పాతనగరంలో తీవ్ర ఉద్రిక్తత

7 Jan, 2017 01:52 IST|Sakshi
పాతనగరంలో తీవ్ర ఉద్రిక్తత

సింగపూర్‌లో నాలుగు రోజుల కిందట యువకుడి మృతి
ఇప్పటికీ తెలియని వివరాలు  
ఉద్యోగానికి పంపిన సంస్థ నిర్వాహకునిపై బాధితుల ఆగ్రహం  
వన్‌టౌన్‌లో భారీ ధర్నా, రాస్తారోకో
బాధితులకు వైఎస్సార్‌ సీపీ నేతల అండ


పాతపోస్టాఫీసు : విదేశాలలో మృతిచెందిన యువకుడి వివరాల కోసం అతని తల్లిదండ్రులు, బంధువులు సోమవారం ఆందోళనకు దిగారు. పాతనగరంలో ధర్నా, రాస్తారోకో చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వివరాల్లోకి వెళ్తే... నగరానికి చెందిన చింతకాయల మహేష్‌ ఈ నెల 22న సింగపూర్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. యువకుడిని సింగపూర్‌కు పంపించిన గ్లోబల్‌ టెక్నికల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ నిర్వాహకుడు తమ్మిరెడ్డి జనార్దన్‌ గత రెండు రోజులుగా సమాధానం చెప్పకపోవడంతో బాధితుల్లో ఆగ్రహం పెరిగిపోయింది. ఇప్పటికే మరణవార్త విని నాలుగు రోజులైందని, తమ కుమారుడి పరిస్థితి ఎంటో తెలియడం లేదని మహేష్‌ తల్లిదండ్రులు బంగారయ్య, పోలమ్మ కన్నీటిపర్యంతమవుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ను కలుసుకుని తమ బాధను వెల్లడిస్తే సంస్థ యజమానికి అనుకూలంగా మాట్లాడుతున్నారని, తమ గోడును పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  

నోరు విప్పని జనార్దన్‌  
సింగపూర్‌లో ఉద్యోగం ఇప్పించిన జనార్దన్‌ నోరు విప్పకపోవడంతో మహేష్‌ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విదేశాలలో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తానని జనార్దన్‌ ఇప్పటికే పలువురు యువకుల వద్ద లక్షలాది రూపాయలు వసూలు చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ఉన్నత ఉద్యోగాల పేరిట విదేశాల్లో కూలి పనులకు పెట్డాడని, ఇటువంటి మోసగాడిని పోలీసులు అరెస్టు చేయాలని మహేష్‌ బంధువులు డిమాండ్‌ చేశారు. శిక్షణ పేరిట యువకులతో సంస్థలో వెట్టిచాకిరీ చేయిస్తున్నాడని ఆరోపించారు. ధర్నా శిబిరం వద్ద జరుగుతున్న విషయాలను తెలుసుకునేందుకు సంస్థ యజమాని జనార్దన్‌ ఒక యువకుడిని అక్కడ ఉంచాడు. ధర్నా వద్ద జరిగే ప్రతి విషయాన్ని ఆ యువకుడు సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రించి పంపుతుండగా పట్టుకున్న మహేష్‌ స్నేహితులు మరింతగా ఆగ్రహించి సంస్థ మీద దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఒకటో పట్టణ పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని పరిస్థితిని అదుపుచేశారు. పట్టు వదలని బాధితులు రాస్తా రోకో నిర్వహించి ట్రాఫిక్‌ను స్తంభింపచేశారు. సీఐ వెంకటరావు జోక్యం చేసుకుని బాధితులకు నచ్చచెప్పడంతో రాస్తారోకో విరమించారు. డాక్టర్‌ జహీర్‌ అహ్మద్, యువభారత్‌ ఫోర్స్‌ అధ్యక్షుడు మహ్మద్‌ సాదిక్‌లు బాధితులకు అండగా నిలిచారు.  

మృతుని కుటుంబీకులతో చర్చలు
మృతుడు మహేష్‌ కుటుంబానికి చెందిన పెద్దలతో పాటు డాక్టర్‌ జహీర్‌ అహ్మద్, మహ్మద్‌ సాదిక్, ముత్యాలమ్మపాలెం సర్పంచ్‌ డి.ధనలక్ష్మి, డి.అచ్చిబాబు హార్బర్‌ పోలీస్‌ స్టేషన్‌లో జనార్దన్‌ పంపిన ప్రతినిధితో చర్చలు జరిపారు. రాత్రి వరకూ కొనసాగిన చర్చలు పూర్తిగా విఫలం కావడంతో బాధితులు వెనుతిరిగారు.

వైఎస్సార్‌ సీపీ నేతల భరోసా  
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ ధర్నా శిబిరానికి చేరుకుని బాధితులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆయనతోపాటు విశాఖ దక్షిణ, పెందుర్తి నియోజకవర్గాల సమన్వయకర్తలు కోలా గురువులు, అన్నంరెడ్డి అదీప్‌రాజు, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, నగర మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు మహ్మద్‌ షరీఫ్, 25వ వార్డు అధ్యక్షుడు సూరాడ తాతారావు ఉన్నారు. 

మరిన్ని వార్తలు