చినుకు రాలదు.. ఆశ చావదు

17 Nov, 2016 00:35 IST|Sakshi
చినుకు రాలదు.. ఆశ చావదు

ప్రశ్నార్థకంగా పొగాకు సాగు
మడుల్లో ఏపుగా పెరిగిన నారు..
చినుకు జాడలేక సాగని పొగనాట్లు
అదును దాటిపోతోందని జిల్లా రైతుల ఆందోళన
ఇప్పటికే వేసిన పంట వాడుముఖం
వరుణుడి కోసం ఆశగా ఎదురుచూపు
పంటను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నం

 
జిల్లాలో పొగాకు రైతులు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వర్షా భావం దెబ్బకు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. అసలే వరుస నష్టాలతో అప్పుల ఊబిలో కూరుకుపోరుున పొగాకు రైతుపై అటు ప్రకృతి.. ఇటు ప్రభుత్వం రెండూ పగబట్టారుు. ఓ వైపు పొగాకు సాగును క్రమంగా తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోంది. సాగుకు సిద్ధంచేసిన చేలల్లో అదునులో మొక్క నాటుకుందామంటే చినుకు జాడలే దు. ఆశ చావని రైతన్న రెండు మూడు రోజులుగా ఊరిస్తున్న మబ్బులను చూసి, సాగుచేసేందుకు వ్యవయప్రయూసలు పడుతున్నాడు. ఏపుగా పెరిగిన పొగనారు మడుల్లోనే రంగు మారుతోంది. ఇప్పటికే సాగయిన పొలాల్లో మొక్కలు ఎండిపోతున్నాయి. క్యూరింగ్‌కు రావాల్సిన సమయంలో పంటను కాపాడుకునేందుకు రైతన్న భగీర థ ప్రయత్నం చేస్తున్నాడు.
 
ఒంగోలు టూటౌన్/కందుకూరు రూరల్/కొనక నమిట్ల/: జిల్లాలో మొత్తం 14 వేలం కేంద్రాలు ఉండగా..17,149 మంది పొగాకు రైతులు ఉన్నారు. తేలిక నేలల పరిధి అయిన పొదిలి, కందుకూరు, కనిగిరి, కలిగిరి, డీసీ పల్లి ప్రాంతంలో ఈ యేడాది 39 మిలియన్ కిలోల ఉత్పత్తికి ఆధరైజ్‌డ్ ఇచ్చారు. 26 వేల హెక్టార్లలో పంట సాగుకు పొగాకు బోర్డు ఇచ్చింది. ఇందులో ఇప్పటి వరకు కేవలం 1859 హెక్టార్లే సాగయింది. సాగయిన పొగాకు పంట కూడా వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటుంది. కురిచేడు ప్రాంతంలో 30 రోజుల దశలో ఉన్న పంట పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. నీటికొరత వల్ల ఆకులు ఎండిపోతున్నాయి. డీసీపల్లి, కొనకనమిట్ల మండలాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చి పంటను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.

ట్యాంకర్‌కు రూ.2 వేలకుపైగా ఖర్చు అవుతున్నా.. రైతులు వెనకంజ వేయకుండా పొగమొక్కలకు నీటితడులు అందించేందుకు భగీర థ ప్రయత్నంచేస్తున్నారు. నల్లరేగడి నేలల పరిధిలో సాగు పరిస్థితి దారుణంగా ఉంది. మొత్తం 22వేల హెక్టార్లకు రిజిస్ట్రేషన్ అనుమతిస్తే.. ఇప్పటి వరకు కేవలం సుమారుగా 1000 హెక్టార్లలోనే పొగాకు సాగయింది. వెల్లంపల్లి, ఒంగోలు, టంగుటూరు కొండపి ప్రాంతాలలో ఏడు వేలం కేంద్రాలు ఉండగా.. వీటి పరిధిలో సాగయిన పంట కూడా వర్షాభావం దెబ్బకు విలవిలలాడుతుంది.
 
కౌలు రైతు పరిస్థితి దయనీయం..
కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. అదనపు రుసుం రూ.400లతో   బ్యారన్ల రిజిస్ట్రేషన్‌కు ఒక్క రోజే గడువు ఉంది. ఎస్‌ఎల్‌స్ పరిధిలో 11, 976 బ్యారన్‌లు ఉండగా ఇప్పటి వరకు 11, 687 బ్యారన్‌లకు రిజిస్ట్రేషన్ జరిగింది. ఎస్‌బీఎస్ పరిధిలో కూడా 10,168 బ్యారన్‌లు ఉండగా.. ఇంకా కొన్ని రిజిస్ట్రేషన్ కావాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. బ్యారన్ రిజిస్ట్రేషన్లు ఎలా ఉన్నా.. ప్రస్తుతం వేసిన పంటను కాపాడుకోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా.. వరుణుడు కరిణించకపోతే .. పొగాకు రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారయ్యే పరిస్థితి ఉంది.
 
