రాజధాని నిర్మాణాన్ని తక్షణమే నిలిపేయండి

21 Oct, 2015 01:40 IST|Sakshi
రాజధాని నిర్మాణాన్ని తక్షణమే నిలిపేయండి

సాక్షి, హైదరాబాద్: శ్రీబాగ్ ఒప్పందాన్ని తుంగలో తొక్కుతూ.. ప్రొఫెసర్ శివరామకృష్ణన్ కమిటీ ప్రతిపాదనలకు విరుద్ధంగా.. హైకోర్టులో కేసు విచారణలో ఉన్న అంశాన్ని విస్మరించి ఏకపక్షంగా విజయవాడ, గుంటూరు మధ్యన చేపట్టిన రాజధాని నిర్మాణాన్ని తక్షణమే నిలిపేయాలని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను రాయలసీమ అభ్యుదయ సం ఘం నాయకులు కోరారు. తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న డిమాం డ్‌తో 1953కు పూర్వం కోస్తా నాయకులు ఉద్యమాలు చేశారన్నారు.

కోస్తా అప్పటికే అభివృద్ధి చెంది ఉండటంతో అప్పట్లో రాయలసీమ ప్రజలు తమిళనాడులో కొనసాగేలా చూడటం లేదా తమకూ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని కోరారని గుర్తుచేశారు. ఇది గుర్తించిన కోస్తా నాయకులు.. రాయలసీమ ప్రజల అభీష్టం మేరకు రాజధానిని, హైకోర్టును ఏర్పాటు చేస్తామని, పదేళ్లలోగా తుంగభద్ర, కృష్ణా, పెన్నా నదులపై ప్రాజెక్టులను నిర్మించి సీమకు నీళ్లందిస్తామని ప్రతిపాదిం చారు. వాటికి ఆమోదం తెలిపిన సీమ, కోస్తా నేతల మధ్య నవంబర్ 16, 1937న శ్రీబాగ్ ఒప్పం దం కుదిరిందని చెప్పారు.

ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన తర్వాత.. సీమ ప్రజలు, మెజార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు కర్నూలులో రాజధానిని, గుంటూరులో హైకోర్టును ఏర్పాటు చేశారని వివరించారు. కానీ.. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేసినప్పుడు కర్నూలు నుంచి రాజధానిని హైదరాబాద్‌కు తరలించారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014తో రాష్ట్రాన్ని విభజించాక.. ఆంధ్రప్రదేశ్‌లో శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

కానీ.. సీమ ప్రజలకు అన్యాయం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. సీమ ప్రజల మనోభిప్రాయాలకు విరుద్ధంగా విజయవాడ, గుంటూరు మధ్య రాజధానిని ఏర్పాటు చేస్తున్నారని, ఇప్పటికే సీమలో ఏర్పడిన కరువు పరిస్థితులను ఎదుర్కోవడంపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం తద్భిన్నంగా శ్రీశైలం రిజర్వాయర్‌లో 854 అడుగుల స్థాయిలో నీటి మట్టాన్ని నిలపకుండా.. నీటికి కిందకు వదిలేస్తున్నారని వివరించారు. తక్షణమే జోక్యం చేసుకుని సీమ ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. గవర్నర్‌ను కలసిన వారిలో హైకోర్టు రిటైర్డు జడ్జిలు పి.లక్ష్మణరెడ్డి, గోపాలరావు, రిటైర్డ్ ఐపీఎస్‌లు ఎ.హనుమంతరెడ్డి, వెంకటరెడ్డి, రిటైర్డు సీఈ శ్రీరామిరెడ్డి, రాయలసీమ అభ్యుదయ సంఘం అధ్యక్షులు ఎం.ఓబుళరెడ్డి, ఉపాధ్యక్షులు ఇమ్రాన్ హుస్సేన్, కన్వీనర్ ఇస్మాయిల్ రెడ్డి ఉన్నారు.

మరిన్ని వార్తలు