మార్చి 1 నుంచి బడ్జెట్ సమావేశాలు

28 Jan, 2016 02:13 IST|Sakshi
మార్చి 1 నుంచి బడ్జెట్ సమావేశాలు

♦ 5న సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి
♦ 6, 7 తేదీలతోపాటు మరో నాలుగు రోజులు సెలవులు
♦ 23న ముగియనున్నసమావేశాలు
 
 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చి ఒకటో తేదీ నుంచి 23వ తేదీ వరకూ హైదరాబాద్‌లో జరగనున్నాయి. మధ్యలో ఆరు రోజులు శాసనసభకు సెలవులు ఇవ్వనున్నారు. సుమారు 17 రోజులపాటు సమావేశాలు జరగనున్నాయి. మార్చి 5న ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సాధారణ బడ్జెట్ ప్రవేశపెడతారు. 9వ తేదీన వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు వ్యవసాయశాఖ ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత రెండు రోజులు సెలవు ఇవ్వడం ఆనవాయితీ. అందులో భాగంగా మార్చి 6, 7 తేదీలతోపాటు మరో నాలుగు రోజులు శని, ఆదివారాలు కూడా సెలవులు ఇవ్వనున్నారు. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో మెజారిటీ మంత్రులు ైెహ దరాబాద్‌లోనే సమావేశాలు నిర్వహించాలని అభిప్రాయపడ్డారు. వీటిని పరిగణనలోకి తీసుకుని స్పీకర్‌తో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటానని సీఎం చెప్పినట్లు తెలిసింది.

 హైదరాబాద్‌లోనే సమావేశాలు..
 రాజధాని అమరావతిలోనే ఈసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే స్పీకర్ యోచించారు. ఈ విషయమై ఆయన ఇప్పటికే పలువురితో భేటీ అయ్యారు. రూ.12 కోట్లు తాత్కాలిక భవనం నిర్మించేందుకు ఖర్చవుతుందని అధికారులు తేల్చారు. సభ నిర్వహణకు రూ.11 కోట్లు అవుతుందని శాసనసభ వర్గాలు లెక్కగట్టాయి. ఈ భవన నిర్మాణం, ఖర్చులు కలిపి రూ.23 కోట్లు వ్యయమవుతుండటంతో చివరకు హైదరాబాద్‌లోనే సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే స్పీకర్ కోడెల విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయన మార్చి 24 లేదా 25న బయలుదేరి వారంపాటు విదేశీ పర్యటనకు వెళతారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు కొత్త రాజధాని నిర్మాణంలో భూమికి సంబంధించిన అంశం వరకూ ఇటీవల అసెంబ్లీలో ఆమోదించిన చట్టం ప్రకారమే నడుచుకుంటామని ఆర్థికమంత్రి యనమల చెప్పారు. రాజధాని నిర్మాణానికి  ఏర్పాటైన జాయింట్ వెంచర్ కంపెనీల్లో సింగపూర్ ప్రభుత్వ కంపెనీ ఒకటి ఉండాలనే నిబంధన ఉందని, దాన్ని పాటిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏకు సంబంధించిన ఫైల్ ఆర్థికశాఖ నుంచి సీఎం వద్దకు చేరిందన్నారు.

 శ్రీలంక పర్యటనలో కోడెల..: రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం రాత్రి స్పీకర్ కోడెల శివప్రసాదరావు శ్రీలంక వెళ్లారు. ఆయ న గురువారం రాత్రి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. ఈస్ట్రన్ ప్రావిన్స్ ఆఫ్ శ్రీలంక ముఖ్యమంత్రి నజీర్ అహ్మద్ ఆహ్వారం మేరకు కోడెల శ్రీలంక వెళ్లారు. ఇన్వెస్ట్ ఈస్ట్ 2016 పేరుతో జరుగుతున్న అంతర్జాతీయ పెట్టుబడు ల ఫోరం కార్యక్రమాల్లో కోడెల పాల్గొంటారు.

>
మరిన్ని వార్తలు