పీహెచ్‌సీల్లో సిబ్బంది రెండింతలు

8 Oct, 2015 04:02 IST|Sakshi
పీహెచ్‌సీల్లో సిబ్బంది రెండింతలు

♦ తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక దృష్టి
♦ త్వరలో సమగ్ర నూతన వైద్య విధానం ఆవిష్కరణ
♦ నేడు మంత్రివర్గ ఉపసంఘం మొదటి భేటీ
 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వైద్య ఆరోగ్యరంగాన్ని మరింత పరిపుష్టం చేయాలని సర్కారు యోచిస్తోంది. అందుకోసం సమగ్ర వైద్య విధానాన్ని రూపకల్పన చేసే పనిలో నిమగ్నమైంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ) మొదలు జిల్లాస్థాయిలోని ప్రభుత్వ ఆసుపత్రుల వరకు అన్నింటినీ సమూలంగా ప్రక్షాళన చేసే దిశగా సర్కారు అడుగులు వేస్తోంది. పారిశుద్ధ్యం, అధునాతన వైద్య పరికరాల ఏర్పాటు, అదనపు వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది సహా అన్నింటినీ కల్పించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ వైద్యాన్ని కల్పించాలన్న కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

అందులో భాగంగానే ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యరంగంపై ఆ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అధ్యక్షతన మరో ఇద్దరు మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఉపసంఘం మొదటి సమావేశం గురువారం జరగనుంది. ఈ సమావేశంలో ఉన్నతాధికారులు వైద్యరంగంపై వాస్తవ పరిస్థితిని ఉపసంఘం సభ్యులకు వివరిస్తారు. ఆ తర్వాత మూడు నాలుగుసార్లు సమావేశం నిర్వహించి నివేదిక తయారుచేస్తారు. ఆ నివేదికను ముఖ్యమంత్రికి సమర్పిస్తారు.

 ఇదీ సర్కారు ఆలోచన..
 ప్రతీ జిల్లాలో వెయ్యి పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని సర్కారు ఆలోచన. 20 వేల నుంచి 25 వేల జనాభాకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండాలని, ప్రతీ నియోజకవర్గంలో వంద గ్రామాలకు ఉపయోగపడేలా ఏరియా ఆసుపత్రి ఉండాలనేది ఉద్దేశం. రెవెన్యూ జిల్లాల ప్రాతిపదికన కాకుం డా భౌగోళిక పరిస్థితుల ఆధారంగా ఆరోగ్య జిల్లాలను ఏర్పాటు చేయాలని కూడా యోచిస్తున్నారు. పీహెచ్‌సీలను 30 పడకల ఆసుపత్రులుగా, ఏరియా ఆసుపత్రులను 100 పడకల ఆసుపత్రులుగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు.

ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ ఆసుపత్రులను రెండు వేల పడకల ఆసుపత్రులుగా అభివృద్ధి చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడానికి వైద్యులు, ఇతర సిబ్బంది ఎందుకు ముందుకు రావడం లేదో పరిశీలి స్తారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ప్రత్యేక ప్రోత్సాహకం ఇచ్చే విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. 104, 108 సేవలు కూడా ప్రభుత్వ వైద్యంతో కలిసే ఉండాలనేది స ర్కారు ఆలోచన. ప్రభు త్వ వైద్యాన్నంతా ఒకే గొడుగు కిందకు తీసుకురావాల్సిన అవసరాన్ని సర్కారు గుర్తించింది. మొత్తంగా వైద్య ఆరోగ్య శాఖను ప్రక్షాళన చేయాలని సీఎం ఆలోచన. ఈ విషయంలో మంత్రివర్గ ఉపసంఘం లోతుగా అధ్యయనం చేస్తుంది.
 
 
 కింది స్థాయి వరకు ఐసీయూ యూనిట్లు
 గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ వైద్యం కునారిల్లింది. వైద్యులు లేక... ఉన్నవారు రాక... మందులు అందుబాటులో లేక ప్రజలు సాధారణ వెద్యానికి దూరమయ్యారు. ఈ నేపథ్యంలో పీహెచ్‌సీల్లో సిబ్బందిని రెండింతలు చేసే అంశంపై సర్కారు ఒక అంచనా వేసింది. ప్రస్తుతం తెలంగాణలో పీహెచ్‌సీల్లో 8,937 మంది వైద్య సిబ్బందికి గాను... 6,658 మందే పనిచేస్తున్నారు. 2,279 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని నింపినా మరో 2,088 మంది వైద్య సిబ్బంది కావాలి.

ప్రభుత్వం నూతన వైద్య విధానాన్ని ఆవిష్కరించి అందుకనుగుణంగా తీర్చిదిద్దాలంటే ఆ సంఖ్య సరిపోదు. ఇప్పుడున్న వైద్య సిబ్బందికి తోడు మరో 7,221 మంది అవసరమవుతారని వైద్య ఆరోగ్యశాఖ అంచనా వేసింది. అలాగే కిందిస్థాయి వరకు ఐసీయూ యూనిట్లను ఏర్పాటు చేయాలనేది సర్కారు ఉద్దేశం. ఈ విధంగా చేసినప్పుడే ప్రభుత్వం తాను అనుకున్న స్థాయిలో వైద్యాన్ని ప్రజల చెంతకు తీసుకెళ్లగలదు.

>
మరిన్ని వార్తలు