అరుణతార టీఎన్‌

26 Jul, 2017 22:54 IST|Sakshi
అరుణతార టీఎన్‌

సందర్భం : రేపు తరిమెల నాగిరెడ్డి వర్ధంతి
అనంతపురం న్యూటౌన్: ‘అనంత’ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపదగిన ఆదర్శవంతమైన జీవితాన్ని సొంతం చేసుకున్న తరిమెల నాగిరెడ్డి.. ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. అణగారిన బడుగుబలహీన వర్గాల  ఆప్తబంధువుగా, విలువల కోసం జీవిత గమనాన్ని మార్చుకుని కమ్యూనిçష్టు దిక్సూచిగా నిలచిన నేతగా ఎదిగిన నాగిరెడ్డిది విలక్షణ జీవన విధానం. తెలుగు చరిత్రనే కాదు జాతీయ రాజకీయాలను సైతం ప్రభావితం చేసిన నాగిరెడ్డి పోరాటం అనంత చరిత్రలో అజరామరం.. అనితర సాధ్యం. సహచరులతో ముద్దుగా కామ్రేడ్‌ టీఎన్‌ అని పిలిపించుకునే ఆయన వర్ధంతిని శుక్రవారం నిర్వహించేందుకు జిల్లాలో సన్నాహాలు చేస్తున్నారు.

పోరాటాల జీవితం
నిత్యమూ నిజమైన కమ్యూనిస్టు వాదిగా ఉన్న తరిమెల నాగిరెడ్డి ఏనాడు అధికార దర్పానికి బానిస కాకుండా ప్రజల వెంటే నడిచారు. ఈ విషయమే ఆయనను రాజకీయ దిగ్గజంగా ఎదిగిన తన బావ నీలం సంజీవరెడ్డిని సైతం ఎన్నికల సంగ్రామంలో ఓడించగలిగింది. 1917 ఫిబ్రవరి 11న తరిమెల గ్రామంలో సుబ్బారెడ్డి, ఆదిలక్షుమమ్మ దంపతులకు జన్మించిన నాగిరెడ్డి  ప్రపంచ ప్రసిద్ధి గాంచిన రుషివాలీ విద్యాలయంలో నీలం సంజీవరెడ్డితో కలసి విద్యాభ్యాసం చేశారు. ఆ కాలంలోనే దేశకాల పరిస్థితులు తెలిసిన రచయితగా, మానవత్వం  పరిమళించిన మనిషిగా అనేక పుస్తకాలను రచించారు. 1940లో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ‘యుద్ధం– ఆర్థిక ప్రభావం’ అన్న రచనతో అందరినీ ఆలోచింపజేశారు. 1941లో కమ్యూనిస్టు సిద్ధాంతాలను వ్యతిరేకించిన బ్రిటీష్‌ ప్రభుత్వం... తరిమెల నాగిరెడ్డిని తిరుచురాపల్లి కారాగారంలో బంధించింది. మద్రాసు లెజిస్టేటివ్‌ అసెంబ్లీ మెంబరుగా,  లోకసభ సభ్యునిగా కమ్యూనిస్టు పార్టీ తరుఫున ఎన్నికై నిరుపమాన సేవలందించిన తరిమెల నాగిరెడ్డి 1976లో రహస్య జీవితం గడుపుతూ మరణించారు.

రేపు తరిమెల నాగిరెడ్డి సంస్మరణ సభ
స్ఫూర్తిదాయక  పోరాటాలతో జిల్లా వాసుల గుండెల్లో  చిరస్మరణీయుడిగా నిలిచిన తరిమెల నాగిరెడ్డి 41వ వర్ధంతితో పాటు కమ్యూనిస్టు అగ్రనేత దేవులపల్లి వెంకటేశ్వరరావు సంస్మరణ సభ శుక్రవారం జరుగనుంది.  జిల్లా కేంద్రం అనంతపురంలోని ఉపాధ్యాయ భవన్‌లో సాయంత్రం ఆరు గంటలకు భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమైక్యతా కేంద్రం (ఎంఎల్‌) ఆధ్వర్యంలో  ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.

మరిన్ని వార్తలు