మోడ్రన్‌ కక్కుర్తి....

2 Jul, 2017 00:38 IST|Sakshi
మోడ్రన్‌ కక్కుర్తి....

 భగత్‌సింగ్‌నగర్‌ కల్యాణ మండపం నిర్మాణంలో కాంట్రాక్టర్‌ ఇష్టారాజ్యం
గుత్తేదారు నిర్లక్ష్యంతో ప్రాణాపాయ స్థితితో కార్మికుడు, మరొకరికి గాయాలు
టెండర్ల ప్రక్రియ నుంచీ పలు అనుమానాలు

చింతల్‌:  చింతల్‌ డివిజన్‌ భగత్‌సింగ్‌నగర్‌లో మోడ్రన్‌ కల్యాణ మండపం ఏర్పాటు చేసేందుకు రూ.1.71 లక్షలతో  మే 16న మార్కింగ్‌ చేశారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ ఆది నుంచి ఫంక్షన్‌హాలు నిర్మాణానికి వెనుకడుగు వేస్తూనే ఉన్నాడు. అతడి నిర్లక్ష్యం కారణంగా  (జూన్‌ 29న) ఇద్దరు కార్మికులు ప్రమాదం బారిన పడ్డారు. అందులో ఒకరు చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు.

శంకుస్థాపన నుంచీ వెనకడుగే...
కల్యాణ మండపం నిర్మాణానికి రూ.1.70 కోట్లతో ఎమ్మెల్యే వివేకానంద్, కార్పొరేటర్‌ రషీదాబేగం శంకుస్థాపన చేశారు. అనంతరం పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ బేస్‌మెంట్‌ వరకు పూర్తి చేసి నిధులు సరిపోవడం లేదన్న సాకుతో చేతులెత్తేశాడు. దీనిపై ‘సాక్షి’లో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో సదరు కాంట్రాక్టర్‌ పనులను ఇటీవలే ప్రారంభించాడు.

నిధుల సాకా....కమీషన్ల బేరమా...
నిధులు చాలలేదని కల్యాణ మండపం పనులు నిలిపివేయడంపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు కాంట్రాక్టర్‌ టెండర్‌ వేయకముందు సరిపోతాయనుకున్న నిధులు బేస్‌మెంట్‌ పూర్తయిన తరువాత మధ్యలో అలా ఎలా వదిలేస్తారంటూ స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  పనులు ప్రారంభించేటప్పుడు లేని నిధుల సమస్య కేవలం బేస్‌మెంట్‌ వద్ద ఎలా నిలిచిపోతుంది. సాధారణంగా పనులు పూర్తి చేసే క్రమంలో కొంత మేర వదిలేస్తారు. ఇక్కడ మాత్రం అసలు ప్రారంభంలోనే ఏదో జరిగిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

టెండర్‌ ఒకలా నిర్మాణం మరోలా...
మోడ్రన్‌ ఫంక్షన్‌హాలు నిర్మాణానికి టెండర్‌లో మొత్తం ఆర్‌సీసీ నిర్మాణంతో చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. కానీ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ షెడ్డు రూపంలో నిర్మాణం చేపట్టడంతో స్థానికులు అవాక్కయ్యారు. ఇదే విషయంమై పలువురు కాంట్రాక్టర్‌ను ప్రశ్నించగా నిధుల లేమితో షెడ్డు రూపంలో నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

కార్మికులపై నిర్లక్ష్యం...
నిర్మాణ సమయంలో సదరు కాంట్రాక్టర్‌ ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టకుండా పనులు చేపడుతున్నాడు. కార్మికులకు కనీస అవసరాలైన గ్లౌస్, హెడ్‌క్యాప్‌ వంటి పరికరాలు అందించకుండానే పనులు కొనసాగిస్తున్నాడు. షెడ్డు నిర్మాణానికి ఉపయోగించే భారీ ఇనుపకడ్డీలను కేవలం క్రేన్‌ సహాయంతో పనులు చేపడుతున్నాడు. దీంతో బరువు తట్టుకోలేక క్రేన్‌ విరిగిపడి రంజిత్‌ అనే కార్మికుడి తలపై పడటంతో అతను ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. మరో కార్మికుడు  మల్లికార్జున్‌ చేయి విరిగింది.

కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంతోనే ప్రమాదం..
కాంట్రాక్టర్‌ నిర్మక్ష్యం కారణంగానే కార్మికులకు ప్రమాదం సంభవించింది. భారీ ఇనుప వస్తువులు ఉన్నప్పుడు రెండు క్రేన్‌లు ఉపయోగించాల్సి ఉండగా ఒకే క్రేన్‌తో సరిపెట్టడంతో బరువు తట్టుకోలేక క్రేన్‌ విరిగిపోయింది. ఈ నిర్మాణంపై అధికారులు దృష్టి సారించకపోవడంతో ఆలస్యంతో పాటు ప్రమాదం సంభవించింది.  కమిషన్లకు కక్కుర్తి పడే షెడ్డు రూపంలో నిర్మాణం చేపడుతున్నారు. మోడ్రన్‌ ఫంక్షన్‌హాలు పేరుతో ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది.
–టి.లక్ష్మారెడ్డి, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌

మరిన్ని వార్తలు