‍కాపీయింగ్‌ నిరోధంలో ‘పాస్‌’ అవుతారా?

19 Feb, 2017 23:02 IST|Sakshi
‍కాపీయింగ్‌ నిరోధంలో ‘పాస్‌’ అవుతారా?
-చూసిరాతలకు చెక్‌ పెట్టేందుకు యాక్ట్‌-25
-నిఘా నీడలో పదో తరగతి పరీక్షలు..!
-చర్చనీయాంశమైన హైకోర్టు ఆదేశాలు
రాయవరం : వచ్చే నెల 17 నుంచి జరగనున్న పదోతరగతి పరీక్షల్లో చూసిరాతలను (కాపీయింగ్‌) నివారించేందుకు గట్టి చర్యలు తీసుకోనున్నారు. మాస్‌ కాపీయింగ్‌ను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని హైకోర్టు తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు విద్యాశాఖలో సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. 
ఇంతవరకూ ఏం జరుగుతోందంటే..
పరీక్షల్లో విద్యార్థులు ఫెయిల్‌ అయితే ఖాళీగా ఉంటున్నారని, దీంతో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని కొందరు భావిస్తున్న నేపథ్యంలో ఉత్తీర్ణతా శాతాన్ని పెంచేందుకు అనధికారికంగా చూసిరాతలను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్నేళ్లుగా పబ్లిక్‌ పరీక్షల్లో చూచి రాతల సంస్కృతి పెరిగి పోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉపాధ్యాయులే చూసిరాతలను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పక్క విద్యార్థి జవాబు పత్రంలో చూసి రాయడం, స్లిప్పులు తెచ్చుకుని రాయడం ద్వారా ఉత్తమ గ్రేడులు పొందేందుకు పక్కదారులు పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.  
యాక్ట్‌ -25 అంటే..
పబ్లిక్‌ పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ను అరికట్టేందుకు యాక్ట్‌ -25ను రూపొందించారు. దశాబ్దాల క్రితమే ఈ యాక్ట్‌ అమల్లో ఉంది. మాస్‌ కాపీయింగ్‌ నిరోధానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలంటూ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో పబ్లిక్‌ పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ను నిరోధించేందుకు ఏమి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని రెండు రాష్ట్రాలను హైకోర్టు ఆదేశించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడకుండా నిరోధించేందుకు అమలు చేసే యాక్ట్‌ -25కు విద్యాశాఖ అధికారులు పదును పెడుతున్నారు. మాల్‌ ప్రాక్టీస్‌ చేసి పట్టుబడిన సందర్భాల్లో ఈసారి ఇన్విజిలేటర్‌ను కూడా ప్రాసిక్యూట్‌ చేసే అవకాశం ఉంటుందని సమాచారం. 
మాస్‌ కాపీయింగ్‌ను నిరోధించాలంటే..
గతేడాది జిల్లాలో మాస్‌ కాపీయింగ్‌ నిరోధక చర్యల్లో భాగంగా 15 చోట్ల సీసీ కెమెరాలను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా జిల్లా, రాష్ట్ర అధికారులు ప్రత్యక్ష్యంగా పర్యవేక్షించేందుకు అవకాశం ఉంటుంది. బయో మెట్రిక్‌ హాజరు, ఆన్‌లైన్‌ మానిటరింగ్‌ ద్వారా చూసిరాతలకు ఫుల్‌స్టాప్‌ పెట్టే అవకాశం ఉంది. తనిఖీ బృందాల్లో ఏసీబీ, విజిలెన్స్‌ విభాగాల నుంచి ఒక్కొక్కరిని నియమిస్తే మాస్‌ కాపీయింగ్‌ను పక్కాగా నిరోధించే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పదో తరగతి విద్యార్థులకు కూడా జవాబులు రాయడానికి సింగిల్‌ బుక్‌లెట్లు ఇవ్వడం ద్వారా మాస్‌ కాపీయింగ్‌కు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. ఈ ఏడాది జరిగే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారనే ప్రచారం జరుగుతుంది. పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ఖర్చుతో కూడుకున్న పని కావడంతో ఇది ఎంతవరకు సాధ్యమనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 
67,740 మంది రెగ్యులర్‌ విద్యార్థులు..
ఈ ఏడాది జరిగే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు 67,740 మంది రెగ్యులర్‌ విద్యార్థులుగా హాజరు కానున్నారు. వీరికి 297 రెగ్యులర్‌ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. గతేడాది పబ్లిక్‌ పరీక్షల్లో సబ్జెక్ట్స్‌ ఫెయిలైన వారికి ఏడు ప్రైవేటు సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. 
పకడ్బందీగా యాక్ట్‌-25 అమలు
పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా యాక్ట్‌ 25ను కచ్చితంగా అమలు చేస్తాం. ఎక్కడా అక్రమాలకు తావీయకుండా చర్యలు తీసుకుంటాం. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. దీనిపై కచ్చితమైన గైడ్‌లైన్స్‌ రావాల్సి ఉంది. 
  –ఎస్‌.అబ్రహాం, ఇన్‌చార్జ్‌ జిల్లా విద్యాశాఖాధికారి, కాకినాడ
మరిన్ని వార్తలు