‘గుడ్లు’ తేలేస్తున్నారు..!

21 Nov, 2015 09:30 IST|Sakshi
‘గుడ్లు’ తేలేస్తున్నారు..!

సాక్షి, హైదరాబాద్: అంగన్‌వాడీ కేంద్రాలకు అర్ధాంతరంగా కోడిగుడ్ల సరఫరా నిలిచిపోవడంతో లక్షలాది మంది లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గుడ్డు ఎందుకివ్వడం లేదని లబ్ధిదారులు ప్రశ్నిస్తుంటే వారికి ఏం చెప్పాలో తెలియక అంగన్‌వాడీ వర్కర్లు గుడ్లు తేలేస్తున్నారు. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ(నెక్)లో రిజిస్ట్రేషన్ అయిన పంపిణీదారుల నుంచే కోడిగుడ్లను కొనుగోలు చేయాలని సర్కారు తాజాగా నిబంధనతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఎక్కువమంది పంపిణీదారులకు నెక్ రిజిస్ట్రేషన్ లేకపోవడంతో వారి నుంచి ప్రభుత్వం కోడిగుడ్లను కొనుగోలు చేయడం మానేసింది.

పాత టెండర్లను రద్దు చేసి కొత్త నిబంధనల మేరకు టెండర్లు పిలిచేందుకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు సన్నద్ధమయ్యారు. నెక్ రిజిస్ట్రేషన్‌తో పాటు పంపిణీదారుల నుంచి కొనుగోలు చేసే ప్రతి గుడ్డు కనీసం 45 గ్రాముల బరువు ఉండాలని స్థానిక పౌల్ట్రీ రైతుల నుంచే కొనుగోలు చేయాలని కొత్త నిబంధనల్లో సర్కారు స్పష్టం చేసింది. ప్రభుత్వ తాజా నిబంధనలతో బేజారెత్తిన కోడిగుడ్ల పంపిణీదారులు హైకోర్టును ఆశ్రయించారు. ఫిర్యాదును పరిశీలించిన న్యాయస్థానం ప్రస్తుతానికి యథాస్థితిని కొనసాగించాలని స్టే ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.

 ఆరు జిల్లాల్లో సమస్య అధికం
 స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే అంగన్‌వాడీ కేంద్రాల్లో కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులందరికీ అనుబంధ పోషకాహారం నిమిత్తం ప్రతిరోజూ ఒకపూట పూర్తి భోజనాన్ని సర్కారు అందిస్తోంది. ఈ మేరకు అవసరమైన బియ్యం, పప్పు, నూనె.. ఇతర ఆహార పదార్థాలతో పాటు ప్రతిరోజూ ఒక గుడ్డు చొప్పున ఏడాదికి ఒక్కో లబ్ధిదారుకు 300 కోడిగుడ్లు ఇవ్వాల్సి ఉంది. అన్ని జిల్లాల్లో కలిపి సుమారు 34 కోట్ల కోడి గుడ్లను సర్కారు కొనుగోలు చేయాల్సి ఉంది. ప్రతి కోడి గుడ్డుకు రూ.4 చొప్పున ఏడాదికి రూ.136 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.

ప్రభుత్వ తాజా నిబంధనల నేపథ్యంలో కోడిగుడ్ల సరఫరా 6 జిల్లాల్లో నిలిచిపోయింది. మహబూబ్‌నగర్, కరీంనగర్, నల్లగొండ, మెదక్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో 15 రోజులుగా అంగన్‌వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు అందడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. కోర్టు స్టే ఉత్తర్వుల మేరకు కోడిగుడ్ల సరఫరా ఆగిపోయిన జిల్లాల్లో తిరిగి పునరుద్ధరించాలని, గతంలో కొనుగోలు చేసిన పంపిణీదారుల నుంచి అవసరమైన మేరకు కొనుగోలు చేయాలని జిల్లాల అధికారులకు ఆదేశాలిచ్చినట్లు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జగదీశ్వర్ ‘సాక్షి’తో చెప్పారు.

మరిన్ని వార్తలు