తుళ్లూరులో తాత్కాలిక శాసనసభ నిర్మాణం

14 Oct, 2015 03:13 IST|Sakshi
తుళ్లూరులో తాత్కాలిక శాసనసభ నిర్మాణం

శీతాకాలం, బడ్జెట్ సమావేశాలు నిర్వహణ.. ఏర్పాట్లపై స్పీకర్ కోడెల సమీక్ష

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు డిసెంబర్ ఆఖరి వారంలో ఐదు రోజులపాటు గుంటూరు జిల్లా తుళ్లూరులో నిర్వహించేందుకు వీలుగా తాత్కాలిక నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత సభను పోలి ఉండేలా సభా మందిరాన్ని ఐదెకరాల విస్తీర్ణంలో రాజధాని నగరం అమరావతికి శంకుస్థాపన జరిగే ప్రాంతానికి సమీపంలో నిర్మించనుంది. దీనికి సంబంధించిన నమూనాలను మంగళవారం అసెంబ్లీలోని తన చాంబర్‌లో నిర్వహించిన సమావేశంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు పరిశీలించారు.

వీటిని సీఎంకు చూపించి ఆయన సూచనలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేయాలని అధికారులకు సూచించారు. తాత్కాలిక శాసనసభ ప్రాంగణం తగిన రీతిన రూపుదిద్దుకుంటే అవసరమైతే బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అంశాన్ని పరిశీలించవచ్చని చెప్పారు. శాసనమండలి శీతాకాల సమావేశాలు కూడా తుళ్లూరులోనే జరగనున్నాయని ప్రభుత్వం పేర్కొంది.

మరిన్ని వార్తలు