ఆలయ కూల్చివేతలో ఉద్రిక్తత

16 Jul, 2016 20:25 IST|Sakshi
ఆలయ కూల్చివేతలో ఉద్రిక్తత

  శివాలయం సగభాగం తొలగించేందుకు సన్నద్ధమైన అధికారులు
  ఆందోళనకు దిగిన స్థానికులు
  పోలీసుల జోక్యంతో బలవంతంగా ధ్వజస్తంభం తొలగింపు

 
గుంటూరు(నెహ్రూనగర్):
కృష్ణా పుష్కర అభివృద్ధి పనుల్లో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు ఆలయ కూల్చివేతకు సిద్ధం కావటం  తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. నగరంలోని నల్లచెరువు మూడు బొమ్మల సెంటర్ సమీపంలో ఉన్న శివాలయాన్ని  తొలగించడానికి  పట్టణ ప్రణాళిక అధికారులు శుక్రవారం జేసీబీతో వచ్చారు. గుడి సగభాగం(ధ్వజ స్తంభం, నవ గ్రహాలు ఉన్న చోటు వరకు) తొలగించేందుకు సన్నద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికులు, ఆలయ నిర్వాహకులు పెద్దఎత్తున అక్కడకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఆలయం జోలికి వస్తే సహించబోమని  నినాదాలు చేశారు. దీంతో అధికారులు, స్థానికులు మధ్య జరిగిన వివాదంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.  జేసీబీ సహాయంతో గుడి తొలగించేందుకు సిద్ధపడటంతో స్థానికులు, పెద్దలు గుడి పగులగొట్టాలంటే ముందు మమ్మల్ని తొలగించి అప్పుడు పడగొట్టండి అంటూ జేసీబీకి అడ్డు నిలిచారు.


అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ప్రజలు ససేమిరా అనటంతో అధికారులు మౌనం దాల్చారు. దేవాలయం ధ్వజ స్తంభం తొలగించకుండా గుడిని ముందు ఉన్న గోడ వరకు మాత్రమే తొలగిస్తామని అధికారులు కోరినప్పటీకి ఫలితం కనపడలేదు. నగరపాలక సంస్థ కమిషనర్ నాగలక్ష్మిని కలిసి ఆలయాన్ని తొలగించకుండా అనుమతి తీసుకోవాలని అధికారులు సూచించినా భక్తులు మాత్రం వెనుతిరిగేది లేదన్నారు. అయితే తొలగింపు తప్పదు అని అధికారులు తేల్చి చెప్పడంతో   గుడిలోని ధ్వజ స్తంభం, నవగ్రహాలకు మినహాయింపునివ్వాలని గుడి పెద్దలు, స్థానికులు అధికారులను కోరారు. కాని అధికారులు ఒప్పుకోకపోవడంతో గుడి ముందు ఉన్న ప్రహరీ గోడను, విగ్రహాలను తామే శాస్త్రోక్తంగా పగులగొడతామని వారు తెలియజేశారు. సాయంత్రం వరకు వివాదం కొనసాగుతూనే ఉంది. చివరకు పోలీసుల జోక్యంతో బలవంతంగా ప్రజలను పక్కకు నెట్టివేసి ధ్వజ స్తంభాన్ని తీసివేశారు.

మరిన్ని వార్తలు