డిసెంబర్ తొలి వారంలో ఇంజనీర్ పోస్టుల ఇంటర్వ్యూలు

21 Nov, 2015 03:05 IST|Sakshi
డిసెంబర్ తొలి వారంలో ఇంజనీర్ పోస్టుల ఇంటర్వ్యూలు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఇప్పటివరకు వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షలకు సంబంధించి ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు సిద్ధమైంది. తొలుత ఇంజనీర్ పోస్టులకు ముగిసిన రాత పరీక్షలకు సంబంధించి ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సిన అభ్యర్థుల మెరిట్ జాబితాలను ఈనెలాఖరులోగా రూపొందించి ప్రకటించనుంది. ఆయా అభ్యర్థులకు సమాచారం పంపించేందుకు చర్యలు చేపడుతోంది. డిసెంబర్ తొలి వారంలోనే ఇంటర్వ్యూల ప్రక్రియను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇన్నాళ్లు పూర్తిస్థాయిలో కమిషన్ సభ్యులు లేకపోవడంతో ఏఈఈ, ఏఈ, మేనేజర్ వంటి పోస్టులకు నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను ప్రకటించినా ఇంటర్వ్యూలను నిర్వహించలేదు.

ఇంటర్వ్యూలకు ముందుగానే మెరిట్ జాబితాలను ఇవ్వాలన్న నిర్ణయంతో ఆగింది. రెండు వారాల కిందట కమిషన్ సభ్యులను ప్రభుత్వం నియమించడంతో ఆయా ఇంటర్వ్యూల నిర్వహణపై టీఎస్‌పీఎస్సీ దృష్టి సారించింది. మరోవైపు నీటిపారుదలశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా ఖాళీలను భర్తీ చేయాలని ఆదేశించిన నేపథ్యంలో ఇంటర్వ్యూల నిర్వహణకు చర్యలు వేగవంతం చేసింది. ఇంటర్వ్యూ బోర్డుల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని ఈ నెలాఖరులోగా పూర్తి చేయనుంది. డిసెంబర్ మొదటి వారంలో ఏఈఈ (సివిల్) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను ప్రారంభించనుంది. ఆ తరువాత మెకానికల్ ఇంజనీర్ పోస్టులకు, వాటర్ వ ర్క్స్ మేనేజర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించనుంది. ఏఈఈ ఇంటర్వ్యూలు పూర్తయ్యాక, ఏఈ పోస్టులకు ఇంటర్వ్యూలను నిర్వహించాలని కమిషన్ వర్గాలు భావిస్తున్నాయి. కాగా, బీసీ క్రీమీలేయర్ అంశంపైనా ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఈ దిశగా ప్రభుత్వ వర్గాలు చర్యలు చేపట్టినట్లు తెలిసింది.

>
మరిన్ని వార్తలు