ఎకరాకు రూ.2 లక్షలు పెట్టుబడి..
కందుకూరులోని 26, 27వ వేలం కేంద్రాల పరిధిలో ఈ ఏడాది పొగనారు సాగు కూడా తగ్గిపోయింది. మండలంలో ఓగూరు, విక్కిరాలపేట, దూబగుంట, వలేటివారిపాలెం మండలం, పొన్నలూరు మండలాల్లో అధికంగా పొగనారు మళ్లు పెట్టారు. ఓగూరులో సుమారు 50, విక్కిరాలపేట, దూబగుంట ప్రాంతంలో మోరు 30 ఎకరాల్లో పొగనారుమళ్లు సాగు చేశారు. పొగాకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని భయపడి నారు మడులు సాగు చేసేందుకు రైతులు వెనుకంజ వేశారు. ఒక ఎకరం పొలంలో నారు సాగు చేయాలంటే కౌలు, కూలీల ఖర్చుతో సహా సుమారు రూ. 2 లక్షల పెట్టుబడి అయింది.

వర్షాభావం కారణంగా నాట్లు వేకపోవడంతో ఇప్పటికే మడుల్లో పెరిగిన నారు చివర ఆకులను కోస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా గుంటల్లో నీరు నింపుకొని స్ప్రిక్లర్లు ద్వారా నారుమడులకు నీరు పెడుతున్నారు. నీటి కష్టాలు ఉన్నప్పటికి నారు కొనే నాధులు ఇప్పటి వరకు రాలేదు.   పెరిగిన నారును పై తలలు కోయడంతోపాటు ముదిరిన నారును నేరుగా పికి బయటపడేస్తున్నారు. వర్షాలు లేకపోతే నారుమడులు వదులుకోవాల్సిందే.  పరిస్థితిని చూస్తే కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేలా కనిపించడం లేదు. ప్రస్తుతం మూట పొగ నారు రూ.500 నుంచి రూ.700 పలుకుతుంది. కందుకూరు 26వ వేలం కేంద్ర పరిధిలో 2225 బ్యారన్లు ఉండగా 4231 హెక్టార్లలో నాట్లు పడాలి.

కాని ఇప్పటి వరకు 238 హెక్టార్లలో మాత్రమే నాట్లు వేశారు. 27వ వేలం కేంద్ర పరిధిలో 1997 బ్యారన్లు ఉండగా 4168 హెక్టార్లలో నాట్లు వేయాల్సి ఉండగా కేవలం 86 హెక్టార్లలో మాత్రమే రైతులు నాట్లు వేసినట్లు బోర్లు అధికారులు లెక్కలు చెప్తున్నాయి. ఏటా 50 ఎకరాలలో పొగాకు సాగు చేసే తాను ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా ఐదెకరాల్లో మాత్రమే సాగు చేస్తున్నానని కొనకనమిట్ల మండలం బ్రాహ్మణపల్లికి చెందిన రైతు పొదిలి తిరుపతయ్య ఆవేదన వ్యక్తం చేశాడు.
 
వర్షాలు పడితే నారుకు డిమాండ్

వర్షాలు పడితేనే నారుకు డిమాండ్ వస్తుంది. నారుని ఎంతో ఆరోగ్యకరంగా పెంచాం. వర్షాలు పడకపోవడంతో రైతులు పొగ నాట్లు వేసేందుకు మొగ్గు చూపడం లేదు. ఇప్పటికే సగం నారు కొనుగోలు చేస్తారు. కాని ఇప్పటి వరకు ఒక రైతుల కూడా నారు వైపు రాలేదు. పెట్టుబడులు మాత్రం ఎకరానికి రెండు లక్షల రూపాయల వరకు పెట్టాం. వర్షాలు లేకపోతే నష్టాలు తప్పవు. - రామిరెడ్డి, పొగాకు నారు రైతు, కందుకూరు
 
నాట్లు పడకపోతే నష్టాలే..
పొగాకు సాగు చేసే రైతులు పొగనాట్లు వేయకపోతే నష్టాలు తప్పవు. ఏడెనిమిదేళ్లుగా నారు సాగు చేస్తున్నాను. ఎప్పుడు లేని విధంగా ఈ ఏడాది వర్షం నారుమళ్ల రైతులపై కన్నేర్ర చేసింది. నారంతా పీకేందుకు వచ్చింది. ఈ సమయంలో వర్షం పడితే నారుకు ఎలాంటి ఇబ్బంది లేదు. వర్షాలు పడకపోతే నష్టాలు సవి చూడాల్సి వస్తుంది. - శ్రీనివాసులరెడ్డి, పొగనారు రైతు

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా