తల్లీబిడ్డ.. నిరీక్షణ!

5 Sep, 2017 07:22 IST|Sakshi
తల్లీబిడ్డ.. నిరీక్షణ!

ఆస్పత్రుల్లో బాలింతల అవస్థలు
సమయానికి అందుబాటులో ఉండని వాహనాలు
చెట్ల కింద తప్పని పడిగాపులు
లక్ష్యం చేరని తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌
సర్వజనాస్పత్రిలో పరిస్థితి దయనీయం


యాడికి మండలం పీఎం పల్లికి చెందిన ఈ బాలింత పేరు షాహీదా. గత శనివారం అనంతపురం సర్వజనాస్పత్రిలో మగ బిడ్డకు జన్మనిచ్చింది. సోమవారం డిశ్చార్జి చేయడంతో ఆస్పత్రి ప్రధాన ద్వారం సమీపంలోని చెట్టు వద్ద ‘తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ వాహనం కోసం నిరీక్షించింది. కుటుంబ సభ్యులు వాహన డ్రైవర్‌కు ఫోన్‌ చేస్తే ‘వస్తాం.. అక్కడే ఉండండి’ అంటూ సమాధానం. ఫలితంగా వీరి అవస్థలు వర్ణనాతీతం. అనంతపురం మెడికల్‌: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం తర్వాత బాలింతలను సురక్షితంగా ఇంటికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న అవస్థలు వర్ణనాతీతం.

డిశ్చార్జి సమయానికి ఒక రోజు ముందు నుంచే ఆందోళన మొదలవుతోంది. ఈ కారణంగా ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు పెంచి మాతాశిశు మరణాల రేటును తగ్గించేందుకు ఉద్దేశించి ‘తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ లక్ష్యం నీరుగారుతోంది. బాలింత, శిశువుతో పాటు సహాయకులను ఇంటికి చేర్చాలనేది ఈ వాహన ఉద్దేశం. వైద్యం ఖరీదైన ప్రస్తుత తరుణంలో ఈ పథకం మంచిదే అయినా అమల్లో చతికిలపడుతోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో తల్లీబిడ్డకు నిరీక్షణ తప్పట్లేదు. జిల్లా వ్యాప్తంగా 30 వాహనాలు అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం అయిన తర్వాత వైద్యులు డిశ్చార్జి తేదీ ప్రకటించగానే సంబంధిత ఆరోగ్య సిబ్బంది ‘102’ సర్వీస్‌ కంట్రోల్‌ రూంకు ఫోన్‌ చేసి ఫలానా బాలింతను ఫలానా తేదీన ఇన్ని గంటలకు పంపిస్తారని, వారికి సహాయంగా ఉన్న కుటుంబ సభ్యుల వివరాలు వెల్లడిస్తారు.

కచ్చితంగా ఆ సమయానికి అందుబాటులో ఉన్న తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ ఆస్పత్రికి వెళ్లి ఇంటికి చేర్చాలి. అయితే అమలులో ఆ పరిస్థితి లేదు. అనంతపురం సర్వజనాస్పత్రిలో 10, గుంతకల్లు–2, ధర్మవరం–2, తాడిపత్రి–2, గుత్తి–1, కళ్యాణదుర్గం–2, రాయదుర్గం–1, హిందూపురం–3, మడకశిర–1, పెనుకొండ–1, గోరంట్ల–1, కదిరి–3, అమడగూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఒక వాహనం మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఒక వాహనం రోడ్డు ప్రమాదానికి గురి కాగా, మరో రెండు వాహనాలు మరమ్మతులో ఉన్నాయి. చాలా పీహెచ్‌సీల్లో బాలింతలు సొంత ఖర్చులతోనే ఇళ్లకు వెళ్తున్నారు.

ఉన్న ప్రాంతాల్లో కూడా సేవలు సమయానికి అందకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఆర్థికంగా స్థోమత లేని వారు గంటల తరబడి వేచిచూస్తున్నారు. మరికొందరైతే ఈ సేవలు వద్దనుకుని బస్సుల్లోనో.. ఆటోల్లోనే వెళ్లిపోతున్నారు. శస్త్ర చికిత్స ద్వారా కాన్పు జరిగిన వారికి, ఇద్దరు బిడ్డలు కలిగిన తర్వాత కాన్పులోనే ఆపరేషన్‌ చేయించుకున్న వారు ఆటోలు, బస్సుల్లో వెళ్తూ నరకం అనుభవిస్తున్నారు.

సర్వజనాస్పత్రిలో మరీ ఘోరం
జిల్లాకే పెద్ద దిక్కుగా ఉన్న ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో సాధారణ, సిజేరియన్‌ ద్వారా కాన్పులు నెలకు సుమారు 800 పైగా నిర్వహిస్తారు. పది వాహనాలు అందుబాటులో ఉన్నాయనే మాటే కానీ సేవలు మాత్రం మేడిపండు చందంగా మారుతున్నాయి. గతంలో సాయంత్రం సమయంలో డిశ్చార్జి చేసే వారు. దీంతో వాహనాల్లో తీసుకెళ్లడం ఇబ్బందిగా మారడంతో ఇప్పుడు వీలైనంత వరకు మధ్యాహ్నం సమయానికే డిశ్చార్జి చేస్తున్నారు. అయితే ఆ సమయానికి తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలు అందుబాటులో ఉండడం లేదు. సగం వాహనాలను ఆస్పత్రి వెనుక భాగంలో ఉంచి డ్రైవర్లు నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తున్నారు.

పర్యవేక్షణ గాలికి..
ఆస్పత్రిలో వైద్య సేవల పర్యవేక్షణకు ఆర్‌ఎంఓ డాక్టర్‌ లలిత, డిప్యూటీ ఆర్‌ఎంఓ డాక్టర్‌ విజయమ్మ ఉన్నారు. మరో డిప్యూటీ ఆర్‌ఎంఓ జమాల్‌బాషా సెలవులో ఉన్నారు. ఇక్కడ గర్భిణులు, బాలింతలకు అందుతున్న వైద్య సేవలు నిత్యం గొడవలకు దారితీస్తున్నాయి. పర్యవేక్షించాల్సిన అధికారులు కార్యాలయాలకే పరిమితం అవుతున్నారు. ఈ షయమై తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్, 108 వాహన సర్వీసుల ప్రోగ్రాం మేనేజర్‌ అంజన్‌రెడ్డిని ‘సాక్షి’ సంప్రదించగా.. సర్వజనాస్పత్రిలో అందరినీ ఒకే సారి డిశ్చార్జి చేస్తుండడంతో సమస్య వస్తోందన్నారు. ఈ విషయాన్ని తెలియజేసినా వారిలో మార్పు రావడం లేదన్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు