మడకశిరలో టెన్షన్‌.. టెన్షన్‌

19 Sep, 2017 22:03 IST|Sakshi
మడకశిరలో టెన్షన్‌.. టెన్షన్‌

రోడ్ల విస్తరణతో ఆందోళన
విస్తరణ చేసి తీరుతామంటున్న టీడీపీ నేతలు
పరిహారం చెల్లించిన తర్వాతనే అంటున్న కాంగ్రెస్‌ వాదులు


మడకశిర: మడకశిరలో రూ. 42.75 కోట్లతో చేపట్టిన రోడ్ల విస్తరణ పనులు వివాదాలకు కారణమవుతోంది. మడకశిర–పావగడ, మడకశిర–హిందూపురం, మడకశిర–అమరాపురం, మడకశిర–పెనుకొండ రోడ్లను 66 అడుగుల మేర విస్తరణ చేయాల్సిందేనంటూ టీడీపీ నేతలు పట్టుబట్టారు. అయితే ఇందుకు సంబంధించి బాధితులకు పరిహారం చెల్లించిన తర్వాతనే పనులు చేపట్టాలంటూ స్థానిక కాంగ్రెస్‌ నేతలు అడ్డుకోవడంతో అందరి దృష్టి రోడ్ల విస్తరణపై పడింది. ఈ ప్రక్రియను ఈ రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో చివరకు రాజకీయరంగు పులుముకుంది.

పట్టణంలో రోడ్ల విస్తరణ పనుల ద్వారా 120 మంది వరకు నష్టపోనున్నారు. వీరిలో 40మంది హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం పట్టణ శివారులో రోడ్ల విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. విస్తరణ పనులను స్వాగతిస్తున్న వారు పట్టణంలోని తమ భవనాలను స్వచ్ఛందంగా తొలగించుకుంటున్నారు. మరికొందరు తమకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే భవనాలను తొలగించాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. వీరికి మద్దతుగా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు నిలిచారు.  2013 భూసేకరణ చట్టం ప్రకారం బాధితులకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతే రోడ్ల విస్తరణ పనులు చేపట్టాలంటూ ఆందోళనలు కూడా చేపట్టింది. రోడ్ల విస్తరణ కోసం ఇప్పటికే ప్రధాన రోడ్లకు ఇరువైపులా ఉన్న 400 చెట్లను అధికారులు తొలగించారు.

రింగ్‌ రోడ్డుతో సమస్య దూరం
మడకశిర చుట్టూ రింగ్‌ రోడ్డు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 కోట్ల మేర నిధులను మంజూరు చేసింది. ఈ పనులకు గత ఏడాది డిసెంబర్‌ 2న సీఎం చంద్రబాబు భూమి పూజ కూడా చేశారు. రింగ్‌ రోడ్డు ఏర్పాటు చేసేటప్పుడు పట్టణంలో రోడ్ల విస్తరణతో పనేముందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇదే అభిప్రాయాన్ని కాంగ్రెస్‌ నాయకులు కూడ వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో రోడ్లు ఇరుకుగా ఉండటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోందని ఫలితంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ నేతలు అంటున్నారు.
 
నష్టపరిహారం చెల్లించాలి
నష్టపరిహారం చెల్లించి రోడ్ల విస్తరణ పనులు చేపడితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. రోడ్ల విస్తరణ వలన పూర్తిగా నష్టపోతాం.
 – ఫణిశేఖర్, బాధితుడు, మడకశిర

పునరావాసం కల్పించాలి
రోడ్ల విస్తరణ ద్వారా నిలువ నీడ కోల్పోతున్న వారికి ముందుగా పునరావాసం కల్పించాలి. ఆ తర్వాతే రోడ్ల విస్తరణ పనులు చేపట్టాలి.
– సదాశివప్ప, బాధితుడు, మడకశిర

రింగ్‌రోడ్డు ఏర్పాటు చేస్తే చాలు
రింగ్‌ రోడ్డు ఏర్పాటుతో పట్టణంలో ట్రాఫిక్‌ సమస్య పూర్తిగా తగ్గుతుంది. పట్టణంలో రోడ్ల విస్తరణ ప్రక్రియను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి.
–లక్ష్మి, బాధితురాలు, మడకశిర

మరిన్ని వార్తలు