పది వరకు ఆంగ్లం..ఆపై తెలుగు

6 Mar, 2017 22:48 IST|Sakshi
పది వరకు ఆంగ్లం..ఆపై తెలుగు
ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
సక్సెస్‌ పాఠశాలలకు పెరుగుతున్న ఆధరణ
ఇంటర్‌ కళాశాలలు లేక అవస్థలు
ప్రైవేటుకు పంపలేకపోతున్న తల్లిదండ్రులు 
 
ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా, ఆంగ్ల మాద్యమాన్ని బోధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రారంభించిన సక్సెస్‌ పాఠశాలలకు మంచి ఆధరణ ఉంది. ప్రైవేటు పాఠశాలల్లో వేలాది రూపాయలు రుసుములు చెల్లించి చదివించలేని తల్లిదండ్రులు తమ చిన్నారులను ఈ పాఠశాలలకు పంపిస్తున్నారు. జిల్లాలో ఆంగ్లమాధ్యమంలో బోధించే కళాశాలలు సక్సెస్‌ పాఠశాలల సంఖ్యకు అనుగుణంగా లేవు. దీంతో ఆరు నుంచి పదో తరగతి వరకు ఇక్కడ చదువుతున్న వారికి ఇంటర్‌లో చేరాలంటే తిప్పలు తప్పడం లేదు. ప్రభుత్వం నియోజకవర్గానికి ఒక ఇంగ్లిష్‌ మీడియం కళాశాల ఉండేలా చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌ తల్లిదండ్రుల నుంచి విన్పిస్తోంది. - రాయవరం
సక్సెస్‌ పాఠశాలల ద్వారా..
ఆంగ్లంలో వెనకబడి పోవడంతో సర్కారు పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు ఉన్నత విద్య, ఉద్యోగాల్లో వెనకబడి పోతున్నారని గుర్తించిన ప్రభుత్వం ప్రైవేటు ధీటుగా ఆంగ్ల మాద్యమ బోధన చేపట్టాలని నిర్ణయించింది. 2008-09 విద్యా సంవత్సరంలో సక్సెస్‌ పాఠశాలల పథకానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. జిల్లాలో 312 ఉన్నత పాఠశాలల్లో సక్సెస్‌ పాఠశాలలను ఏర్పాటు చేశారు. 2008లో ఆరో తరగతి నుంచి ఆంగ్ల మాద్యమం ప్రవేశ పెట్టగా 2013లో మొదటి బ్యాచ్‌ విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో తెలుగు మీడియంతో పాటుగా ఆంగ్ల మాద్యమంలోను తరగతులు బోధిస్తారు. ఎవరికి ఏ మీడియంలో ఆసక్తి ఉంటే ఆ మీడియంలో చేరే వెసులుబాటు ఉంది. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా సక్సెస్‌ పాఠశాలలు ఏర్పాటు చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో సుమారు 25 వేల మంది విద్యార్థులు ఇంగ్లిష్‌ మీడియంలో పరీక్షలు రాయనున్నారు. 
ఇంటర్‌లో ఇబ్బందులు..
సక్సెస్‌ పాఠశాలల్లో పదో తరగతి ఇంగ్లిష్‌ మీడియంలో చదువుతున్న విద్యార్థులు ఇంటర్‌లో చేరే సమయంలో ప్రభుత్వ ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  సక్సెస్‌ పాఠశాలల్లో చదువుతున్న ఇంగ్లిష్‌ మీడియం విద్యార్థుల్లో 85 శాతం వరకు ఉత్తీర్ణత ఉంటుంది. కొన్ని పాఠశాలల్లో నూటికి నూరు శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తున్నారు. ఆంగ్ల మీడియంలో ప్రతిభ చూపుతున్న విద్యార్థులకు ఇంటర్‌కు వచ్చే సరికి ప్రైవేటు కళాశాలలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సామాన్య, మధ్య తరగతి ప్రజలు వేలాది రూపాయలు చెల్లించి ప్రైవేటు కళాశాలల్లో ఆంగ్ల మీడియంలో చేర్పించడానికి ఆర్థికంగా వెనుకంజ వేయాల్సి వస్తోంది. ప్రైవేటు కళాశాలల్లో చదివించే స్తోమత లేని వారు ప్రభుత్వ కళాశాలల్లోని తెలుగు మీడియం కళాశాలల్లో చేరిపోతున్నారు. 
నియోజకవర్గానికి ఒక కళాశాల..
కనీసం నియోజకవర్గంలో ఒక ఇంగ్లిష్‌ మీడియం కళాశాలను ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ తల్లిదండ్రుల నుంచి వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ కళాశాల రాజమండ్రి, ధవళేశ్వరం, గోకవరం, కోరుకొండ, తుని తదితర పది కళాశాలల్లో మాత్రమే ఇంగ్లిష్‌ మీడియం ఉంది. గ్రామీణ ప్రాంతానికి చెందిన అధిక కళాశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం లేదు. ఇంగ్లిష్‌ మీడియంపై ఆసక్తి ఉన్న విద్యార్థులు నష్టపోకుండా ప్రభుత్వ కళాశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశ పెట్టాలని, నియోజకవర్గానికి ఒక ఇంగ్లిష్‌ మీడియం కళాశాల ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ విన్పిస్తోంది. 
అనుమతినిస్తాం..
ప్రభుత్వ కళాశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశానికి అనుమతిస్తున్నాం. డిమాండ్‌ను బట్టి ఇంగ్లిష్‌ మీడియం కోరితే ఆలస్యం లేకుండా అనుమతినిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. 
- ఎ.వెంకటేష్, ఆర్‌ఐఓ, ఇంటర్‌ బోర్డు, రాజమండ్రి  
మరిన్ని వార్తలు