భర్త చంపుతానన్నాడని..!

15 Sep, 2016 21:41 IST|Sakshi
భర్త చంపుతానన్నాడని..!

భర్త చంపుతానన్నాడని భార్యే.. భర్తతో పాటు ఇద్దరు పిల్లలను చంపేసింది. భార్య కత్తితో పొడవడంతో భర్త సురేష్(45) ఆమె సవతి కుమారులైన సుచి(15), సుమేష్(11) మృతి చెందారు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కేరళ రాష్ట్రానికి చెందిన సురేష్ ఏడాది క్రితం సురేష్ కుటుంబం ప్రొద్దుటూరుకు వచ్చి కోనేటికాల్వ వీధిలో నివాసముంటున్నారు. అక్కడే గుడ్‌బాయ్ అప్పడాల దుకాణాన్ని నిర్వహిస్తున్నారు.

స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో సుచి 8వ తరగతి, సుమేష్ 5వ తరగతి చదువుతున్నారు. భార్య ప్రేమ అప్పడాల పిండిని తయారు చేస్తుంటుంది. ఈ క్రమంలో గురువారం ఉదయాన్నే దుకాణంలో పని చేస్తున్న శివ అనే వ్యక్తి ఇంటి వద్దకు వచ్చి పిలవగా..ఇంట్లోనించి సమాధానం రాలేదు. దీంతో అతను కిటికిలో నుంచి లోపలికి చూశాడు. సురేష్ రక్తపు మడుగులో పడి ఉండటం గమనించి.. స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించాడు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు పగులకొట్టి లోపలికి వెళ్లారు. సురేష్ మృతదేహం మంచంలో పడి ఉండగా, సుచి మృతదేహం పై అంతస్తులోకి వెళ్లే మెట్లపై పడి ఉంది. సుమేష్, సుప్రీమ్, ప్రేమ గాయాలతో పడి ఉన్నారు. దీంతో పోలీసులు గాయపడిన వారిని వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సుమేష్‌కు కత్తిపోట్లు ఎక్కువగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించారు. అయితే కొద్దిసేపటికే అతను చనిపోయాడు. స్వల్ప గాయాలైన ప్రేమ, ఆమె కుమారుడు సుప్రీమ్‌లు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

మద్యం మత్తులో ఉన్న తన భర్త తనను ఉరివేసి చంపేస్తానని చెప్పడం వల్ల భయంతో.. తానే అతడిని చంపేసినట్లు ప్రేమ పోలీసులకు చెప్పింది. ఈక్రమంలోనే అడ్డువచ్చిన సుచి, సుమేష్ లు కూడా కత్తిపోట్లకు గురయ్యారని వివరించింది. వారితోపాటు తన కుమారుడ్ని చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని, అయితే చివరి నిమిషంలో ఆ పని చేయలేకపోయానని ప్రేమ పేర్కొంది. బుధవారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. వీరి కుటుంబానికి సన్నిహితుడైన దస్తగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు