మెప్మా లక్ష్యం నెరవేర్చాలి

12 Dec, 2016 23:30 IST|Sakshi
మెప్మా లక్ష్యం నెరవేర్చాలి
20 లక్షల కుటుంబాలను నగదు రహితం వైపు నడిపించాలి 
ఒక్కో రీసోర్స్‌పర్సన్కు 300 కుటుంబాల బాధ్యత 
సమీక్ష సమావేశంలో మెప్మామిషన్  డైరెక్టర్‌ చిన్నతాతయ్య
హిందూపురం అర్బన్ : రాష్ట్ర వ్యాప్తంగా మెప్మా ఆధ్వర్యంలో ఉన్న 20 లక్షల కుటుంబాలను నగదు రహిత లావాదేవీల వైపు మళ్లించడమే మన లక్ష్యమని, 2017 ఫిబ్రవరి 15 నాటికి దీనిని నేరవేర్చాల్సిన బాధ్యత రీసోర్స్‌పర్సన్లపై ఉందని మెప్మామిషన్ డైరెక్టర్‌ చిన్నతాతయ్య అన్నారు. ఆ దిశగా ఒక్కో రీసోర్స్‌పర్సన్  దాదాపు 300 కుటుంబాల బాధ్యత తీసుకోవాలని సూచించారు. స్థానిక జేవీఎస్‌ ప్యారడేజ్‌ హాల్‌లో సోమవారం పీడీ సావిత్రి అధ్యక్షతన మెప్మా జిల్లా సమీక్షా సమావేశం, నగదురహిత లావాదేవీలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అందులో చిన్నతాతయ్య మాట్లాడుతూ ప్రతి కుటుంబానికీ బ్యాంకు ఖాతాలు తెరిపించి ఏటీఎం, క్రెడిట్, డెబిట్‌ కార్డులు వినియోగించుకునేలా వారిని చైతన్యపరచాలన్నారు. బ్యాంకు రుణాలు ఇప్పించే సమయంలో రీసోర్స్‌పర్సన్లు డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని, అలా కాకుండా వారికి తగినంత పరితోషికం లభించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. కేవలం రాజకీయ నాయకుల సమావేశాలకు జనాలను తీసుకొచ్చే వారిలా కాకుండా ప్రతి కుటుంబానికీ రెండింతల ఆదాయం సమకూర్చేందుకు కృషి చేయాలన్నారు. ఆ దిశగా వారికి 15 రోజులు శిక్షణ అందించాలని పీడీని ఆదేశించారు. రాష్ట్రంలోని 110 మున్సిపాల్టీల్లోని సమాఖ్య సభ్యులందరూ మురికివాడలను దత్తత తీసుకుని వారి అభివృద్ధికి పాటుపడాలని, వారిని కూడా నగదురహిత లావాదేవీల వైపు నడిపించాలని సూచించారు. తర్వాత జిల్లాలోని 14 మున్సిపాల్టీల టీపీఓ, మెప్మా సిబ్బందితో సాయంత్రం వరకు సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ఏడీబీ మేనేజర్‌ ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  
మరిన్ని వార్తలు