టెన్త్ పరీక్షలు.. ఇక 80 మార్కులకే!

25 Jun, 2016 00:39 IST|Sakshi
టెన్త్ పరీక్షలు.. ఇక 80 మార్కులకే!

పరీక్షా సమయం 2.45 గంటలు
మిగిలిన 20 అంతర్గత మూల్యాంకనంలో కేటాయింపు
సబ్జెక్టు నిపుణుల సలహాలు తీసుకుంటున్న విద్యాశాఖ
ఈ విద్యా సంవత్సరం నుంచి అమలుకు కసరత్తు
పాఠ్యాంశంపై అవగాహన కల్పించటమే లక్ష్యం

 

మచిలీపట్నం : పదో తరగతి పరీక్షా విధానంలో మార్పులకు విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఈ విద్యా సంవత్సరం నుంచి నూతన విధానంలో పదో తరగతి పరీక్షలను నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. ఒక్కొక్క సబ్జెక్టు పరీక్ష 100 మార్కులకు కాకుండా 80 మార్కులకు నిర్వహించనుంది. మిగిలిన 20 మార్కులను ఉపాధ్యాయులు అంతర్గత మూల్యాంకన విధానంలో నిర్ణయించి కలుపుతారు. దీనికి సంబంధించి ఈ నెల ఏడో తేదీన ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ జీవో నంబరు 41ని జారీ చేశారు. ఈ జీవో విడుదలైన అనంతరం వివిధ సబ్జెక్టుల్లో నిపుణులైన ఉపాధ్యాయులను హైదరాబాద్‌కు పిలిపించి పదోతరగతి పరీక్షల విధానంలో జరుగుతున్న మార్పులపై సూచనలు తీసుకుంటున్నారు. ఒకటి, రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. ఇప్పటి వరకు బట్టీ విధానం ద్వారా విద్యార్థులకు శ్రమ కలి గించే విధంగా పాఠ్యాం శాల బోధన జరుగుతోంది. తాజా పద్ధతిలో ప్రతి పాఠ్యాంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించాల్సి ఉంది. దానిపై విద్యార్థికి ఉన్న అవగాహనను ఉపాధ్యాయులు అవలోకనం చేసుకుని అంతర్గత మూల్యాం కనంలో మార్కులు కేటాయించాల్సి ఉంటుంది.

 
నిరంతర సమగ్ర మూల్యాంకనం

పాఠ్యాంశంపై విద్యార్థికి పూర్తిస్థాయిలో అవగాహన కలగాలనేది విద్యాశాఖ ముఖ్య ఉద్దేశం. దీని కోసం నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ)ని అమలు చేస్తే విద్యార్థులకు మేలు జరుగుతుందనేది విద్యావేత్తల అభిప్రాయం. ఈ విధానాన్ని 1922లో జమ్మూ కాశ్మీర్‌లో అమలు చేశారు. తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, హర్యానా, ఢిల్లీలో అమలు చేస్తున్నారు. ఈ విధానాన్ని మన రాష్ట్రం లో అమలు చేయాలని మూడేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సమగ్ర మూల్యాంకనానికి అనుగుణంగానే పాఠ్యపుస్తకాల రూపకల్పన చేశారు.

 
జాతీయ విద్యా ప్రణాళిక చట్టం-2005, రాష్ట్ర విద్యా ప్రణాళిక-2005 తదితర చట్టాలను ఆధారంగా చేసుకుని ఒకటి నుంచి పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాలను రూపొందిస్తున్నారు. అన్ని యాజమాన్య పాఠశాలల్లో ఇదే విధానాన్ని అమలు చేసి ఒకే ప్రశ్నపత్రాన్ని ఇవ్వనున్నారు. గత ఏడాది వరకు పదో తరగతి పరీక్షలు రెండున్నర గంటలు నిర్వహించే వారు. ఈ విధానం అమలైతే 2.45 గంటలు పరీక్షా సమయం ఉంటుంది. 15 నిమిషాల పాటు ప్రశ్నపత్రం చదువుకునేందుకు అవకాశం ఇస్తారు.

 

 

మార్కుల కేటాయింపు ఇలా...
ఇప్పటి వరకు ప్రతి సబ్జెక్టుకు 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ విధానంలో మార్పు చేయనున్నారు. నూతన పద్ధతిలో 80 మార్కులకు పరీక్ష నిర్వహించి మిగిలిన 20 మార్కులను అంతర్గత మూల్యాంకన పరీక్షలో భాగంగా నాలుగు నిర్మాణాత్మక, రెండు సంగ్రహణాత్మక పరీక్షలు ఉపాధ్యాయుడు నిర్వహిస్తారు.  వీటిలో వచ్చిన మార్పుల సగటును బట్టి 20 మార్కులను విద్యార్థికి కేటాయిస్తారు.  ప్రాజెక్టు వర్క్, స్లిప్ టెస్ట్, నోట్సులు రాయటం, ప్రయోగాలు, పుస్తక సమీక్షలు, చర్చావేదికలు నిర్వహించి విద్యార్థి పాఠ్యాంశాన్ని అర్థం చేసుకున్నాడా లేదా అనేది గ్రహించాల్సి ఉంది.  గతంలో మాదిరిగానే హిందీకి ఒక పేపరు, మిగిలిన సబ్జెక్టులకు రెండు పేపర్లు పరీక్షలు ఉంటాయి.  హిందీ పరీక్ష 80 మార్కులకు నిర్వహిస్తే కనీ సం 16 మార్కులు వస్తే ఉత్తీర్ణులుగా గుర్తిస్తారు. మిగిలిన సబ్జెక్టుల్లో 28 మార్కులు కచ్చితంగా రావాలి.అంతర్గత మార్కులు హిందీలో నాలుగు, మిగి లిన సబ్జెక్టుల్లో ఏడు వస్తే ఉత్తీర్ణులవుతారు.  అంతర్గత మూల్యాంకనంలో సున్నా మార్కులు వచ్చి రాతపరీక్షలో 35 మార్కులు వస్తే విద్యార్థులు ఉత్తీర్ణులవుతారు.  అంతర్గత మూల్యాంకనంలో 20 మార్కులు వచ్చినా రాత పరీక్షలో మాత్రం 28 మార్కులు కచ్చితంగా వస్తేనే ఉత్తీర్ణులైనట్లు పరిగణిస్తారు.

మరిన్ని వార్తలు