశారు. ఆదివారం డీఆర్‌డీఏ కార్యాలయంలో డీపీఎంలు, ఏపీఎంలు, కొందరు సీసీలకు బదిలీల కౌన్సెలింగ్‌ చేపట్టారు. ఉదయం 10 గంటలకు  ఐదారుగురు సీసీలకు కౌన్సెలింగ్‌ చేసి, బదిలీ ఆర్డర్లు కూడా సిద్ధం చేశారు. ఈ సమయంలో కలెక్టర్‌ వీరపాండియన్‌ నుంచి డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్లుకు ఫోన్‌ వచ్చింది. కౌన్సెలింగ్‌కు  జేసీ–2 ఖాజామొహిద్దీన్‌ వస్తారని, ఆయన ఆధ్వర్యంలోనే కౌన్సెలింగ్‌ చేపట్టాలని సూచించారు. దీంతో  అప్పటికే కౌన్సెలింగ్‌ ముగించి సిద్ధం చేసిన ఆర్డర్లను బుట్టదాఖలా చేశారు. 12 గంటల సమయంలో జేసీ–2 వచ్చి మొదటి నుంచి కౌన్సెలింగ్‌ను ప్రారంభించారు. ఎనిమిది మంది డీపీఎంలు, ముగ్గురు ఏపీఎంలు, 30 మంది వరకు సీసీలకు కౌన్సెలింగ్‌ చేశారు. ఐదేళ్ల సర్వీస్‌ పూర్తి చేసుకున్న వారు, స్పౌస్‌ కేసులు, అనారోగ్యంతో ఉన్న వారు, పనితీరు బాగాలేని వారికి ప్రాధాన్యత క్రమంలో సాయంత్రం 3 గంటల వరకు బదిలీలు నిర్వహించారు.

ఉద్యోగుల తీరుపై పీడీ ఆగ్రహం :
బదిలీల్లో కొందరు ఉద్యోగుల తీరు వల్ల వ్యక్తిగతంగా తన ప్రతిష్ట దిగజారడంతో పీడీ వెంకటేశ్వర్లు మనస్తాపానికి గురైనట్లు తెలిసింది. తాను ఉండగానే జేసీ–2ను కౌన్సెలింగ్‌కు పంపడం పట్ల ఆయన తీవ్ర నిరాశకు లోనైనట్లు సమాచారం. ఇందులో భాగంగానే బదిలీల్లో చక్రం తిప్పిన ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కౌన్సెలింగ్‌కు జేసీ–2 వచ్చే వరకు తన చాంబర్‌లోనే ఉన్న ఓ ఏపీఎంను ‘ఇక్కడి నుంచి వెళ్లిపో’ అంటూ బయటకు పంపించేసినట్లు సమాచారం. మరో ఏపీఎంపై కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయగా సదరు అధికారి కంటతడి పెట్టినట్టు తెలిసింది.

‘బిల్లుల’ రాజాకు చెక్‌ :
డీఆర్‌డీఏలో కీలకంగా ఉన్న ఫైనాన్స్‌ విభాగానికొచ్చి చక్రం తిప్పాలనుకున్న ఓ అధికారి ఆశలపై జేసీ–2 నీళ్లు చల్లారు. కౌన్సెలింగ్‌ను ప్రాధాన్యత క్రమంలో చేపట్టడంతో ఈ విభాగానికి డీపీఎంగా రాధారాణికి ఆర్డర్స్‌ ఇచ్చారు. సదరు ‘బిల్లుల’ రాజా మరో విభాగానికి వెళ్లాల్సి వచ్చింది. తాజాగా జరిగిన బదిలీల్లో ధర్మవరం ఏరియా కో ఆర్డినేటర్‌ (ఏసీ)గా ఈశ్వరయ్య, బుక్కరాయసముద్రం ఏసీగా సత్యనారాయణ, ఉరవకొండకు రవీంద్ర, హిందూపురానికి ప్రసాద్, మడకశిరకు శ్రీదేవి నియమితులయ్యారు. ఓ డీపీఎం తనకు బుక్కరాయసముద్రం క్లస్టరే కావాలని పట్టుబడడంతో ఆమెకు ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు. ప్రస్తుతం కదిరి, తాడిపత్రి, ఓడీ చెరువు, రాయదుర్గం క్లస్టర్ల ఏసీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరికొన్ని బదిలీలు ఇంకా జరగాల్సి ఉంది.

మరిన్ని వార్తలు