-

భూ పరిహారం ఖరారు

23 Jul, 2016 23:00 IST|Sakshi
మాట్లాడుతున్న కలెక్టర్‌
  • శ్రీరాం సాగర్‌ రెండోదశ, భక్తరామదాసు ఎత్తిపోతలలో భూములు కోల్పోతున్న రైతులతో కలెక్టర్‌ సమావేశం
  • ఖమ్మం జెడ్పీసెంటర్‌ : శ్రీరాం సాగర్‌ రెండోదశ, భక్తరామదాసు ఎత్తిపోతల పథకాల పంట కాలువల నిర్మాణ పనులకు అవసరమైన భూమిని సేకరించే సమయంలో,   భూములు కోల్పోతున్న రైతులకు పరిహారాన్ని ఖరారు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ డీఎస్‌.లోకేష్‌కుమార్‌ తెలిపారు. శనివారం నగరంలోని టీటీడీసీ భవన్‌లో ఖమ్మం రూరల్‌ మండలం, కూసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాలకు చెందిన రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూములను అప్పగించేందుకు రైతులతో జిల్లా కలెక్టర్‌ ధరను ఖరారు చేశారు. రైతుల పొలాలలో మోటర్లు,పైపులు, ఇతరత్రా ఏమైనా కోల్పోయినా వాటికి నష్టపరిహారం అందిస్తామన్నారు. పంటకాలువల నిర్మాణం వల్ల రైతులు తమ పొలాలకు వెళ్లడానికి ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పగా చిన్న ,చిన్న వంతెనలు నిర్మిస్తామని కలెక్టర్‌ తెలిపారు. ఖమ్మం రూరల్‌ మండలానికి చెందిన 49 మంది రైతుల నుంచి 12.06ఎకరాలు, కూసుమంచి మండలానికి చెందిన 18 మంది రైతుల నుంచి 8.22 ఎకరాలు, ముదిగొండ మండలానికి చెందిన నలుగురు రైతుల నుంచి 0.13 ఎకరాలు, నేలకొండపల్లి మండలానికి చెందిన ఇద్దరు రైతుల నుంచి 0.07 ఎకరాలు, అదేవిధంగా తిరుమలాయపాలెం మండలానికి చెందిన 63 మంది రైతుల నుంచి 17.8 ఎకరాల భూమిని పంటకాలువల నిర్మాణ  నిమిత్తం ఇచ్చేందుకు రైతులు తమ అంగీకారాన్ని తెలియజేస్తూ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో జేసీ దివ్య, ఖమ్మం ఆర్డీఓ వినయ్‌కృష్ణారెడ్డి, ఆయా మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.
     
మరిన్ని వార్తలు