ఆటో డ్రైవర్ల అతివేగానికి ఒకరు మరణం

12 Nov, 2016 00:22 IST|Sakshi
ఆటో డ్రైవర్ల అతివేగానికి ఒకరు మరణం
- నందికొట్కూరు వద్ద ఢీకొన్న మూడు ఆటోలు
- ఓ మహిళ మృతి
- 18 మందికి గాయాలు
- ఒకరి పరిస్థితి విషమం
   
జూపాడుబంగ్లా: 
ఆటో డ్రైవర్ల అతివేగానికి పొట్ట కూటి కోసం కూలీకి వెళ్తున్న మహిళ బలైంది. రహదారి సరిగా లేదని తెలిసినా పోటాపోటీగా నడుపుతూ ప్రమాదానికి కారకులయ్యారు. నందికొట్కూరు సమీపంలో రబ్బాని వేర్‌హౌస్‌ వద్ద శుక్రవారం ఉదయం మొదట రెండు ఆటోలు ఢీకొని ప్రయాణికులు ఆర్తనాదాలు చేస్తుండగా, నిమిషం తేడాలోనే మరో ఆటో వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ వృద్ధురాలు మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది.  
 
నాగటూరు గ్రామంలో శుక్రవారం ఉదయం 18 మంది వ్యవసాయ కూలీలు ఎక్కించుకున్న ఆటో డ్రైవర్‌ నరేంద్ర తంగెడంచ గ్రామానికి బయలుదేరాడు. అదే రహదారిలో జూపాడుబంగ్లాలో ఆరుగురు ప్రయాణికులను ఎక్కించుకున్న డ్రైవర్‌ వలి నందికొట్కూరుకు బయలుదేరాడు. ఇద్దరు ఒకే వైపు అతివేగంగా వస్తూ అధిగమించే ప్రయత్నంలో నందికొట్కూరు సమీపంలో రబ్బాని వేర్‌హౌస్‌ వద్ద రెండు ఆటోలు ఢీకొన్నాయి. రహదారిపై బోల్తా పడిన ఆటోలో నుంచి గాయపడిన కూలీలు తేరుకుంటుండగా  నందికొట్కూరు నుంచి ఆత్మకూరుకు బీరువాలు తీసుకెళ్తున్న ట్రాలీ ఆటో వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో నాగటూరుకు చెందిన అక్కమ్మ (50) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. అదే గ్రామానికి పెద్దక్క పరిస్థితి విషమంగా ఉంది. వీరితోపాటు నరేష్, సుశీలమ్మ, సువర్ణ, ఆటో డ్రైవరు నరేంద్రతోపాటు తాటిపాడు గ్రామానికి చెందిన వెంకటయ్య, తిరుపతయ్య, నీలిషికారి లక్ష్మీదేవి, రాజు, మాలిక్‌బాషాతో పాటు మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ప్రైవేటు వాహనంలో నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడి నుంచి కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.  ప్రమాదానికి కారణమైన మూడు ఆటో డ్రైవర్లపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు జూపాడుబంగ్లా  ఎస్‌ఐ అశోక్‌ తెలిపారు. మూడు ఆటోలను సీజ్‌చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు.
 
క్షతగాత్రులను స్వయంగా తరలించిన సీఐ: 
సంఘటన స్థలంలో తీవ్రరక్తస్రావంతో విలవిలలాడతున్న బాధితులను చూసిన వారందరూ అయ్యోపాపం అంటున్న వారే తప్పా ఆసుçపత్రికి తరలించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న నందికొట్కూరు  సీఐ శ్రీనాథ్‌రెడ్డి హుటాహుటిన ద్విచక్రవాహనంపై సంఘటన ప్రాంతానికి చేరుకొని రక్తమోడుతున్న  క్షతగాత్రులను స్వయంగా ఎత్తుకొని ఓ ప్రైవేటు వాహనంలో నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంటనే ఆసుపత్రికి వెళ్లి దగ్గరుండి బాధితులకు చికిత్సలు చేయించారు.   
 
మరిన్ని వార్తలు