కవ్వమాడిన ఇంట కరువుండదు

7 Aug, 2016 23:10 IST|Sakshi
  • లాభసాటిగా పాడి పరిశ్రమ
  • సంకరజాతి పాడితో అధిక లాభాలు
  •  300  నుంచి 350 రోజులు పాలు ఇస్తాయి
  • ఆదిలాబాద్‌ అగ్రికల్చర్‌: ప్రజల తలసరి వినియోగానికి కావలసిన పాలు లభించాలంటే సంకర జాతి ఆవుల పెంపకాన్ని చేపట్టాల్సి ఉంటుంది. పాల లభ్యత పెంచడం సంకర జాతి ఆవుల వల్ల మాత్రమే సాధ్యమువుతుంది. వీటితో తక్కువ సమయంలో ఎక్కవ పాల దిగుబడి సాధించవచ్చు. పొషణలో కొద్దిపాటి మొలకువలు పాటిస్తే పాల ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకోవచ్చుని విజయ డెయిరీ ఉపసంచాలకులు మధుసూదన్‌రావు వివరిస్తున్నారు.
               సంకార జాతి ఆవులు రెండున్నర ఏళ్లలోనే మొదటి సారి ఈనుతాయి. 250 రోజుల నుంచి 300 రోజుల వరకు ఇస్తాయి. 50 నుంచి 100 రోజులు వట్టిపోతాయి. ఈ ఆవులు ఏడాది పొడవునా ఎదుకు వచ్చి తొందరగా చూడి కట్టి ఈనుతాయి. వేసవిలో కేడా పాలు అందుబాటులో ఉంటాయి. సంకరజాతి ఆవులకు తిన్నంత పచ్చిగడ్డి మేపడం అవసరం. ఒక ఎకరాలో పండించిన పచ్చిగడ్డి దాదాపు 12 ఆవులకు వేయవచ్చు. 
    పాడి పోషణలో తీసుకోవల్సిన జాగ్రత్తలు...
    •  సంకర జాతి ఆవులు అధిక వేడిని, గాలిలో అధిక తేమను తట్టుకోలేవు. పాకలోకి గాలి విస్తారంగా వీచేందుకు అనుకూలంగా పై కప్పును ఎక్కువ పైకి ఉండేలా చూసుకోవాలి. పాక ఇరుకుగా కాకుండా విశాలంగా ఉండేలా చూసుకోవాలి. పశు శాలల చుట్టూ పచ్చని చెట్లు ఉంటే మంచిది. 
    •  పాడి పశువుల పోషణ లాభసాటిగా ఉండాలంటే వాటిని సకాలంలో చూడి కట్టించాలి. ఈనిన తర్వాత ఆరోగ్యంగా ఉన్న ఆవు 45 నుంచి 60 రోజుల లోపు ఎదకు వస్తుంది. అలా రాకపోతే పశుసంవర్ధక శాఖ డాక్టర్‌ తో వైద్యం చేయించాలి. 
    •  పాల దిగుబడిని బట్టి రోజుకు 10 నుంచి 15 కిలోల దాణా ఆహారంగా అందించాలి. సంకర జాతి ఆవులు రోజుకు 20 నుంచి 30 లీటర్ల పాలు ఇస్తాయి.  20 లీటర్లు ఇచ్చే ఆవుకు 30 లీటర్లు ఇచ్చే ఆవుకు ఒకే పరిమాణంలో దాణా ఇవ్వకూడదు. ఆవు శరీర బరువును బట్టి రోజుకు 30 నుంచి 50 గ్రాముల ఖనిజ లవణ మిశ్రమం తప్పని సరిగా దాణాలో కలిపి ఇవ్వాలి.
    •  మొక్కజొన్నను సొప్పను కత్తిరించి పశువులకు మేపవచ్చు. ఎండిన మొక్కజొన్న సొప్పను ముక్కలుగా కత్తిరించి బెల్లం, నీళ్లు కలిపి పిచికారీ చేసి మేతగా ఉపయోగించవచ్చు. పచ్చిగడ్డి అధికంగా లభించే కాలం మొక్కజొన్న, జొన్న సొప్పను మాగుడు గడ్డిగా తయారు చేసి నిల్వ చేసుకొని పచ్చిగడ్డి దొరకని కాలంలో వాడుకోవచ్చు. దూడ పుట్టగానే ఆర గంటలోపు జున్ను పాలు పట్టాలి. తర్వాత మూడు మాసాల వరకు రోజుకు 3 నుంచి 4 లీటర్ల పాలు తాగించడం అవసరం. రెండో మాసం నుంచి పచ్చిగడ్డి, దాణా, తవుడుని అలవాటు చేయాలి.
    •  సంకర జాతి ఆవులు ఐదేళ్ల వయసు వచ్చేటప్పటికీ మూడుసార్లు ఈనాలి. సంకరజాతి ఆవుల్లో విదేశీ రక్తం 60 శాతం కంటే మించి ఉండటం మంచిది కాదు. హెచ్చుపాలు గల వీర్యాన్ని వాడి మంచి దూడలను ఉత్పత్తి చేసుకుంటూ వాటిలో కనీసం సగం దూడలను పాడి పశువులుగా తయారు చేసుకుంటే పాడి పరిశ్రమ వృద్ధి చెంది లాభసాటిగా ఉంటుంది.
     
మరిన్ని వార్తలు