జ్వరం.. కలవరం

21 Aug, 2017 03:05 IST|Sakshi
జ్వరం.. కలవరం

► జిల్లాలో విజృంభిస్తున్న జ్వరాలు
► ప్రబలుతున్న మలేరియా
► మంచంపడుతున్న పల్లెలు
► ఇప్పటి వరకు బాలుడు సహా ఏడుగురి మృతి


లబ్బీపేట(విజయవాడ తూర్పు) : వాతావరణంలో మార్పులు... అధ్వానంగా మారిన పారిశుద్ధ్యం... విజృంభిస్తున్న దోమల కారణంగా జిల్లాలో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. తూర్పు, పశ్చిమ కృష్ణాలోని పలు పల్లెలు మంచంపట్టాయి. విజయవాడ నగరంలోనూ వేలాది మంది జ్వరంతో బాధపడుతున్నారు. తోట్లవల్లూరు మండలంలోని బొడ్డపాడులో వందలాది మంది జ్వరాల బారిన పడిన విషయం తెలిసిందే.

అదే మండలం పాములలంకతోపాటు తిరువూరు మండలంలోనూ జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. విజయవాడలోని జక్కంపూడి వైఎస్సార్‌ కాలనీ,  కొత్త రాజరాజేశ్వరీపేట, వన్‌టౌన్‌ ప్రాంతాల్లో విష జ్వరాలు ప్రబలాయి. బొడ్డపాడు సహా పలు ప్రాంతాల్లో వైద్య, ఆరోగ్యశాఖ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసింది. జ్వరపీడితులతో ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. మలేరియా కేసులు ఎక్కువగా నమోదు అవుతుండటం, అక్కడక్కడా డెంగీ లక్షణాలు కనిపిస్తుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు.

రెండు నెలలుగా...
జూలైలో అధికారులు 36,300 వేల మంది జ్వరబాధితుల నుంచి రక్తనమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించగా, వారిలో 158 మందికి మలేరియా పాజిటివ్‌ వచ్చింది. విజయవాడలో 7,467మంది జ్వరపీడితుల నుంచి శాంపిల్స్‌ సేకరించగా, 114 మలేరియా ఉన్నట్లు తేలింది. ఆగస్టు 1 నుంచి 15వ తేదీ వరకు జిల్లాలో 17,918 మంది జ్వరబాధితుల నుంచి రక్తనమూనాలు సేకరించగా, 50 మందికి మలేరియా పాజిటివ్‌ వచ్చింది.

అయితే, ఇవి కేవలం ప్రభుత్వాస్పత్రులు, వైద్య శిబిరాలకు వచ్చిన వారి వివరాలు మాత్రమే. ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందిన, పొందుతున్న వారి సంఖ్య ఇంతకు రెండింతలు రెట్టింపు ఉంటుందని అంచనా. విజయవాడ ప్రభుత్వాస్పతి మెడిసిన్‌ విభాగానికి నిత్యం 100 మందికి పైగా అవుట్‌ పేషెంట్లు వస్తుండగా, 20 మంది వరకు ఇన్‌ పేషెంట్లుగా చేరుతున్నారు. పిల్లల విభాగానికి సైతం నిత్యం 50 మంది జ్వరపీడితులు వస్తున్నారు. ప్రయివేటు ఆస్పత్రులకు రోజుకు వెయ్యి మంది వరకు వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నట్లు సమాచారం.

ఒకరితో మొదలై...
విష జ్వరాలకు కారణమైన వైరస్‌ గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుంది. దీంతో ఇంట్లో ఒకరికి విషజ్వరం వస్తే, వారి నుంచి మరొకరికి... ఇలా కుటుంబ సభ్యులు మొత్తం జ్వరాల బారినపడుతున్నారు. విష జ్వరం సోకినవారికి జలుబు, గొంతునొప్పి, మంట, తలనొప్పి, దగ్గు రావడంతోపాటు ఒక్కో సమయంలో వాంతులు, విరేచనాలు కూడా అవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. వారం రోజుల పాటు ఇబ్బందిగా ఉంటుందని తెలిపారు.

ఏడుగురి మృతి...
జ్వరాలబారిన పడి జిల్లాలో ఇప్పటి వరకు ఏడుగురు మరణించారు. తోట్లవల్లూరు మండలం బొడ్డపాడులో ఇద్దరు, విజయవాడలో ముగ్గురు, మైలవరంలో ఇద్దరు చొప్పున మరణించారు. విజయవాడలోని ఆర్‌ఆర్‌ పేటలో కొంటా యశ్వంత్‌(4) అనే బాలుడు శనివారం అర్ధరాత్రి మృతిచెందాడు. ఈ బాలుడు డెంగీ లక్షణాలతో మరణించి నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

జక్కంపూడిలో మలేరియా...
విజయవాడలోని జక్కంపూడి కాలనీలో మలేరియా విజృంభిస్తోంది. ఈ కాలనీలో 200 మందికిపైగా మలేరియా బాధితులు ఉన్నట్లు సమాచారం. వారి నుంచి మరింత మందికి వ్యాధి వ్యాప్తి చెందుతున్నట్లు భావిస్తున్నారు. సకాలంలో మలేరియా అధికారులు స్పందించక పోవడం వల్లే కాలనీలో మలేరియా విజృంభించినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రత్యేక శిబిరాలతోపాటు, శానిటేషన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. ఈ కాలనీలో ఏడాదిగా ఇదే పరిస్థితి ఉందని స్థానికులు చెబుతున్నారు.

అవగాహన అవసరం
వ్యాధి సోకిన తర్వాత చికిత్స కన్నా ముందస్తు చర్యలు తీసుకోవడం ముఖ్యం. మనం పరిసరాల్లో పడేసిన కొబ్బరి బోండాలు, పాత టైర్లు, కుండలు, వాడని డబ్బాల్లో నిల్వ ఉన్న వర్షం నీటిలో వ్యాధి కారక దోమలు వృద్ధి చెందుతాయి. వాటిని పరిసరాల్లో లేకుండా చూడటం ఎంతో ముఖ్యం. తీవ్ర జ్వరం ఉన్నప్పుడు పారాసెట్మాల్‌ మందులు వేసుకోవడంతోపాటు సమీప ఆరోగ్య కేంద్రానికి వెళ్లడం మంచిది. వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలపై అవగాహన అవసరం. – డాక్టర్‌ టీవీఎస్‌ఎన్‌ శాస్త్రి, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి 

>
మరిన్ని వార్తలు