విడతల వారీగా సాగునీరు

17 Sep, 2016 00:58 IST|Sakshi
విడతల వారీగా సాగునీరు

– పది రోజుల నిలుపుదల.. అనంతరం సరఫరా
– నవంబర్‌ ఆఖరు వరకు ఇదే విధానంలో కాలువలకు నీరు
– నేటి నుంచి నీటి విడుదల నిలుపుదల
– తుంగభద్ర ఐసీసీ సమావేశంలో తీర్మానం


సాక్షి, బళ్లారి : తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల తుంగభద్ర డ్యాంలో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున నవంబర్‌ ఆఖరు వరకు కాలువలకు విడతల వారీగా నీరు విడుదల చేయాలని తుంగభద్ర నీటిపారుదల సలహా సమితి (ఐసీసీ) సమావేశంలో తీర్మానించారు. శుక్రవారం బెంగళూరులోని వికాససౌధలో బళ్లారి జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి సంతోష్‌లాడ్‌ అ«ధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. తుంగభద్ర డ్యాంలో ప్రస్తుతం 41 టీఎంసీల నీటి లభ్యత మాత్రమే ఉన్నందున అన్ని కాలువలకు యథాప్రకారం నీరు విడుదల సాధ్యం కాదని అధికారులు తెలిపారు. యథాప్రకారం విడుదల చేయాలంటే 71 టీఎంసీల నీరు అవసరమన్నారు.

ఈ నేపథ్యంలో  డ్యాంపై ఆధారపడిన హెచ్చెల్సీ, ఎల్‌ఎల్‌సీ, ఎల్‌బీఎంసీ, రాయబసవణ్ణ తదితర కాలువలకు నెలలో 10 రోజుల పాటు నీరు నిలుపుదల చేయాలని సమావేశంలో తీర్మానించారు. ఈ విధానాన్ని నవంబర్‌ వరకు కొనసాగించాలని,  పది టీఎంసీలను తాగునీటి కోసం నిల్వ ఉంచుకోవాలని నిర్ణయించారు. హెచ్చెల్సీ, ఎల్‌ఎల్‌సీలకు  ఈనెల 17 నుంచి 26వ తేదీ వరకు 10 రోజుల పాటు ఏకకాలంలో నీటి విడుదల నిలిపివేస్తారు. 27 నుంచి అక్టోబర్‌ 11 వరకు హెచ్‌ఎల్‌సీకి 1,200 క్యూసెక్కుల చొప్పున, ఎల్‌ఎల్‌సీకి 700 క్యూసెక్కుల చొప్పున  విడుదల చేస్తారు. అక్టోబర్‌ 12 నుంచి 21 వరకు మళ్లీ కాలువలకు నీటి విడుదల ఆపేస్తారు. 22వ తేదీ నుంచి నవంబర్‌ 5 వరకు మళ్లీ యధాప్రకారం  విడుదల చేస్తారు. నవంబర్‌ 6 నుంచి 15 వరకు ఆపేసి.. 16 నుంచి 20 వరకు ఐదు రోజుల పాటు యధాప్రకారం నీటిని విడుదల చేయాలని తీర్మానించారు.

మరిన్ని వార్తలు