రాజధాని వ్యవహారం రహస్యమా?

8 Nov, 2015 04:09 IST|Sakshi
రాజధాని వ్యవహారం రహస్యమా?

రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీ.వీ.రమేశ్‌కు
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శర్మ లేఖ

 
 సాక్షి, హైదరాబాద్: రాజధాని విషయంలో రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, విధానాలపట్ల రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ మరోసారి మండిపడ్డారు. రాజధాని వ్యవహారంలో అంతా రహస్యంగా చేస్తున్నారని, పారదర్శకత లోపించిందని తప్పుపట్టారు. అంతేగాక రాజధాని పేరిట నీటిని, నిధుల్ని కృష్ణా-గుంటూరు జిల్లాలకు తరలిస్తూ.. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్ని దోచేస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ఇటు సాగునీటి ప్రాజెక్టుల విషయంలోను, అటు రాజధాని విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రాష్ట్రప్రభుత్వం ఆర్థికంగా దివాలా తీస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈమేరకు రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి పీవీ రమేశ్‌కు శనివారం నాలుగు పేజీల లేఖ రాశారు. రాజధాని విషయంలో రాష్ట్రప్రజానీకాన్ని చీకట్లోపెట్టి వ్యవహారాలు చేయడం రాజకీయ నాయకత్వానికి,అధికారయంత్రాంగానికి సమంజసం కాదని చురకలేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు.. అంతులేని అవినీతికి, నల్లధనం విచ్చలవిడిగా ప్రవహించడానికి వీలు కల్పిస్తాయన్నారు. ముఖ్యాంశాలివీ..

 నిధులెలా వస్తాయి? : సింగపూర్ కన్సల్టెంట్ రూపొందించిన అమరావతి మాస్టర్‌ప్లాన్, ఏపీ రాష్ట్రస్థాయి పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీ(ఏపీఎస్‌ఈఐఏఏ) జారీచేసిన పర్యావరణ అనుమతి(ఈసీ)లో విధించిన షరతులు, ఆంక్షలతోపాటు 35 ఏళ్ల బడ్జెట్ కేటాయింపుల నిబంధనల అమలుకు నిధుల్ని రాష్ట్రప్రభుత్వం ఎలా సమకూర్చుకుంటుంది?

► రాజధాని నీటి అవసరాలకోసం ప్రకాశం బ్యారేజీ ఎగువన మరో బ్యారేజీ నిర్మించాలి. ఇప్పటికే పట్టిసీమపై భారీగా నిధులు ఖర్చుపెట్టిన ప్రభుత్వం..మరోప్రాజెక్టుకు నిధులు ఖర్చుపెట్టగలదా? ఇంకా రాజధానికోసం పలు ఏర్పాట్లు చేయాల్సి ఉంది. వీటికి నిధులు కేటాయించే సామర్థ్యం రాష్ట్ర బడ్జెట్‌కుంటుందా?
► దిగ్భ్రాంతి కలిగించే నిధులవ్యయానికి ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం అంగీకరిస్తుందా? భారీగా రుణాలు తెచ్చుకుంటే.. రాష్ట్రం తీవ్ర ఆర్థికసంక్షోభంలో కూరుకుపోతుంది.
► విలువైన భూములిస్తేనో.. భారీగా ఆదాయం సమకూరుతుందని భావిస్తేతప్ప ప్రైవేటు పెట్టుబడుదారులు భారీగా పెట్టుబడులు పెట్టరు. ఒక దశ తర్వాత.. కేంద్రమూ చేతులు దులుపుకుంటుందేతప్ప.. భారీ ఆర్థికభారాన్ని మోయడానికి సిద్ధపడదు. కనీసం పదేళ్లకాలానికైనా సరే.. బడ్జెట్ వ్యయంపై ఆర్థికశాఖ ఆలోచించిందా? భారీ కేటాయింపులు సాధ్యంకాదని రాజకీయ నాయకత్వానికి చెప్పకపోతే.. దీనిపై బహిరంగచర్చ జరిగే రోజొస్తుందని మరిచిపోకూడదు.

 ఉత్తరాంధ్ర, సీమ జిల్లాల్ని దోపిడీ చేయడమే..
► రాష్ట్రంలో జిల్లాలమధ్య అసమానతల అంశమూ ఇందులో ఉంది. కృష్ణా, గోదావరి నదుల నీటిని తరలించడంతోపాటు భారీగా నిధుల్ని అమరావతిపై వెచ్చించడమంటే.. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల ప్రజలను దోపిడీచేసి కేవలం ఒక ప్రాంతానికి మేలు చేయడం కిందకే వస్తుంది.వీటిని దృష్టిలో పెట్టుకొని నీటిపారుదలశాఖ కనీసం చర్చకోసమైనా విధానపత్రం రూపొందించిందా?
► రుసుం వసూలు చేయకుండానే మాస్టర్‌ప్లాన్ రూపొందించడానికి విదేశీ కంపెనీలు ఆసక్తి చూపించడం వెనుక వారి అసలు ఉద్దేశాలపై అనుమానాలున్నాయి.
► మాస్టర్‌ప్లాన్‌లో పేర్కొన్న మేరకు 12 శాతం భూమిని వాణిజ్య అవసరాలకు వినియోగించనున్నారు. ప్రజావసరాలకోసం ప్రజలనుంచి తీసుకున్న భూమిని వాణిజ్య అవసరాలకు మళ్లించడం.. అదీ ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య పద్ధతితో అభివృద్ధి చేయడానికి లీగల్‌గా సాధ్యమవుతుందా?
► సీఆర్‌డీఏ, ఇతర కంపెనీలు, కన్సల్టెంట్ల మధ్య జరిగిన ఒప్పందాల్లో ఎక్కడా పారదర్శకత లేదు. ఒక్కఒప్పందాన్నీ బహిరంగపరచకపోవడం గమనార్హం.

 బాక్సైట్ జీవో రాజ్యాంగ విరుద్ధం
 విశాఖపట్నం జిల్లాలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతినిస్తూ జారీచేసిన జీవో నంబరు 97 రాజ్యాంగవిరుద్ధమని ఈఏఎస్ శర్మ పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ కార్యదర్శి అశోక్ లావాసా, డెరైక్టర్ జనరల్ ఎస్‌ఎస్ నేగి, రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవీఆర్ కృష్ణారావులకు శనివారం లేఖరాశారు. ఈ జీవో ప్రకారం 1,212 హెక్టార్లలో బాక్సైట్ ఖనిజం తవ్వకాలకు ఏపీ ఖనిజాభివృద్ధిసంస్థకు అనుమతి లభించిందన్నారు. అయితే ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఇంతకుముందెన్నడూ ట్రైబల్ ఎడ్వయిజరీ కౌన్సిల్‌లో చూపలేదన్నారు. అందువల్ల ఈ జీవో జారీ రాజ్యాంగంలోని ఐదో షెడ్యూలు నిబంధనలకు విరుద్ధమన్నారు.

మరిన్ని వార్తలు