నిర్మల్‌ జిల్లాలో కలపాలని రాస్తారోకో

28 Aug, 2016 20:47 IST|Sakshi
నేరడిగొండ : నేరడిగొండ మండలాన్ని నిర్మల్‌ జిల్లాలో ప్రతిపాదించి తీరా ఇప్పుడు ఆదిలాబాద్‌లో ఉంచడాన్ని నిరసిస్తూ ఆదివారం మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై అఖిలపక్షం నాయకులతోపాటు, వడూర్‌ గ్రామస్తులు భారీగా తరలివచ్చి రాస్తారోకో నిర్వహించారు. జాతీయ రహదారిపై గంట సేపు రాస్తారోకో చేపట్టడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోగా ఎస్సై వెంకన్న సంఘటన స్థలానికి చేరుకుని వారిని శాంతింపజేసి రాస్తారోకో విరమింపజేశారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకుడు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు అంబేకరి పండరి, వడూర్‌ ఎంపీటీసీ సభ్యుడు ఉప్పు పోశెట్టి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు గాదే రవీందర్, పీఏసీఎస్‌ కోశాధికారి పాల శంకర్, నాయిడి రవి, ఆదుముల్ల రాములు, గాదే శంకర్, మల్లెపూల నర్సయ్య, పొన్న గంగారెడ్డి మాట్లాడారు. నేరడిగొండ మండలం అధిక భాగం నిర్మల్‌కు ఆనుకుని ఉందని చివరి గ్రామం సైతం 30 కిలో మీటర్లకు మించి లేదన్నారు. మండల ప్రజలు ప్రతి నిత్యం ఆరోగ్య, విద్య, వ్యాపార రీత్యా వందలాది మంది నిర్మల్‌కు వెళ్లి వస్తుంటారని, ఆదిలాబాద్‌ జిల్లాకు మాత్రం కార్యాలయ పనుల నిమిత్తమే వెళ్లివస్తారన్నారు. అదే కాకుండా నేరడిగొండకు నిర్మల్‌ జిల్లాతో చరిత్రాత్మక సంబంధాలు నిమ్మరాజుల కాలం నుంచి ఉన్నాయన్నారు. నేటికి నిమ్మరాజులు నిర్మించిన కోటలు వడూర్‌ గ్రామంలో ఉన్నాయన్నారు. పాలన సౌలభ్యం కోసం నూతన జిల్లాలు ఏర్పడుతున్నందున నేరడిగొండ మండలాన్ని నిర్మల్‌లో చేర్చాలని కోరారు. కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు ఎస్‌కే బాబా, రాథోడ్‌ రవీందర్, ఆడే వసంత్, ఏలేటి రాజశేఖర్‌రెడ్డి, నాగారెడ్డి, డా.బోగ నారాయణ, కలాలి వెంకట రమణ, గంధం మోహన్‌ పాల్గొన్నారు.  
నిర్మల్‌ జిల్లా, రాస్తారోకో , అఖిలపక్షం, nirmal district, rastariko, ll-party  
 
మరిన్ని వార్తలు