కోర్టుకే ఫోర్జరీ పత్రాల సమర్పణ

25 Jan, 2017 22:12 IST|Sakshi
కోర్టుకే ఫోర్జరీ పత్రాల సమర్పణ

గుర్తించిన న్యాయమూర్తి కారోబార్‌ అరెస్టు

ఆర్మూర్‌అర్బన్‌(ఆర్మూర్‌) : నిర్మల్‌ జిల్లా అనంతపేట్‌కు చెందిన పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ చేసిన కేసులో అదే గ్రామ పంచాయతీకి చెందిన కారోబార్‌ నేరేళ్ల విద్యాసాగర్‌ను ఆర్మూర్‌ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఆర్మూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్సై సంతోష్‌ వివరాలు వెల్లడించారు. ఆర్మూర్‌లో మాయమాటలు చెప్పి యువతి నుంచి బంగారు నగలు కాజేసిన సంఘటనలో నిర్మల్‌ జిల్లా కేంద్రానికి చెందిన తోటు కృష్ణను ఐదునెలల క్రితం ఆర్మూర్‌ పోలీసులు అరెస్టు చేశారు. కాగా కోర్టులో బెయిలు మంజూరు విషయంలో జమానతుగా ఇద్దరు వ్యక్తులు అవసరం ఉంటుంది.

కాగా నిర్మల్‌ జిల్లా అనంతపేట్‌కు చెందిన బొబ్బాల భూమన్న, గడచంద రాజన్నలు జమానత్‌ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. కాగా జమానత్‌కు ఇంటి విలువపత్రం సమర్పించాల్సి ఉంటుంది. ఇంటి విలువపత్రంపై సంబంధిత కార్యదర్శి సంతకం చేయాల్సి ఉంటుంది. దీంతో కారోబార్‌ విద్యాసాగర్‌ పంచాయతీ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. బెయిలు మంజూరులో ఫోర్జరీని గమనించిన న్యాయమూర్తి విచారణకు ఆదేశించారు. విచారణ చేపట్టిన పోలీసులు కారోబార్‌ విద్యా సాగర్, జమానత్‌లైన భూమన్న, గడచంద రాజన్నలను అరెస్టు చేశారు. అనంతరం వారిపై చీటింగ్‌ కేసు నమోదు చేసి ఆర్మూర్‌ కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు